బర్రెలక్క(శిరీష)కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : నేడు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుక వినిపించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క(అలియాస్ కర్నె శిరీష)కు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని అంజలీ తెలంగాణ రాష్ట్ర అనాధ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, అనాధ హక్కుల పోరాట వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క వెంకటయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి, చట్టసభల్లో అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇలాంటి యువతకు అవకాశాలిచ్చి చట్టసభల్లో కొత్త గొంతుక వినపడేలా అవకాశం కల్పించాలని, అందుకే తాను శిరీషకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆమె ధైర్యసాహసాలు అందరికీ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై 9 సంవత్సరాలు కావస్తున్నా సంపూర్ణంగా ఉద్యోగాలు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కొండంత ఆశతో ఎదురు చూస్తూ తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎట్టకేలకు మొండి చెయ్యే మిగిలిందన్నారు. బంగారు తెలంగాణ అంటూ సంకలు బాదుకున్న కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు కెసిఆర్ కు ఈ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగుల కడుపు మండితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *