‘‘ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్,రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్.సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్ విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు నీళ్ళు నమలడం తప్ప ఏ అభ్యర్థి దగ్గర సరియైన సమాధానంలేదు.’’
ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్,రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్.సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్ విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు నీళ్ళు నమలడం తప్ప ఏ అభ్యర్థి దగ్గర సరియైన సమాధానంలేదు. రాత్రికి రాత్రే ఉపాధ్యాయులను చెట్టుకొకరు పుట్టకొకరినిచేసి కుటుంబాలను చిన్నాభిన్నంగా మార్చిన 317 జి.ఓ అమలవుతున్నప్పుడు ఇదే యం.ఎల్.సిలు జాడ పత్తాలేకుండా పోయారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే గా•న కట్టి 317 జి.ఓను అమలు చేయడం సాధ్యం కాదని గొంతెత్తి మాట్లాడాల్సిన పెద్ద సంఘాలు అంతా మాకు తెలిసే జరుగుతుందని, ఏడు నుండి పది శాతం ఉపాధ్యాయులు మాత్రమే దూరప్రాంతాలకు వెళతారని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన సంఘమే తమ సర్వస్వం అని నమ్మిన ఉపాధ్యాయుల గొంతును తెగ్గోసి తమ స్వార్థ ప్రయోజనాలకు బలి చేయగా, ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ జి.ఓ అమలు వల్ల దూరపు జిల్లాలకు వెళ్ళినవాళ్లు సంతృప్తిగాలేరు, స్వంత జిల్లాకు వచ్చిన వాళ్ళు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.
1975 పద్ధతిలో జిల్లాలకు కెటాయింపులు చేయకపోవడం వల్ల 40 శాతం పైబడి ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగడంతోపాటు కొత్త సమస్యలు తలెత్తి కోర్టులో నలుగుతున్నాయి. ఆ గాయాల నుండి ఉపాధ్యాయులు ఇప్పుడిప్పుడే కోలుకుంటు, మా గతి ఇంతే అనుకొని పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పుండు మీద కారంజల్లినట్లు జి.ఓ 5 ద్వారా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించారు. 317లో అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయడం కోసం జీరో సర్వీస్ ప్రాతిపదికగా లేదా పాత స్టేషన్ స్టాండింగ్ పాయింట్లు ఇచ్చి బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ ఎంతగజెప్పిన అధికారులు వినలేదు. కోర్టు మొట్టికాయలు వేసి పరువుతీస్తే తప్ప దిగిరాని పరిస్థితి విద్యాశాఖలో దాపురించింది.
అటు కొత్త రిక్రూట్‌మెంట్‌లేక ఇటు ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్ళుగా ప్రమోషన్లు, ఐదేళ్ళుగా బదిలీలు లేక పాఠశాలలోని ఖాళీల వల్ల విద్యావ్యవస్థ ప్రజల విశ్వాసంకోల్పోపోయి పతనం అంచున నిలబడిఉంది. 30 ఏళ్ళుగా కోర్టుల్లో నలుగుతున్న సర్వీస్ రూల్స్ సమస్య ఎందుకు తెగదో అర్థంకాదు! తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్వీస్ రూల్స్ ఏపాటి సమస్య అని నమ్మబలికితే నమ్మాం! కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లను ఆహ్వానించి కేరింతలు కొడితే ఉపాధ్యాయుల కొంపమునిగింది. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కై రాష్ట్రపతి గెజిట్ ఇస్తే కోర్టులు స్టే ఇచ్చాయి. ఇప్పుడు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారంగా పోస్టులన్ని సెప్టెంబర్ 30, 2015న కోర్టు చెప్పినట్లు లోకల్‌క్యాడరైజేషన్ అయినప్పటికీ, ఈ విషయాలన్ని కోర్టుకు నివేదించి ప్రభుత్వ, పంచాయితీ రాజ్ సర్వీస్‌లను ఏకీకృతం చేయడానికి అవకాశం ఉన్నా, రాజ్యాంగంలోని 309 ఆర్టికల్ అందుకు అనుమతిస్తున్నా విద్యాశాఖా ధికారుల అలసత్వం వల్ల ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉండి రెండు మేనేజ్‌మెంట్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతుంటే ఆ సమస్య ఏమైందో, ఏ స్థితిలో ఉందో చెప్పకుండానే ఎవరి ప్రమోషన్లు వారికే అంటూ షెడ్యూల్ ఇచ్చారు.
మరి 30 ఏళ్ళుగా దీన్ని బూచిగా చూపి నెల నెల ఇచ్చే ప్రమోషన్లను సంవత్సరాల తరబడి నానబెట్టి ఉపాధ్యాయుల జీవితాలతో ఎందుకు ఆడుకున్నట్లు, ఇంకెంతకాలం దీన్ని చూపి చలికాచుకుంటారు?ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ యం.ఎల్.సి ఎన్నికలు తెరమీదికి వచ్చినప్పుడల్లా పండితుల అప్‌గ్రెడేషన్ సమస్య సంఘాలకు, అధికారగణానికి గుర్తుకొస్తుంది. ఏవో కొన్ని జి.ఓలిచ్చుడు, రేపు,మాపు అంటూ ఊరిచ్చుడు ఏరుదాటంగనే బోడమల్లప్పలను ఎన్నిసార్లు చేసినారో? మళ్లీ ఇప్పుడు అదే కథ! 2017లో విడుదలైన 17, 18జి.ఓలు, 2019లో ఇచ్చిన 15 జి.ఓ ఏమైనట్లు? కోర్టుల్లో కేసులు వేసేవిధంగా రూల్స్ తయారుచేసుడు, ఎవ్వరు కేసు వేస్తారా అని ఎదిరి చూసుడు, కేసు ఉంది కదా ఎలా అని సమాధానమివ్వడం ఎంతకాలం? ఎస్.జి.టిలు, పండితుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పంచాయితీతో భాషాపండిట్లను బజారునవేసింది ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు కాదా! 5250 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులిస్తమని చేసిన ప్రకటన నాటినుండి ఎస్.జి.టిలు చెప్పులరిగేలా అధికారగణం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా స్పౌజ్, నాన్ స్పౌజ్‌ల పంచాయితీని తెరమీదికి తెచ్చారు. కోర్టుల్లో వేల కేసులు నలుగుతున్నా విద్యాశాఖాధికారుల వద్ద కాలమే పరిష్కరిస్తుందనే నిట్టూర్పు తప్ప స్పష్టతలేదు, సమాధానంలేదు.
గతంలో జిల్లా స్థాయి పోస్టుగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోన్ స్థాయిగా ఎందుకు మార్చారో, ఎవ్వరి ప్రతిపాదన, ప్రయోజనాల కోసం లోకల్‌క్యాడరైజేషన్ చేసారో అర్థంకాదు. ఒకటవ మల్టీ జోన్‌లో ఉన్న 19 జిల్లాల్లో 1004, రెండవ మల్టీజోన్‌లోని 14 జిల్లాల్లో 761ఖాళీలుఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రమోషన్ వస్తుంది అనుకున్న చాలా మందికి ఇప్పుడు ప్రమోషన్‌రాదు. ఖాళీలు ఉన్న జిల్లాల్లో ఆ జిల్లా వారికి అవకాశంలేదు, ప్రమోషన్ పొందే జిల్లావారు వయస్సు ప్రభావంవల్ల, ఒక ప్రాంతంలో స్థిరపడి ఉండడం వల్ల దూరప్రాంతాలకు వెళ్ళడానికి సముఖంగా లేరు కాబట్టి ప్రమోషన్లను ప్రత్యక్ష పద్ధతిలో నింపాలని టి.టి.యు ఇతర సంఘాలు డిమాండ్ చేస్తున్నా విద్యాశాఖ మాత్రం అనాలోచితంగా వెబ్ కౌన్సిలింగ్/ఆన్‌లైన్ పద్దతిలో నాట్ విల్లింగ్ ఆప్షన్ లేకుండానే నింపడానికి ప్రయత్నించడం విజ్ఞత కాదు కదా మరో కొత్త వివాదానికి సంకేతం! ఇప్పటి వరకు 13 జిల్లాల్లో ఖాళీలు లేవన్న ప్రభుత్వం, అధికారులు ఏ నిబంధనలు లేకుండానే ఆకస్మికంగా స్పౌజ్ బదిలీలకు తెరలేపి, స్కూల్ అసిస్టెంట్లలో కొంతమందికి మాత్రమే ఇచ్చి చాలామందిని మరియు ఎస్.జి.టి స్పౌజ్ బదిలీలు ఎందుకు పక్కకు పెట్టారో అర్థంకాదు.
సందెట్లో సడేమియాలాగా వందకు పైబడి చెక్ స్లిప్స్ ఇచ్చి ఖాళీలను నింపి అటు నిరుద్యోగుల, ఇటు బదిలీ కోరుకుంటున్న వారి నోట్లో మట్టికొట్టింది. ఇంకా వేలల్లో పలుకుబడి బదిలీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాట్సప్‌లో అప్లికేషన్ పంపితే బదిలీ ఉత్తర్వులు వెలువడుతున్నాయంటే ఉపాధ్యాయబదిలీ(ల)లు ఎంత విషమంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. 317 బాధితుల స్థానికత డిమాండ్ అటకెక్కింది. రోజుకో ఉత్తర్వు, పూట పూటకో నిర్ణయంతో ఉపాధ్యాయులు బేజారవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎండాకాలంలో చేయాల్సిన బదిలీలు, ప్రమోషన్లను యం.ఎల్.సి ఎన్నికల కోసం చేయడంవల్ల పాఠశాలలు, పాఠాలు గతితప్పాయి. క్యాడర్ స్ట్రెంత్, రోస్టరు విధానం, అడిక్వసీ, వర్కింగ్ పోస్టులు, ఖాళీల సంఖ్య కంప్యూటర్ యుగంలోను సిద్ధంగాలేక సెన్సెక్స్‌లాగా లిస్టులు డి.ఇ.ఓ ఆఫీసుల్లో మారుతూనే ఉన్నాయి. ఏ డీ.ఎస్.సికి సంబంధించిన సీనియారిటీ లిస్టులు, ర్యాంకులు విద్యాశా ఖాధికారుల వద్దలేకపోవడం షరా మామూలే! వందసార్లు సవరిస్తే వేయి తప్పులతడకగా లిస్టులు బయటకు వస్తున్నాయి. కోర్టు గండం ఎట్లాగు ఉండనే ఉన్నది.
గతంలో బదిలీలు, ప్రమోషన్లలో అవినీతికి, అక్రమాలకు పాల్పడిన ఓ జిల్లా విద్యాశాఖాధికారిపై వచ్చిన ఫిర్యాదుపై అప్పటి కమీషనర్ మాట్లాడుతూ ‘డి.ఇ.ఓలను సస్పెండ్ చేయడం ప్రారంభిస్తే ఏ జిల్లాకు డి.ఇ.ఓ మిగలడు’ అని చెప్పడాన్ని బట్టి ఎంత దుర్భర పరిస్థితుల్లో పాఠశాల జిల్లా విద్యాశాఖకార్యాలయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత అసమర్థ, అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన శాఖ పారదర్శంగా బదిలీలు నిర్వహించాలని నారాయణ మంత్రంలా పారాయణం చేయడం నేతి బీరలో నేయిని వెదకడమే! అన్నింటిని ఎన్నికలతో ముడిపెట్టినట్టే బదిలీలు, ప్రమోషన్లను ముడిపెడితే పాఠశాలల మంగళం పాడటానికి ముహూర్తం దగ్గరపడ్డట్టే! ఈ యం.ఎల్.సి ఎన్నికల్లో కీలెరిగి వాత పెట్టడమే ప్రత్యామ్నాయం!!
– డాక్టర్ ఏరుకొండ నరసింహుడు
రాష్ట్ర ప్రధానకార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్
9701007666




