ఆ జాగల కాసేపు నడుము వాల్చు
పిట్టల చప్పుడు ఖాలీలను పూరిస్తది
చేతిలో గడ్డి పరకలు ముచ్చట్లు చెప్తాయ్
పైన కొమ్మలు ఏడికో తీసుకుపోతాయ్
చెట్లవేర్లు మెదడునరాలు కలిసిపోయాయి
మనలోంచి అవి వచ్చినట్లు…
‘ఊమ్’ అని పలకాలని ప్రయాస
గొడ్డలితో మెడవరకు నరుక్కుపోతరు
వ్యథలకు బలహీనతలను అంటగడతరు
అవసరాల పువ్వులొస్తాయ్ వికారంగా
అనవసరపు మాటల తీగలు విహీనంగా
గొడుగులకు చిల్లులు లేకుండా
గొంతులకు సిగ్గులు లేకుండా
మోస్తూ ఉన్నాం బతుకు గడియారాన్ని
అవహేళన సంబంధాల్లో
అసంబద్ధ సంతృప్తుల్లో
ఏం వెతుక్కుంటున్నామో
సిసలైనది మర్చిపోయి
లోతును తేలిక చేసి
లోలోతులకు కూరుకుపోయి
వికృతంగా వ్యవహరిస్తున్నాం
లోకం తీరు బెల్లం పాకం
అర్థం పర్థం అసహ్య తీర్థం
అమ్మా అయ్యా పిల్లా జల్లా
సదువూ సంతా పైసామే పరమాత్మ
గురకలు కొడుతూ పండినం భయం దిండు మీద
ఎదల మీదనుంచి వెళ్ళి చెట్లెక్కిరి వాళ్ళు
కల మేల్కొంటే అరుస్తాం కొట్లాడ్తాం గుంజుకుంటాం
లేదంటే వాళ్ళలో కలుస్తాం..!!
– వగ్గు రఘువీర్




