బడుగుల విద్యాలయాలకు భరోసా కల్పించే వీసీలు కావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థను సంపూర్ణంగా బ్రష్టు పట్టించిన గత ప్రభుత్వ నిర్వాకం నుండి యూనివర్సిటీలను సరికొత్తగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రభుత్వం సంపూర్ణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో అర్హులైన,సమర్థులైన, సచ్చీలురైన వీసీల ఎంపికే కీలకం కానుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ముందు యూనివర్సిటీలకు నిధులు ఎంత వచ్చేవో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా అంతే విడుదల చేసి, వీలైతే మరింత తగ్గించి ఈ ఉన్నత విద్యావ్యవస్థను కునారిల్లెలా చేసిన గత ప్రభుత్వ నిర్వాకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బడుగుల బడులుగా ఉన్నత విద్యకు ఆలవాలమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిధుల లేమితో అధ్యాపకుల కొరతతో సౌకర్యాల లేమితో సంక్షోభంలో ఉన్నాయి.తెలంగాణ సాధించుకున్న గత పది సంవత్సరాలలో ఒక్క యూనివర్సిటీ అధ్యాపకుడు కూడా నియామకం కాలేదంటే ఉన్నత విద్యపై అప్పటి ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి పరాకాష్ట.భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు గా రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ వీసి, ఏసీబీకి పట్టు పడడం అప్పటి యూనివర్సిటీల ప్రతిష్ట ఎంతగా మసకబారిందో ఒక పరాకాష్ట ఉదాహరణగా మిగిలింది.ఇక కాకలు తీరిన కాకతీయ వీసి కి పది ఏండ్లు నిండకున్నా పలుకుబడితో నియమించి కోర్టు మెట్లు ఎక్కాల్సిన కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చూసినం.ఆయన చేసిన మూడేండ్ల పాలనలో చేసిన అక్రమాలు,అవినీతి,అభివృద్ధి పై విజిలెన్స్ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.ఇలాంటి సంఘటనలు యూనివర్సిటీల ను,వీసీ పదవులను అపహాస్యం చేయడంతో పాటు మాయని మచ్చ మిగిల్చాయనే  అపవాదు మూటకట్టుకుంది .

గత పది సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పనితీరును సంస్కరించి అదొక క్రియాశీల వ్యవస్థగా తీర్చిదిద్దాలి.ఉన్నత విద్యా మండలి నీ అనర్హులు, జోకర్లతో నింపి,వ్యవస్థను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వ నిర్వాకానికి భిన్నంగా ఈసారైనా ఉన్నత విద్యా వ్యవస్థ పై సంపూర్ణ అవగాహన కలిగి, ఉదాత్తమైన ఆలోచనలతో ఉన్న కార్యశీలురైన సీనియర్ ఆచార్యులతో ఉన్నత విద్యా మండలి మరింత క్రియాశీలకం ప్రభా ప్రభావశీలంగా చేయాలి.ఉన్నత విద్యా మండలి అంటే కేవలం “దోస్తు” అడ్మిషన్ల వ్యవస్థ ద్వారా డిగ్రీ సీట్లు నింపే వ్యవస్థగా దాని ప్రతిష్టను సంపూర్ణంగా దిగజార్చిన వారికి భిన్నంగా ఈసారి యూనివర్సిటీలను పరిశోధన కేంద్రాలుగా, ఇన్నోవేషన్ హబ్స్ గా తీర్చిదిద్దే అకాడమిక్ నాయకత్వం రావాలి.ప్రతి నెల విశ్వవిద్యాలయాల పనితీరుపై, వీసీల నిర్ణయాలపై సమీక్ష చేస్తూ ఒక పటిష్టమైన మానిటరింగ్ చేసే వ్యవస్థగా విద్యా మండలి పనిచేయాలి.అప్పుడే స్వయంప్రతిపత్తి పేరుతో తుగ్లక్ లాంటి నిర్ణయాలతో యూనివర్సిటీలను బ్రష్టు పట్టించే వీసీల ఆగడాలకు తెరపడుతుంది.ప్రతి నెల 10వ తారీఖున గత నెలలో ప్రతీ యూనివర్సిటీ ఖర్చుపెట్టిన నిధుల వివరాలు,తీసుకున్న ఇతర నిర్ణయాల పై సంపూర్ణ సమీక్ష జరగాలి.సామాజిక వర్గం చిన్నబోతుందని అర్హత లేని వాండ్లకు వీసీలుగా అవకాశాలు కల్పించడం వల్ల,గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైస్ ఛాన్సలర్లు నిర్వాకం వల్ల బడుగుల దేవాలయాలు గా చెప్పుకునే విశ్వవిద్యాలయాలు చదువుకు నోచుకోక, భ్రష్టు పట్టినాయంటే అతిశయోక్తి కాదు.రేవంత్ మార్క్ ఉండేలా కేసీఆర్ నియమించిన ఉన్నత విద్య మండలి యుద్ధ ప్రాతిపదికన మార్చాలి.ఈసారి మెరుపు వేగంతో వివిధ విశ్వవిద్యాలయాల కు పాలక మండలి,సెర్చ్ కమిటీలు నియమించి వీసీల పదవీకాలం ముగిసిన నలభై రోజుల్లో కొత్త వీసీ లను నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడం బడుగుల సంతోషానికి అవధులు లేవు.

రాష్ట్రం లోని ప్రతి విశ్వవిద్యాలయం ఇప్పుడు అధ్యాపకుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది.అనేక విభాగాలు కనీసం ఒక్క ఆచార్యుడు కూడా లేకుండా నెట్టుకొస్తున్నాయి.పరిశోధనలు ఎప్పుడో మూలనపడ్డాయి,  ఆవిష్కరణలు అన్న మాటే లేదు.ఇలాంటి పరిస్థితులలో వీసీల నియామకం తర్వాత అత్యంత ప్రాధాన్యతతో రెగ్యులర్ అధ్యాపకులు నియామకాలు జరగాలి.ఒక విశ్వవిద్యాలయ వీసీ కే సంపూర్ణంగా అధికారాలు కట్టబెట్టకుండా కనీసం ఒక ఇంటర్వ్యూ బోర్డులో ప్రభుత్వ నామినీ గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి ఇంటర్వ్యూ బోర్డులలో ఉన్నప్పుడే ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన వారు మాత్రమే అధ్యాపకులుగా ఎంపిక అవుతారు. అప్పుడు మాత్రమే బంధుప్రీతి అవినీతి, ఆశ్రితపక్షపాతం నియామకాల్లో తగ్గుతుంది.వీసీ లు ఆడిందే ఆట పాడిందే పాట గా ఉండకుండా చూడాలి అంటే…ప్రతీ యూనివర్సిటీ కి సమర్థులైన సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి.సమీక్షలు నిరంతరం జరగాలి.వీసీలు అంటే బిల్డింగులు కట్టడం,కాంట్రాక్టర్లతో కమిషన్లు పొందడం,నాక్ అక్రెడిటేషన్ పేరు చెప్పి అడ్డగోలు సుందరీకరణ పనులు చేపట్టడం, చేతివాటం ప్రదర్శించడం, అనుయాయులకు పదవులు కట్టబెట్టి అక్రమాలకు పాటుపడటం రివాజుగా మారింది.ఇలాంటి విపరీత పోకడలకు చెక్ పెట్టాలంటే భవన నిర్మాణ పనులను యూనివర్సిటీల బాధ్యతల నుండి తప్పించాలి.

రాష్ట్రస్థాయిలో ఒక సంస్థ ఇలాంటి పనులు చేపట్టాలి.వీసీలు కేవలం అకాడమిక్ పరిపాలనకు  మాత్రమే పరిమితం అయితే అసాధ్యమనుకున్నవి సుసాధ్యం కావడం ఖాయం.ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పనితీరును సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా సంపూర్ణంగా అర్హులైన, నిస్వార్థపరులైన, నిరాడంబరులైన,మంచి విజన్ కలిగిన ప్రొఫెసర్లను మాత్రమే వీసీలు గా నియమించి ఈ వ్యవస్థలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మంత్రులు,సీనియర్ నాయకులు సిపారసు చేసినా అర్హతతో పాటు వ్యక్తిత్వం, అవినీతి ట్రాక్ రికార్డ్ లేని అభ్యర్థులను సెర్చ్ కమిటీలు సూచించాలి.

సామాజిక సమతూకం పాటిస్తూనే, మంచి పరిపాలన అనుభవం ఉన్న, విద్యార్థులకు భవిష్య దిశా దశ నిర్దేశం చేయగలిగిన సమర్ధులైన ఆచార్యులను మాత్రమే వీసీలుగా ఎంపిక చేయాలి.రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో పేరెన్నికగన్న మంచి అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్ రికార్డు ఉన్న నికార్సైన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాల్సిన ఆవశ్యకత ఉంది. వీసీల నియామకంలో రేవంత్ మార్క్ కనపడాలి.ప్రతీ విశ్వవిద్యాలయ క్యాంపస్ హరిత క్యాంపస్ గా తీర్చిదిద్దాలి. ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంగా పరిడవిల్లాలి. ఇన్నోవేషన్ సెంటర్ గా తీర్చిదిద్దబడాలి.విద్యార్థులకు నైపుణ్య శిక్షణ నిరంతరం జరగాలి, విశ్వవిద్యాలయాలకు గ్రాంటులు పెంచాలి,  పరిశోధనలకు ప్రోత్సాహం లభించాలి, అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలి. ఉద్యోగ అవకాశాల కల్పనకు అవసరమైన నిరంతర నైపుణ్య శిక్షణ జరిగినప్పుడు మాత్రమే ఈ విశ్వవిద్యాలయాలు ‘నిరుద్యోగుల తయారీ కర్మగారాలు’ మాత్రమే అన్న అపప్రద నుండి  బయటపడతాయి.ఏది ఏమైనా ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వం లో విశ్వ విద్యాలయాలు గొప్ప ఉన్నత విద్యా కేంద్రాలు గా ఎదుగుతాయని ఆశిద్దాం.

డాక్టర్ సంగని మల్లేశ్వర్,
రాష్ట్ర అధ్యక్షులు,
ఫూలే ఆశయ సాధన సమితి
సెల్-9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *