మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 28 : పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సహా పలువురిపై మేడిపల్లి ఠాణాలో కేసులు నమోదయ్యాయి. చెంగిచర్లలో గత ఆదివారం జరిగిన దాడుల నేపథ్యంలో పలువురు మహిళలు గాయాలపాలవడంతో వారిని బుధవారం బండి సంజయ్ పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. అయితే ఘటనా స్థలానికి ఎవరూ వెళ్ళకుండా పోలీసులు నిషేదాజ్ఞలు విదించి భారీ పహారాతో పాటు బారికేడ్లతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే బండి సంజయ్ రాకతో ఒక్కసారిగా గుమిగూడిన నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి బారికేడ్లు తోసివేసి బాధితులను పరామర్శించారు.
కాగా తమ విధులకు ఆటంకం కలిగించారని నాచారం ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు బండి సంజయ్ సహా ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు పవన్ రెడ్డి, ప్రభంజన్ గౌడ్‌తో పాటు మరి కొంత మందిపై 332, 353, 149, 3, 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి ఎస్‌హెచ్‌వో గోవింద్ రెడ్డి మాట్లాడుతూ సున్నితమైన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ శాంతిభధ్రతలకు భంగం కలిగించే విదంగా ఎవరూ చట్టాన్ని అతిక్రమించొద్దని, సంయమనం పాటించాలని, ప్రశాంత వాతావరణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెంగిచర్ల ఘటనపై సమగ్రంగా నిస్పక్షపాత దర్యాప్తు కొనసాగుతోందని ఇందులో అపోహలకు తావులేదని స్పష్టం చేశారు.
చెంగిచర్లకు వెళ్తానన్న గోషామహల్ ఎమ్మెల్యే
అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు. అయితే అక్కడకు వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసులు అతనిని హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగ నాడు చెంగిచెర్లలో హిందువులపై ఓ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో గిరిజన మహిళలు, యువకులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్తానని రాజాసింగ్ చెప్పడంతో పోలీసులు అతనికి అనుమతివ్వలేదు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
దాడికి గురైన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. చెంగిచెర్లకు వెళ్లి బాధితులను పరామర్శిస్తామంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు. హిందువులపై అకారణంగా దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లనీయరా? అని నిలదీశారు. గాయపడిన మహిళలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామన్నారు.



