సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో లాభాలుంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇది కార్డులో లేని వివరాలు తెలుసుకొని నమోదు చేయించే కార్యక్రమమని చెప్పారు. కొత్తగా పెళ్లి అయిన వారి, మృతి చెందిన వారి వివరాలు అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ’వన్ స్టేట్ వన్ కార్డు’లో భాగంగా ఈ కార్యక్రమం లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తించనున్నాం. ఇదే కార్డు ఆరోగ్యానికి, రైతుబంధు, బీమా తదితరాలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ కార్డు సర్వే ప్రారంభిస్తున్నాం. కుటుంబానికి ఒక గుర్తింపు ఉండేలా కార్డు తయారు చేస్తాం. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. రేషన్ కార్డు లేక రుణమాఫీ ఆగిన వాళ్లకు అతి త్వరలో తప్పకుండా వొస్తుంది. ఈ కార్యక్రమంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే అధికారులకు ధైర్యంగా చెప్పవచ్చు. మిగతా ప్రాంతాల్లో సమస్య లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది‘ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.





