ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదే..

  • ఈ కేసులో సూత్రధారి పై చర్యలు తీసుకోవాలి
  • చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు
  • దిల్లీ పెద్దల ఒత్తిడితో రాజీకి యత్నం
  • ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలోకి బిఆర్‌ఎస్‌
  • రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌  

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదేనని ఇందులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌  డిమాండ్‌ చేశారు. బుధవారం దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు  వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను వెలికితీసి నిందితులను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్‌ నాయకులు.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో,.. అంతకుముందు టీఎస్పీఎస్సీ అవకతవకలపై హడావిడి చేసి.. తదనంతరం అంతా మర్చిపోయారని విమర్శలు  గుప్పించారు. ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ పైనా అదే ధోరణి అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలోనే స్వయంగా వెల్లడిరచినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి, ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సిన వ్యవస్థను… సొంత ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకులపై, సొంత పార్టీలోని నాయకులపై, రియల్టర్లు, వ్యాపారులు,  జర్నలిస్టులు, అడ్వకేట్లు, జడ్జిలు, చివరకు విద్యార్థులపైనా, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసేవారిపై కూడా ఉపయోగిస్తే… ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నిప్పులు చెరిగారు.  ల్యాండ్‌ సెటిల్మెంట్లకు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ ను వాడుకొని… చివరకు వ్యాపారుల నుంచి బలవంతంగా పార్టీ ఎలక్టోరల్‌ బాండ్లు కొనిపించారని తెలిపారు. నిఘా వ్యవస్థ మొత్తం బిజెపి నాయకుల డబ్బును పట్టుకునేందుకు…బిజెపి ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు… బీఆర్‌ఎస్‌ డబ్బును సురక్షితంగా చేర్చాల్సిన చోటుకు చేర్చేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నడిపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశ ద్రోహం లాంటిదేనని, ఈ దేశ ద్రోహులను ఉపేక్షించ వద్దన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు వేస్తున్నారు. ఢల్లీి పెద్దల ఒత్తిడితో రేవంత్‌ ఈ కేసులో రాజీపడుతున్నారని ఆరోపించారు. తానే ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడే అయినా రేవంత్‌ ఏం చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంతో  కాంగ్రెస్‌ – బిఆర్‌ఎస్‌ ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఇండీ కూటమి లో చేరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో దిల్లీ బిజెపి నేతను  కేసులో ఇరికించి, కవిత ను కాపాడేందుకు ఈ కేసును వాడుకోవాలని కుట్ర జరిగిందని పోలీసు అధికారులు వాంగ్మూలంలో చెప్పడం, వారి దిగజారుడు చర్యలకు పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపికి డబుల్‌ డిజిట్‌ ఖాయమని డాక్టర్‌ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *