ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

  • దోషులకు శిక్షపడేవరకూ పోరాటం ఆగదు..
  • నిందుతులు వాంగ్మూలం ఇచ్చినా వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు
  • లోక్‌ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం
  • పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన కేసీఆర్‌
  • కేసీఆర్‌, హరీష్‌రావు డైరెక్షన్‌లోనే ఫోన్‌ ట్యాపింగ్‌
  • ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నాలో రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ లక్ష్మణ్‌..
  • పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఏలు, నేతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకూ తమ పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్క్‌ వద్ద శుక్రవారం జరిగిన ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా  బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ…తెలంగాణ చరిత్రలో రేవంత్‌ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాల్సిం దేననన్నారు. కాంగ్రెస్‌ మోసాన్ని గ్రహించి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని, తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే తామే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల   ముందు రేవంత్‌ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్న దాన్ని కక్కిస్తానని చెప్పి, ఇప్పుడు కేసీఆర్‌ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్‌ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని, ఉప ఎన్నికల్లో వోటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అరెస్ట్‌ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా.. మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని లక్ష్మణ్‌ ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రేవంత్‌ రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?
టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందని ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. తాను కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడినని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి..ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..అంటూ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలని అన్నారు. బీజేపీ సీనియర్‌నేత బీఎల్‌ సంతోష్‌ మీద కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. లిక్కర్‌ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. బీఆర్‌ఎస్‌ నీచ  రాజకీయాలకు పాల్పడిరదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్‌ రెడ్డికి కూడా అదే గతిపడుతుందని లక్ష్మణ్‌ హెచ్చరించారు.  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లూ ట్యాప్‌ చేశారన్నారు. దీనిపై రేవంత్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.  బీఆర్‌ఎస్‌ అక్రమ సంపాదనను తరలించి పోలీస్‌ వ్యవస్థను కేసీఆర్‌ దుర్వినియోగం చేశారన్నారు. కేసీఆర్‌, హరీష్‌ రావు డైరెక్షన్‌లోనే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు పోలీస్‌ అధికారులు చెప్పారన్నారు. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం..
ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని ఎంపీ లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఫేక్‌ సినిమా డ్రామా అని తానే ముందు చెప్పానన్నారు. లిక్కర్‌ కేసులో కవితను గట్టెక్కించేందుకు ్నఎమ్మెల్యేల కేసు బయటకు తీసుకొచ్చారని, దారుణమైన స్థితికి కేసీఆర్‌ దిగజారిపోయారని అక్ష్మణ్‌ విమర్శించారు. రేవంత్‌పై దిల్లీ పెద్దల ఒత్తిడి ఉందని, లేదంటే వెంటనే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారులు, పాత్ర దారులపై చర్యలు తీసుకోవాలని, కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *