ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి గదుల్లో హింసించారు, వేల సంఖ్యలో ఆధునిక మారణాయుధాలతో మైదాన ప్రాంత మైతేయి ప్రజలు చేస్తున్న ఈ ఆధిపత్య దాడుల వెనుక ఎవరున్నారు? ఉపరితలంగా ఇదికులాల మధ్య తెగల మధ్య మతాల మధ్య ఘర్ష ణలుగా కనిపిస్తున్నది.కానీ అంతర్గతంగా ఈ మణిపూర్ ఆరని.మంటల వెనుక కార్పొరేట్ ల తీరని ఖనిజ సంపదల దాహం వుందని, విశాలమైన కొండ ప్రాంతాల గుండెల్లో దాగున్న ఖని సంపద కోసమే నని అక్కడి కుకీ నాగా తెగలు లేకుండా చేయటమే ఈ దారుణకాండకు అంతర్గత లక్ష్యమని భావించాలి. మణిపూర్ సంఘటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నవే అనేది స్పష్టంగా కనిపిస్తున్నది.పోలీస్ ల సమక్షంలో వెయ్యిమందికి పైగా అధు నాతన మారణాయుధాలతో కొండ ప్రాంతాల కుకీ తెగల గ్రామంపై దాడి చేశారు.కుకీ గిరిజన ఇద్దరు మహిళలను వారి కుటుంబసభ్యుల ముందే వేలమంది సమక్షంలో వివస్త్రలను చేసి నగ్ళంగా ఊరేగించారు.అడ్డగించేందుకు ప్రయత్నించిన వారి కుటుంంబసభ్యులను వారిముందే చంపేశారు.ఆ మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు..అందులో ఒకరిని చంపివేశారు.అంత ఆరాచకం సృష్టించిన ఆ మైతేయిల వెనుక వున్న శక్తులు ఎమిటి? అపార ఖనిజ సంపద గర్భంలో దాచుకున్న కొండ ప్రొంత భూములే కీలకమా!?
మణిపూర్ జనాభాలో 18లక్షలు (65 శాతం)గా వున్న మైతేయి ప్రజలు గిరిజనేతరులు. ఇంఫాల్ మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. సంపన్న వర్గాలకు చెందిన వీరిలో మెజారిటీ హిందువులతో పాటు క్రిస్టియన్లు వున్నారు. రాష్ట్రంలో వున్న 60 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వీరు 40 మంది వున్నారు. వీరి ఆధీనంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి 7.41 లక్షల ఎకరాలుంది. 4,60,713 ఎకరాల నివాసయోగ్యమైన భూమి వుంది. వీరి ఆధీనంలో 10 శాతం భూమి వుందని మిగిలిన 90 శాతం భూమి కుకీ ,నాగ ఇతర గిరిజన తెగల ఆధీనంలో వుందని ప్రచారం చేయబడుతున్నది అవాస్తవం.మణిపూర్ లో మొత్తం అటవీ భూముల శాతం 77.20 లక్షల ఎకరాలు కాగా దానిలో 8.42 శాతం భూములు రిజర్వ్ డ్ అటవీ భూములు.ఈ కొండ ప్రాంత అటవీ భూముల్లో నివసిస్తున్న వారిలో ఎక్కువ శాతం సంచార తెగలే!మిగతశాతం గిరిజనులు అక్కడ పోడుభూములపై ఆధారపడి స్థిరనివాసముంటున్నారు. ఇక్కడ పేర్కొన్న 85.62 శాతం అటవీ భూమి కుకీ నాగా తెగల సొంత భూములు కాదు. ఆ అటవీ భూముల పరిధిలో కొండల మీద నివాసముంటున్నారు. ఈ గిరిజనులు నివసిస్తున్న 85.62 శాతం అటవీ ప్రాంతంలో కొండగర్భాన వున్న విలువైన ఖనిజ సంపద పై కార్పొరేట్ శక్తులు కన్నేయటమే సమస్య కు ప్రధాన కారణం.గిరిజనేతరులు అటవీప్రాంత భూములు కొనటానికి అటవీ హక్కుల చట్టం 371 సి.చట్టం అంగీకరించదు.కాబట్టి మైతేయి హిందువులను ఎస్.టి.లుగా గుర్తించేందుకు రంగం సిద్దంచేశారు. మైతేయి సంపన్న ప్రజా ప్రతినిధుల వ్యాజ్యం మేరకు మణిపూర్ హైకోర్టులో హైకోర్ట్.ప్రదాన న్యాయమూర్తి ఎం.వి..మురళీధరన్.మైతేయి జాతిని ఎస్టిలుగా గుర్తింపు నివ్వమంటూ మార్చి 27న నాటి మణిపూర్ రాష్ట్రప్రభుత్వానికి ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని సూచించారు. మరో వైపు ఫిబ్రవరి లో కుకీ జోయీ తెగ గిరిజనులు కొండలపై డ్రగ్స్ రవాణా చేస్తున్నారని మాదక ద్రవ్యాల సాగు చేస్తున్నారని వందల మందిపై మణిపూర్ రాష్ట్ర సర్కార్ కేసులు బుక్ చేశారు. వారు కొండ ప్రాంతాల్లోసాగు చేసుకుంటంన్న వందల ఎకరాల పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు. వేలాది కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నెపంతో తరచూ గ్రామాలపై పోలీసుల దాడులు పెరిగాయి. నిరసనగా మార్చిలో థామస్ మైదానంలో కుకీ జోయి తెగ వారు జరిపిన ర్యాలీ హింసాత్మకమై ఐదుగురు గాయపడ్డారు. మాదక ద్రవ్యాల సాగుకు కారణమంటూ ఏప్రిల్ 11న కుకీ వారి 3 చర్చిలను తగులబెట్టారు. ప్రతిగా ఏప్రిల్ 28న చూరాచంద్రాపూర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ప్రారంభించబోయే జిమ్ ను కుకీలు తగులబెట్టారు. ఏప్రిల్3న “ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ అఫ్ మణిపూర్” వారు 60 వేలమందితో ర్యాలీ తీశారు. మైతేయి వారికి ఎస్.టి. హోదా ఇవ్వటాన్ని నిరసనగా జరిగిన ఈ ర్యాలీ విజయవంతమైంది. మే 4 న కుకీ జోయి తెగ వారి కాంగ్ పోకీ జిల్లా , బి పైనాం గ్రామం పై వెయ్యి మందికి పైగా మైతేయి వారు మారణాయుధాలతో దాడికి దిగారు.భయపడి పొలాల్లో దాక్కున్న వారిని ఈడ్చుకొచ్చారు.పోలీసుల సమక్షంలోనే 20 ,24 వయసులో వున్న ఇద్దరు కుకీ జోయి తెగ మహిళలను వివస్త్రలను చేసి వీధులలో ఊరేగించారు. అడ్డుకోబోయిన ఒక యువతి, తండ్రి తమ్ముడిని అక్కడే చంపేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని బాధిత యువతి చెప్పటం గమనించాలి.ఇద్దరు బాధితయువతులలో ఒకరుకార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక వీర జవాన్ భార్య. రెండున్నర నెలల తరువాత జులై 19 న ఈ సంఘటన సంబంధించిన వీడియో బయటికి వైరల్ అయింది.ఈ దాడిలో మైతేయి యూత్ ఆర్గనైజేషన్ , మైతేయి లీపన్,కాంగ్లేపాక్ కంబాలుప్,ఆరంబయ్ టెంగోల్, వరల్డ్ మైత్రేయి కౌన్సిల్,స్టూడెంట్ ట్రైబ్ డిమాండ్ కమిటీ తదితర ఒరం సంఘాల కు సంబంధించిన వెయి మంది సంఘటితమయి దాడికి పాల్పడితే ఇంత వరకు ఈ విషయం తెలియదంటు కేంద్ర సర్కార్ వాఖ్యానించటం పచ్చి అబద్దం. ఈ సంఘటన వీడియో సాంఘిక మాధ్యమాల్లో 93 రోజుల తర్వాత వైరల్ అయిన దరిమిలా ఈవిషయం బయటకు తెలిసింది. ఈ విషయం ఇంతకాలంగా తమకు తెలియదని కేంద్ర సర్కార్ పచ్చి అబద్దలాడుతున్నది. మే 3 న జరిగిన ఈ సంఘటన పై మే 21న ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది.మే 4 న ఆర్టికల్ 355 న విధించినట్టు అక్కడి డి.జి.పి ప్రకటించారు. హోంశాఖకు ప్రధానికి అక్కడి సమస్య తీవ్రత తెలియకుండానే ఆర్టికల్ 355 విధించారా? దుస్సంఘటన వీడియో 93 రోజుల తరువాత వైరల్ అయ్యాక కూడా మాకు విషయం తెలియదని చెప్పటం బుకాయింపు కాదా!? కుకీ తెగల గ్రామంపై వేయి మందికి పైగా మారణాయుధాలతో దాడి జరిగితే మే 21న ప్రధాన నిందితులలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. నిరసనల వెల్లువ క్రమంలో మరో తొమ్మిది మంది అరెస్ట్ చూపారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని బాధిత మహిళ వాపోతున్నా కూడా ఈ సంఘటన సమయంలో అక్కడ డ్యూటీలో వున్న పోలీసులపై చర్యలు తీసుకోలేదు. ఈ దుస్సంఘటన వీడియో వైరల్ అయిన రోజు జులై 19 న నాగా.తెగకు చెందిన మారింగ్ కమ్యూనిటీ సభ్యురాలు లూసీ మారెం (57) ఇంపాల్ లోని ‘కెబిహై కాక్ మహల్ ‘జిల్లా సవోంబంగ్ లో దారుణ హత్యకు గురైందినాలుగు రోజులకు విషయం తెలిసిన మేరకు మృతురాలి చెల్లెలు తబిత ఆ మృతదేహాన్ని గుర్తించింది. ఈ హత్యను ఖండిస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ జులై 24 సోమవారం బందు పిలుపునిచ్చింది. ఈ కేసులో పోలీసులు నిందితులైన 9 మందిని అరెస్ట్ చేసి ,తుపాకీ,ఐదు రౌండ్ల బుల్లెట్లు ఒక కారును స్వాధీన పరుచుకున్నారు.
కార్పొరెట్ శక్తుల ముందు తలలు వంచిన రాజ్యాంగబద్ద వ్యవస్థలు !
కేంద్రంలో,రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం నడుస్తుంది. గర్భాన విలువైన ఖనిజసంపదలున్న కొండ ప్రాంత భూములపై కార్పొరేట్ల కన్ను పడింది. ఆ కార్పొరెట్ శక్తులు తమకు కావల్సిన దానిని సాధించుకోవటానికి అడ్డువుంటుందా!?ఇక మణిపూర్ లో ఏ ఒక్క రాజ్యాంగ బద్ద వ్యవస్థనైనా ఈ కార్పొరేట్ శక్తులకు తలవంచకుండా వుంటుందా!? మైత్రేయి వారిని గిరిజనులు గా గుర్తించటం ఇప్పుడు కార్పొరేట్లకు అత్యవసరం. ఇందులో భాగంగానే ఇంపాల్ లో మైదానప్రాంత మైత్రేయి వారిని గిరిజనులుగా హైకోర్టు గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మైత్రేయిలు గిరిజనులుగా గుర్తింపు పొందితే జరిగేదేమిటో తెలిసిందే!అభయారణ్యాల రక్షణ పేరిటవందల యేళ్ళుగా కొండలున్న అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కుకీ జోయి, నాగా తెగ గిరిజన జాతులను ఆ అడవుల నుండి వెళ్ళగొడ్తారు. ఖాళీ అయిన కొండ ప్రాంత అటవీ ప్రాంతాల భూములను అప్పనంగా కొట్టేయటం తదుపరి కార్యాచరణ.ఇప్పుడా భూముల్లో అడుగుపెట్టాలంటే మైత్రేయి జాతి వారికి ఇంత కాలంగా అడ్డుపడిన 371సి జి.వో ఇప్పుడు అడ్డు చెప్పదు. కార్పొరేట్ శక్తులు మైత్రేయిల రూపంలో కొండ ప్రాంత భూములను కబ్దా చేయటం,ఖనిజ సంపదను దోచుకోవటం అనేది తదుపరి కార్యాచరణ. ఈ రెండింటి మధ్య కుకీ జోయో నాగా తెగల గిరిజన జాతులను మణిపూర్ నుండి వెళ్ళగొట్టాలనేది భాజపా ముందున్న అసలు కార్యాచరణ. ఈ నేపధ్యంలో పోలీసులు , చట్టం , కోర్టులు ,న్యాయం , హక్కుల సంస్థలు ,రాజకీయ పార్టీలు, “పరమ సంఘపరివార భక్తురాలయిన” రేఖ శర్మ గారి మహిళా కమీషన్ తదితర రాజ్యాంగ. రాజ్యాంగేతర వ్యవస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు తల వంచటం తక్షణ అవసరమవుతుంది. ఇప్పటి వరకు 500 చర్చీలు,15 హిందూ ఆలయాలు కాల్చబడ్డాయి. బెదిరింపులతో 50 కుకీ జోయి తెగల గ్రామాలు ఖాళీ చేయబడ్డాయి.144 సెక్షన్.అమలు చేయబడుతూన్నది.ఒక వైపు శాంతిర్యాలీలు జరుగుతున్నాయి. మరోవైపు తుపాకుల మోతలు వినిపిస్తున్నాయి.ఇంటర్ నెట్ తీసేశారు.సాంఘిక మాధ్యమాల్లో వందల సంఖ్యలో ఫేక్ వీడియోలు ,ఫేక్ ఫోటోలతో తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. బాధితులైన కుకీ జోయి తెగ గిరిజనులను కాందీశీకులుగా,తీవ్ర వాదులుగా చిత్రీకరిస్తూ వెల్లువవుతున్న ఫేక్ వార్తలతో దేశయావత్తు సానుభూతిని మైతేయి ప్రజలకు దక్కుతున్నది.సరిగ్గా ఏం జరగాలని కార్పొరేట్ శక్తులు స్కెచ్ వేశాయో సరిగ్గా అదే జరుగుతూంది. 2000 సంవత్సరంలో మణిపూర్ లో పారామిలిటరీ సైన్యం మణిపూర్ లో గిరిజన మహిళల పై చేస్తున్న లైంగిక దాడులకం నిరసనగా 16 యేళ్ళు నగ్నం గా దీక్ష చేసిన ఇరోం షర్మిల పోరాట దక్షతను ఉక్కు సంకల్పాన్ని కుకీ జోయి, నాగా తెగలు ఆదర్శంగా తీసుకోవాలి.పది ప్రతిపక్ష పార్టీలు పట్టుపట్టినా కూడా పార్లమెంట్ లో ప్రధానిమణిపూర్ సంఘటన పై మౌనం విడువలేదు. శాంతి ర్యాలీ లను హింసాత్మకంగా మారుస్తున్న శక్తులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో తీవ్ర వాదుల సాకు చూపి ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో గిరిజన ప్రజల పైన ఆకాశం నుండి బాంబుల దాడులు చేసినట్టుగా. మణిపూర్ లో కూడా ఇదే విధంగా రంగం సిద్దం చేసే ప్రమాదం లేకపోలేదు. రాజ్యం వైఫల్యం చెందినప్పుడు కోర్టులు న్యాయం దానిని సరిదిద్దాల్సివుంటుంది కానీ రాజ్యంగం ప్రసాదించిన హక్కుల హననం న్యాయస్థానాల్లో కూడా జరుగుతున్నప్పుడు అంతిమంగా విశాల జన ఉద్యమ చైతన్యమే పరిష్కార దారులు చూపుతుంది.
– ఎలమంద



