ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖానాల దోపిడీతో… తడిసి మోపెడవుతున్న వైద్య భారం

మనిషి అనారోగ్యం పాలైతే స్వస్థత చేకూర్చే వైద్య చికిత్సలో వైద్యుల, ఔషధాల, దవాఖానాల, ల్యాబుల పాత్ర చాలా విలువైంది. అందుకే వైద్యులను కనిపించే దైవంగా గౌరవించడం జరుగుతున్నది. ఇలాంటి వైద్యరంగంలోని తాజా స్థితి గతులను పరిశీలిస్తే..సేవ కన్నా ధనార్జనే ధ్యేయం  కావడం, ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా ప్రజలు దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలవుతుంది. నిబంధనలు పాటించని ల్యాబులు, గాడి తప్పిన వైద్యం, నకిలీ వైద్యులు, ఔషధాల కల్తీతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ మధ్య జరిగిన తనిఖీల్లో తేలింది. దేశంలో రాష్ట్రంలో ఏ మూల చూసినా నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రజారోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని రాసుకున్న భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడవలసిన ఈ వ్యవస్థల చుట్టూ చీకటి కోణాలు కమ్ముకొని ఈ స్థితి దాపురించింది.

ఇటీవలే గాంబియాలో 60 మందికి పైగా పిల్లల  మరణాలకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందులే కారణమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, నకిలీ ఔషధాల వ్యాపారంతో అంతర్జాతీయంగా మన దేశం అప్రతిష్ట మూట కట్టుకుంది. అలాగే మన దేశంలో అల్లోపతి వైద్యుల్లో 576శాతం వైద్య పరమైన అర్హతలు లేని వారేనని గణాంకాలు చాటుతున్నాయి. ఇలా ప్రైవేటు, కార్పొరేట్‌ ‌దవాఖానాల్లో దోపిడి, నకిలీ వైద్యులు, కల్తీ ఔషధాలు, అనుమతులు లేని రోగనిర్ధారణ కేంద్రా(ల్యాబు)ల నిర్వహణతో ప్రజలు చెమటోడ్చి, కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మంతా దవాఖానాల పాలు చేయాల్సి వస్తుంది. అదీ సరిపోకపోవడంతో అప్పులు చేసి కూడా వైద్య బిల్లులు కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ ‌వైద్యానికి ఖర్చు అధికంగా అవుతుంది. ఒకసారి అనారోగ్యం బారిన పడితే దవాఖానాల ఖర్చు తడిసి మోపెడవుతున్నాయి.

తాజాగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2021 ఈ అంశాలను వెల్లడించింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయి వైద్య ఖర్చుల వివరాలు పేర్కొంది. తెలంగాణలో సగటున 77.7 శాతం ప్రజలు దాచుకున్న డబ్బులు వైద్య ఖర్చులకు పెట్టాల్సి వస్తుంది. అదీ చాలక అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ఆరోగ్య బీమా వర్తించకుండా 29 శాతం మంది దాకా ఉన్నారని, పట్టణాల్లో 50.3 శాతం మంది ఉన్నారని గణాంకాల్లో తేలింది. ఆ మేరకు వైద్య చికిత్సల కోసం దవాఖానాల్లో చేరితే ఒకరికి సగటున ఏడాదికి అదనంగా ఖర్చు పరిశీలిస్తే..తెలంగాణలోని ప్రభుత్వ వైద్యంలో రూ.6864 కాగా, ప్రైవేట్లో రూ.26,461 అలాగే  దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో రూ.4,408 కాగా, ప్రైవేట్‌ ‌వైద్యంలో రూ. 22,031 అవుతున్నాయని తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నకిలీ వైద్యులు, కల్తీ ఔషధాలు, నిబంధనలు పాటించని దవాఖానాలు, ల్యాబులను తనిఖీలు పెంచి కట్టడి చేయాల్సి ఉంది. వెను వెంటనే ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం వైద్య వ్యవస్థల్లోని అన్ని రంగాల్లో దోపిడీని నియంత్రించడం ప్రభుత్వాలు తక్షణ బాధ్యతగా భావించాలి.

మన రాష్ట్రంలోని ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అనుమతులు లేకున్నా చికిత్సలు చేస్తున్న తీరుపై ప్రజల ఫిర్యాదుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖచే చేయించిన తనిఖీల్లో ప్రైవేటు దవాఖానాల్లో 37శాతం నిబంధనల ఉల్లంఘన, అనుమతులు లేని చికిత్సలు చేస్తున్నట్లు తేలింది. వీటిలో హైదరాబాదులో అత్యధికంగా నమోదు కాగా, ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, భద్రాది కొత్తగూడెం ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యాధికారుల లోపాయికారి సహకారం వీరికి కొనసాగుతున్నట్లు తేలింది. అంతే కాకుండా ముడుపులు ఇస్తే తనిఖీల తర్వాత అంతా యథాతథ స్థితి కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ తనిఖీల్లో భాగంగా అనుమతులు లేకుండానే రోగనిర్ధారణ కేంద్రాలు, ల్యాబులు నిర్వహిస్తున్నట్లు తేలింది. వైద్యుని సూచనల మేరకు  లేబొరేటరీలలో రక్త, మూత్ర తదితర పరీక్షలు చేయించుకోవాలి. అలా జరగడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండానే నమూనాలు సేకరిస్తున్నాయి.

అధిక శాతం ల్యాబుల్లో పరీక్షించేది సాంకేతిక సహాయకులే అని తెలుస్త్తుంది. నిపుణులైన వైద్యులే పరీక్షించి తుది ఫలితాలు ఇవ్వాలి. అలా కాకుండా స్పెషలిస్ట్ ‌వైద్యుల సంతకాలు సాంకేతిక సహాయకులే చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల నుంచి డివిజన్‌ ‌కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిబంధనలను అన్ని అంశాల్లో తుంగలో తొక్కేశారని వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా మహానగరాల్లో, పట్టణ కేంద్రాల్లో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు నిర్మాణం చేయడం అభినందనీయమే. కాని అదే స్థాయిలో గ్రామీణ, మండల, డివిజన్‌, ‌జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ వైద్యాన్ని సకల సౌకర్యాలతో మెరుగుపరుస్తూ, ప్రైవేటు రంగంలోని దోపిడిని కట్టడి చేసి రాజ్యాంగ స్ఫూర్తితో మానవీయ కోణంలో ప్రజల వైద్య ఆరోగ్య హక్కును పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అమలు చేయాలి. ఇది పాలకుల ప్రాథమిక ప్రాధాన్యతగా భావించి వైద్యభారాన్ని తగ్గించి, నాణ్యమైన వైద్యాన్ని అందించాలి.
 మేకిరి దామోదర్‌,
‌సోషల్‌ అనలిస్ట్, ‌వరంగల్‌, 9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *