హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 07 : తమ ప్లాట్లను ఆక్రమించి, తమను వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి, అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ, కె.ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రేస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలని కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షులు వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంచిర్యాలలో మూకుమ్మడిగా 550 మంది బాధితులందరం కలిసి నామినేషన్ వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలసి ఆయన మాట్లాడుతూ తాము 1983 లో మేడ్చెల్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దుల్లోని కాప్రా రెవిన్యూడివిజన్ పరిధిలో గల వంపుగూడా గ్రామంలోని 62 ఏకరాల్లో భూముల్లో వేసిన వెంచర్లో ప్లాట్స్ కొనుగోలు చేశామని తెలిపారు. ఈ భూముల సర్వే నెంలు వరుసగా 639,643, 644, 647, 648, 654 ఉన్నామని వెల్లడించారు. 2004 ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రేమ్ సాగర రావు ఎమ్మెల్సీగా ఉండడంతో తన కన్ను తమ ప్లాట్స్ పై పడిందని వాపోయారు. తమను భయ బ్రాంతులకు గురిచేస్తూ తనకున్న రాజకీయ పలుకుబడితో తమను వేధిస్తూ, రౌడీలతో కొట్టిస్తూ, పోలీసులు అండతో కేసులు పెట్టిస్తూ, ఇప్పటి వరకు తమ ప్లాట్స్ ను తమకు కాకుండా చేశాడని తెలిపారు. రెవిన్యూ అధికారులు సర్వేచేసి తమ భూమలుగా తేల్చారని చెప్పారు. హైకోర్టు సైతం తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. అనంతరం అస్థలాల్లో తాము కట్టుకున్న నిర్మాణాలను సైతం తన అనుచరులతో కూల్చివేశాడని ఆగ్రహించారు. కాంగ్రేస్ పార్టీ విడుదల చేసిన మొదటి లిస్టులో ఇతని పేరును మంచిర్యాల ఎమ్యెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, ఆయన గెలిస్తే మంచిర్యాల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆవేధన చెందారు. కనుక ఇతని కబ్జా నుండి తమ భూములను అధికారులు విడిపించడమే కాకుండా, కాంగ్రేస్ పార్టీ అదిష్టానం ఇతని టికెట్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం జవహర్ నగర్ పోలీసుల దృష్టికి తీసుక వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో సొసైటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకట్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, పరశురాం, సాల్మన్, లక్ష్మీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రెస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలి




