వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోషణ మాసం సెప్టెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా మాతా, శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలివ్వడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు అంచనా వేయడం జరుగుతుందని, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో (కొడంగల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్) 1107 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణీలు:7007, బాలింతలు:3896, జీరో టు మూడు సంవత్సరాల పిల్లలు:34586, మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లల సంఖ్య:21596 లబ్ధి పొందుతున్నారని అదేవిధంగా తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం జరుగుతుందని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఆరోగ్యం పట్ల మహిళా, శిశు సంక్షేమశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి తల్లి పౌష్టికాహారం తీసుకుంటేనే పుట్టే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి అని ఇనుము, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, చిక్కుళ్లు, బెల్లం, ధాన్యాలు, ఖర్జూర, పండ్లు అదేవిధంగా ప్రాంతీయంగా దొరికే తాజా పండ్లు తీసుకుంటే ఎక్కువ మంచిది. మరియు పాలు, పెరుగు, గుడ్లు ఆహారంలో భాగంగానే వాడవల్సి ఉంటుందని. అయోడైజ్డ్ ఉప్పును సరైన మోతాదులో వాడాలని, పండ్ల రసాలు, నీళ్లను ఎక్కువగా తాగాలి. కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అని తెలపడం జరిగింది.బిడ్డకు పౌష్టికాహారం తల్లిపాల.బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లిపాలే సంపూర్ణ పౌష్టికాహారం. తల్లిపాల నుంచి మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు లభిస్తాయి. ఆరునెలలు దాటిన తర్వాత తల్లిపాలతోపాటు అదనపు ఆహారం తప్పనిసరి. ఆహారంలో గుజ్జుగా చేసిన పండ్లు, ఉడికించిన ఆకుకూరలు, ఇడ్లీ, ఉప్మా, పాలలో నానబెట్టిన రొట్టె, కిచిడీ, పాయసం, ఉడకబెట్టిన గుడ్డులో తెల్లసొన భాగం, ఉడకబెట్టిన పప్పు, నెయ్యి, చక్కెర మిశ్రమం ఇవ్వాలి. ఆరునెలలలోపు బిడ్డ ప్రతినెలా 600 నుంచి 800 గ్రాములు, ఏడునెలల నుంచి సంవత్సరంలోపు ప్రతినెల 300 నుంచి 400 గ్రాముల బరువు పెరగాలి. 7 నుంచి 9నెలల బిడ్డ సగం కప్పు ఆహారం మూడుసార్లు, పది నుంచి 12నెలల బిడ్డకు సగం కప్పు ఐదుసార్లు తల్లిపాలు కొనసాగిస్తూ ఉండాలి. సమయానికి తగు మోతాదుల్లో ఇచ్చే ఆహారం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.పోషణ మాసం కార్యక్రమాల వివరాలు*మొదటివారం.మొదటి వారం రోజులపాటు పెరుగుదల పర్యవేక్షణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. చిన్నారుల బరువు, జబ్బ చుట్టుకొలత సేకరించడం, కొలతలను రిజిస్టర్లో నమోదు చేయడం, పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం, ఎన్‌హెచ్‌టీఎస్, పోషణ ట్రాకర్‌లో నమోదు చేస్తారు. చిన్నారులకు టీకాలు, గర్భిణులకు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం, పోషకాహారం పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనుబంధ పోషకాహార కార్యక్రమం, టేక్ హోం, రేషన్(టీహెచ్ఆర్), ఐరన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేస్తారు.రెండోవారం:చిన్నారుల బరువులను చెక్ చేయడం, పోషకాహారం కోసం పెరటితోటల పెంపకం చేపడతారు. విటమిన్-సీ అధికంగా ఉండే పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని 5 ఏళ్ళలోపు పిల్లలందరి పెరుగుదలను పర్యవేక్షిస్తారు. గర్భిణులను నమోదు చేయడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కిషోర బాలికలకు రక్త పరీక్షలు చేయించడం, ఆరోగ్యం, పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తారు.మూడోవారం:చిన్నారులకు టీకాలు, గర్భిణులకు బరువు చూడడం, వైద్య పరీక్షలు చేయించడం, పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ర్యాలీలు, అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొనేలా సమన్వయం చేసుకుంటారు. పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.నాల్గోవారం:పోషకాహారం తీసుకునేందుకు శుభ్రత పాటించడం, ఇతర విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం ప్రార్థనలో పోషకాహారంపై రోజూవారీ సందేశాలు ఇవ్వడం, వ్యాసరచన పోటీలు, చేతుల శుభ్రతపై ప్రదర్శనలు చేయిస్తారు. గృహ సందర్శన చేసి పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తిస్తారు. చిన్నారులు, తల్లిదండ్రులను సంరక్షణ కేంద్రాలకు ఆహ్వానిస్తారు. పోషకాహార లోపంపై వివరించి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంల ద్వారా సూచనలు చేస్తారు. కావున ఈ నెల రోజులపాటు పోషణ మాస వారోత్సవాలను వారోత్సవాలు
నెలరోజులపాటు పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ బాలింతలకు మరియు చిన్నారులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పెరట్లో న్యూట్రీగార్డెన్ పెంచేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనిజిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలితా కుమారి తెలియజేశారు.




