శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తుల్జా భవాని ఆలయంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ముఖ్యంగా మహిళలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగ బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపించి మూడోసారి గద్దెనెక్కడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సహకారంతో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచామని సమస్యలు మిగిలి ఉన్నట్లయితే తాను గెలిచిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి పీఠం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి




