- అవినీతిలో కూరుకుపోయిన కేరళ సీఎం..ఆయన కుటుంబం
- ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం ఖాయం
- రాహుల్ నియోజకవర్గం వాయనాడ్‌లో రైతులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
వాయనాడ్, ఏప్రిల్ 18 : కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బంగారం స్మగ్లింగ్‌లో విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం విజయన్‌పై ఈడీ, ఆదాయ పన్ను కేసులున్నా.. ఆయనపై మోదీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీతో విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాహుల్ గాంధీ లోక్ సభ నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు..తెలివైన వారని, ఇక్కడి ప్రజల శ్రమతో దుబాయ్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ కేరళ మాత్రం అభివృద్ధి సాధించలేదని అన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటాలు చేయాలని, తెలంగాణ, కర్ణాటక, జార?ండ్, దిల్లీ వటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయని కానీ కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్.. కమ్యూనిస్టు కాదని కమ్యూనలిస్టు అని ఎద్దేవా చేశారు.
మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని, సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ, ఆదాయపన్ను కేసులున్నన్ని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయరని అన్నారు. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయారని, ప్రధాని మోదీ, అమిత్ షా మణిపూర్‌లో పర్యటించలేదని, కానీ రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారని తెలిపారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, తాను చెప్పిన ఈ మాటలు రాసిపెట్టుకోవాలని సూచించారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతుందని, మోదీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్‌లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని తెలిపారు.
ఇందిరా, రాజీవ్‌లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని తెలిపారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, తాను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, రాహుల్ గాంధీపై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే తాను తెలంగాణ నుంచి వొచ్చానని చెప్పారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాము రాహుల్ గాంధీని కోరామని, కానీ.. ఆయన వాయనాడ్ వైపే మొగ్గు చూపారని తెలిపారు. గత ఎన్నికల్లో వాయనాడ్‌లో 65 శాతం వోట్లు వొచ్చాయని, ఈ సారి 75 శాతం వోట్లు రావాలని మోదీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతుందన్నారు. వాయనాడ్ ప్రజలు వోటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు…దేశానికి కాబోయే ప్రధానికి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.





