‌ప్రధాని పర్యటనకు విస్తృత స్థాయి బందోబస్తు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రేపు రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు. 8న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వొస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై గురువారం వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌, ఇతర సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా డీజీపీ సమీక్షించారు. అడిషనల్‌ ‌డీజీ సంజయ్‌ ‌కుమార్‌ ‌జైన్‌, ఐజి షా నవాజ్‌ ‌కాసీం, సంప్రీత్‌ ‌సింగ్‌లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా రెవిన్యూ, రైల్వే, రోడ్లు భవనాలు తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అయితే, సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాని పర్యటన రోజు ఒక వేళ భారీ వర్షమంటే తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. బహిరంగ సభకు హాజరయ్యే వారు  ఏ మార్గంలో చేరుకోవాలో, ఎక్కడ పార్కింగ్‌ ‌సౌకర్యం కల్పించామన్న వివరాలను ముందస్తుగానే తెలియచేయాలని చెప్పారు. వరంగల్‌లో ప్రధాని దిగే హెలిపాడ్‌తో పాటు వేదిక వద్దకు చేరుకునే మార్గాల్లో ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బ్లూ బుక్‌ ‌లోని నియమ నిబంధనలను అనుసరించి తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలియ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రంగనాధ్‌ ‌మాట్లాడుతూ…8న ఉదయం ప్రధాని కార్యక్రమాలున్న మామునూర్‌, ‌భద్రకాళి ఆలయం, ఆర్టస్ ‌కళాశాలలలో సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులను ఇంచార్జిలుగా నియమించి పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. ఇప్పటికే హన్మకొండ పౌరులకు ట్రాఫిక్‌, ‌సెక్యూరిటీ ఏర్పాట్లపై సూచనలను జారీ చేశామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ ‌నుండి సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *