ప్రత్యేక కుకీలాండ్ రాష్ట్ర సాధన సాధ్యమేనా!?

1917-1919 మధ్య జరిగిన కుకీ తిరుగుబాటు లేదా ఆంగ్లో-కుకీ యుద్ధం, ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న తెగ, ఎటువంటి ప్రామాణిక సైన్యం లేదా ఆయుధాలు లేకుండా, రెండు సంవత్సరాల పాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడింది. బ్రిటిష్ వారితో పోరాడి కుకీలు అందించిన సహకారానికి భారతదేశం నుండి తగినంత గుర్తింపు లభించలేదు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి వరుసగా మూడేళ్లపాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన సంఘం ఏదీ కూడా ఇంకా ఉనికిలో లేదు. కుకీలు తమ అస్థిత్వం కోసం చేసిన పోరాటం అసాధారణమైనది..
మణిపూర్‌లో కుకీ జోయి , నాగ తెగ గిరిజనుల పై కొనసాగుతున్న హింసాకాండ ఫలితంగా అక్కడి గిరిజనులు ప్రత్యేక రాష్ట్ర విభజన డిమాండ్ ను బలంగా ముందుకు తెస్తున్నారు. ఆ ప్రాంతపు  ఏడుగురు భాజపా సహా పది మంది ఎమ్యెల్యేలు సమిష్టిగా తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని  డిమాండ్‌ చేస్తున్నారు.మణిపూర్ శాసనసభ లోని 60 స్థానాల్లో 20 కొండ ప్రాంతపు అడవిలో నివసించే గిరిజనులవి. మిగత స్థానాలు ఇంఫాల్ లోయ మైదాన ప్రాంత గిరిజనేతరులైన మైతేయిలవి.ప్రభుత్వానికి కావల్సిన మూడువంతుల సీట్లు మైదానప్రాంత గిరిజనేతరుల నుంచి లభ్యమవుతున్నాయి.కాబట్టి మొదటి నుండి కొండలపై నుండే అటవీ ప్రాంత గిరిజనులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.నిధులు,నియమాకాలు,సంక్షేమం,విషయంలో ప్రభుత్వ వివక్ష పై వారు విసిగిపోయారు.ఇటీవల తమ తెగలపై జరిగిన హింసాకాండ భాజపా ముఖ్యమంత్రి ప్రయివేట్ సైన్యం వుందని కుకీ జోయి నాగ ప్రజలు ఆరోపిస్తున్నారు.పోలీసుల సమక్షంలో జరుగుతున్న లైంగిక దాడులు గృహదహనాలు వేల సంఖ్యలో గ్రామాలు ఖాలీ చేయించటం దరిమిలా భాజపా ప్రభుత్వం పై విశ్వాసం లేదంటూ వారు తెగేసి చెపుతున్నారు.ఇప్పటి వరకూ తమకు ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన కుకీ తెగ వారు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కుకీ గిరిజనులకు చెందిన అత్యున్నత సంస్థ *కుకీ ఇన్పీ మణిపూర్‌* (కేఐఎం)” రాజ్యాంగంలోని మూడవ అధికరణ ప్రకారం తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ,తమకు, మైతీలకు మధ్య చిర కాలంగా కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడం ఇక సాధ్యం కాదని తెగేసి చెప్పింది. కాగా హింసాకాండ చెలరేగిన తొలి రోజులలో కుకీ  తెగ వారు లేవనెత్తిన డిమాండ్‌కు ప్రస్తుత వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. తమ తెగ వారు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అప్పుడు జోమీలు డిమాండ్‌ చేశారు. అయితే కుకీలు, మైతీలు సహజీవనం సాగించడం అసాధ్యమని స్పష్టమైపోయిందని,పైగా ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని *కేఐఎం ప్రతినిధి తంగ్‌మిలెన్‌ కిప్‌జెన్‌* చెప్పారు. ఇప్పుడు బలమైన ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.
     మణిపూర్‌లో మే 3న హింస జరిగిన మొదటి కొన్ని వారాల్లోనే, కుకీ-జోమి కి చెందిన లక్షల మంది కొండల నుండి వెళ్ళగొట్టబడ్డారు.దీని ఫలితంగా రాష్ట్రంలోని 10 మంది కుకీ-జోమి ఎమ్మెల్యేలు చేసిన విభజన డిమాండ్‌ కు మణిపూర్‌లోని అన్ని స్వతంత్ర కౌన్సిల్‌లు,తెగల ఉప తెగలు సి.ఎస్.ఓ.,హెచ్.మార్. ఇన్పూ.,జోమి కౌన్సిల్ ఇతరులు చేరారు. *కోఆర్డినేటెడ్ కమిటీ ఆన్ సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ మూవ్‌మెంట్ * బ్యానర్ క్రింద సి.ఎస్.ఓ.ల సంకీర్ణం ఏర్పాటైంది, ఇందులో ఇటీవల ఏర్పడిన ఐ.టి.ఎల్.ఎఫ్. కూడా చేరింది. వారి నాయకుల ఫోరమ్ జరిపిన సమావేశంలో “రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకా
రం ప్రత్యేక రాష్ట్రాన్ని అంగీకరించకపోతే ఒక కేంద్ర పాలిత ప్రాంతం కోరుతున్నట్లు పేర్కొనాలని” నిర్ణయించింది, వారి ప్రతినిధి గింజా వల్జాంగ్ ప్రకారం,జోమీ కౌన్సిల్ (అపెక్స్) జో తెగల సంఘం) స్వయంప్రతిపత్తి  ప్రత్యేకతలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభమైన తర్వాత మాత్రమే విషదబడతాయనే వైఖరిని తీసుకుంది. ‘నేషనల్ ఆర్గనైజేషన్’ మరియు ‘యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ ‘   గొడుగు క్రింద ఉన్న 24 సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ గ్రూపులు జోమి కౌన్సిల్ వైఖరిని ఏకీభవిస్తున్నాయి. విభజన తీరుతెన్నులపై త్వరలో ఏకాభిప్రాయం ఏర్పడుతుందని,మణిపూర్ ప్రభుత్వం నుండి విడిపోయే డిమాండ్‌ విషయంలో తాము ఐక్యంగా ఉన్నామని ఈ గ్రూపులన్నీ పునరుద్ఘాటించాయి.
     కుకీ-జిల్లాలకు ప్రత్యేక పరిపాలన కోసం  ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్లను ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ నిర్వందంగా తిరస్కరించారు…పైగా ‘ప్రత్యేక పరిపాలన’ డిమాండ్ చేసినందుకు వారికి  షోకాజ్ నోటీసు జారీ చేశారు.మరోవైపు ‘ప్రత్యేక పరిపాలన’ డిమాండ్ భారత దేశ సమగ్రత మరియు సార్వభౌమాధికారానికి విరుద్ధమని మణిపూర్ కాంగ్రెస్ పేర్కొంది. ‘ప్రత్యేక పరిపాలన’ కోసం డిమాండ్ చేసిన దాదాపు నెల తర్వాత మణిపూర్ అసెంబ్లీకి చెందిన ‘ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ కమిటీ’ (పిఇసి) ఈ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసు అందించింది. జూన్ 16లోగా తమ స్పందన తెలియజేయాలని కోరింది.ప్రత్యేక ‘పరిపాలన’ డిమాండ్ చేస్తూన్న ఎమ్మెల్యేలు మెజారిటీ మెయిటీ జాతి హింసకు పాల్పడిందని, బిజెపి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం “మౌఖికంగా మద్దతు ఇస్తోందని”  ఆరోపించారు.
డిమాండ్ ఎంత మేరకు ఆమోదయోగ్యమైనది?
ఈ సమస్యను ముగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం విచక్షణ కే వుంటుంది. ఈ  సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడానికి మరియు శాశ్వత శాంతిని నిర్ధారించడానికి ప్రత్యేక పరిపాలన అత్యంత ఆమోదయోగ్యమైన మార్గం. ఏ విధమైన ప్రత్యేక పరిపాలనను ఉభయులు ఆంగీకరించే అవకాశం ఉంటుందన్నదానికి ఇప్పుడే ఒక జవాబు చెప్పలేము.ఆరవ షెడ్యూల్ క్రింద
*1.స్వయంప్రతిపత్తి.
*2.అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్,
*3.లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలిత ప్రాంతం.
 ఈ మూడింటిలో, పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోయినా, శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అత్యంత సరైన మరియు మన్నికైన పరిష్కారంగా మొదట నుండి ఈ సమస్యను పరిశీలిస్తున్న వారు భావిస్తున్నారు.వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటానికి దోహదపడవచ్చని భావించే  రెండు అంశాలు పరిశీలిద్దాం..
         1881 జనాభా లెక్కల ప్రకారం, నాగాలతో కలిసి కుకీల జనాభా అసోం లోని ఉత్తర కాచర్ హిల్స్‌లో 20,000,నాగా హిల్స్‌లో 15,000 మణిపూర్‌లో 30,000కు పైగా ,  త్రిపురాలో మణిపూర్‌లో సుమారుగా 8,000 మంది “పాత కుకీలు” ఉన్నారని తెలుస్తూంది . షైహిల్స్ నుండి వలస వచ్చిన”కొత్త కుకీలు” దాదాపు 17,000 మంది గా తెలుస్తుంది.
     2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ మొత్తం జనాభా 28,55,794. కుకీలు మరియు దాని సహా సంబంధమైన తెగలు ప్రాథమికంగా ఒకే మాండలికంలో మాట్లాడతారు మరియు వారి మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తుంది.  మణిపూర్‌లోని వారి పొరుగు గిరిజన నాగాల మధ్య మాండలికాలు విభిన్నమైనవే కానీ కుకీలు అధికారిక  మరియు రక్తసంబంధాలను పంచుకుంటారు. సంస్కృతి రీత్యావారు ఒకే రకమైన తెగలకు చెందినవారు. వారు వారి గిరిజన జీవన విధానానికి  సంబంధించిన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను కూడా పరస్పరం పంచుకుంటారు. సంగీతం,
జానపద కథలు,నృత్యం, ఆహారం, మాండలికాలు మొదలైనవి.
         చారిత్రకంగా పరిశీలిస్తే మొదటి ప్రపంచ యుద్ధం  నేపథ్యం కుకి జాతీయవాదం  బీజాలను నాటింది. బ్రిటీష్ వారు తీసుకువచ్చిన మార్పుల వల్ల వారి సాంప్రదాయ జీవన విధానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుకీలలో ఇది తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అనేక సందర్భాలలో వలస పాలకుల పట్ల తమ ద్వేషాన్ని వ్యక్తం చేశారు.1860వ దశకంలో, వారు 15 గ్రామాలపై దాడి చేసి,185 మంది బ్రిటీష్ పురుషులను చంపారు, దీనిని ‘గ్రేట్ కుకీ దండయాత్ర తిప్పేరా’ అని పిలుస్తారు.
     1917-1919 మధ్య జరిగిన కుకీ తిరుగుబాటు లేదా ఆంగ్లో-కుకీ యుద్ధం, ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న తెగ, ఎటువంటి ప్రామాణిక సైన్యం లేదా ఆయుధాలు లేకుండా, రెండు సంవత్సరాల పాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడింది. బ్రిటిష్ వారితో పోరాడి కుకీలు అందించిన సహకారానికి భారతదేశం నుండి తగినంత గుర్తింపు లభించలేదు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి వరుసగా మూడేళ్లపాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన సంఘం ఏదీ కూడా ఇంకా ఉనికిలో లేదు. కుకీలు తమ అస్థిత్వం కోసం చేసిన పోరాటం అసాధారణమైనది.
        ప్రస్తుత ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భాజపా సర్కార్ వారి విభజన ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల లోనూ పరిశీలించక పోవచ్చును.భవిష్యత్ లో ఆ ప్రాంతాల్లో రాజకీయంగా పరంగా పట్టు సాధించటమే లక్ష్యంగా  మణిపూర్ సమస్యను దీర్ఘకాలిక శాంతి భద్రతల సమస్యగనే పరిగణిస్తూ తమ అంతర్గత లక్ష్యాలను సాధించుకునే దిశగా కొనసాగుతుందని అంచనా వేయక తప్పదు.
-ఎలమంద, తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *