వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 2, 3 తేదీలలో స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని శివారెడ్డిపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బి ఎల్ ఓ లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకొనాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని బి ఎల్ ఓ లకు సూచించారు. బిఎల్ఓ ల వద్ద ఉన్న ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించుకుని, సవరణలు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలన్నారు. బియల్ఓ లు ఇంటింటికి తిరిగి చనిపోయిన ఓటరు వివరాలు, డూప్లికేట్ ఓటర్ల వివరాలు సేకరించి విచారణ చేసి జాబితా నుండి తొలగించాలని తెలిపారు. ఓటరు పేరును జాబితా నుండి తొలగించే ముందు ఆధార్ కార్డు పై సెల్ఫ్ అటాస్టేషన్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా బిఎల్ఓ లు పూర్తి బాధ్యత వహిస్తూ, తప్పులు లేని స్పష్టమైన ఓటర్ జాబితాను రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్ నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులపై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి బి ఎల్ ఓ లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా బిఎల్ఓలకు బిఎల్ఓ కిట్ ను కలెక్టర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ రెడ్డి, ఎలక్షన్ డి. టి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.




