– డిమాండ్ పెరిగినా విద్యుత్ సరఫరాకు లోటుండదు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశాం.. ప్రజలకే జవాబుదారీగా ఉంటాం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతామని, ఎట్టి పరిస్థితుల్లో దోపిడీకి గురి కానివ్వమని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసింది.. రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తున్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు తాము లేకపోతే విద్యుత్తు ఉండదు.. రాష్ట్రం అంధకారమవుతుంది అని అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేకమందిని కలిసి మాట్లాడినపుడు పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో ఇంటి కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తెలిపిన విషయాన్ని విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చానని. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నామని, పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా అధికారంలోకి రాగానే బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచేందుకు కమిటీ వేసి 20% డైట్, 200% కాస్మెటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో చదువుకునే ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని, బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయని తెలిపారు. ఆత్మగౌరవంతో బతకాలని మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, అయిదేళ్లల్లో కోటిమందిని కోటీశ్వరులుగా మారుస్తామని ఆయన చెప్పారు. మధిర నియోజకవర్గంలో 60 వేల మంది మహిళా సభ్యులు ఉన్న ఇందిరా మహిళా డెయిరీ దేశానికి తలమానికంగా ఉండబోతోందన్నారు. రెండేళ్లల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, లక్షలాది సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోందని వివరించారు. పంటలు పండిరచి రైతులు, కూలినాలి చేసుకునే వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం చెమటోడ్చి హైదరాబాదులో కోచింగ్ సెంటర్లకు పంపితే బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో గ్రూప్-1, గ్రూప్-2 నిర్వహించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం గ్రూప్-1పరీక్షలు నిర్వహించడమే కాదు అడ్డంకులు ఎదురైనా నియామక పత్రాలు సైతం అందించిందని తెలిపారు. గ్రూప్-2 నియామకాలు జరిపి పత్రాలు సైతం అందించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ, తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద జమ చేసినట్లు వివరించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, మధిర నియోజకవర్గ ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకొస్తానని భట్టి స్పష్టం చేశారు. మధిర ప్రజల ఇంటి బిడ్డగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





