పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ
ధ్యాన మహాయాగంలో అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : ప్రపంచంలోని చివరి వ్యక్తి కూడా శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పని చేస్తుందని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మనం శరీరం కాదు ఆత్మ అని ప్రతి ఒక్కరు ధ్యానం చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అన్నారు. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వర పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు మూడవ రోజు కన్నుల పండుగగా జరిగాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి 8 వరకు సంగీత వేణునాధ గానంతో యోగ, ప్రాతః కాల ధ్యానం నిర్వహించారు. సౌత్ అమెరికా నుంచి విచ్చేసిన నీలోడెల్ మోంటే తన ధ్యాన, ఆధ్యాత్మిక అనుభవాలు వివరించారు. ఈ సందర్బంగా పరిమళ పత్రీ మాట్లాడుతూ మనం ఏదీ చదువుతామో అదే మన దైనందిన జీవితంలో ప్రతిభింబిస్తుందని అన్నారు. కావున ప్రతీ ఒక్కరూ ‘ధ్యాన జగత్’ మాస పత్రికతో పాటు సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలను విధాగా చదివి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రాపంచిక ఎదుగుదలతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలన్నారు. పిఎస్ఎస్ఎం అంటే స్వేచ్చ, కరుణ, స్నేహం, ఆధ్యాత్మిక శాస్త్రం, అందరిని కలుపుకుని వెళ్లడం అన్నారు. జంతు జాతి పట్ల జాలి, కరుణ, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. జంతువులను చంపి తినడం నాగరికుడైన మనిషి చేస్తున్న అనాగరికమైన చర్య అన్నారు. ఈ సందర్బంగా ‘థింకింగ్ అండ్ డెస్టిని’ వైజాగ్ రమాదేవి తెలుగులో అనువాదించిన ‘ఆలోచన-గమ్యం’, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గిరినాథరావు రచించిన ‘ఆత్మోపదేశం’ అనే రెండు పుస్తకాలను వారు ఆవిష్కరించారు. అనంతరం అండమాన్ లో విశేషంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సురేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. రెసెప్షన్ కాంప్లెక్స్ లో 10 నుంచి 2 వరకు స్పిరిచ్యువల్ కౌన్సిలింగ్, అన్ని రకాల పిరమిడ్స్ తయారు చేయడానికి వర్క్ షాప్, ద్వారకా నివాస్ సభా ప్రాంగణంలో యువత కోసం అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమాలకు యువత హాజరై సద్వినియోగం చేసుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కోరారు. వేల మందికి భోజన, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించామన్నారు. 11 రోజుల అఖండ ధ్యానం, పార్వతి పిరమిడ్ లో హిందీ, ఇంగ్లిష్ ధ్యాన శిక్షణ తరగతులు, 2:30 నుంచి 5 గం. వరకు సీనియర్ మాస్టర్ల సందేశాలు జరుగుతాయని తెలిపారు. పిరమిడ్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో రూపొందించిన డాక్యుమెంటరీ ‘బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ బయోపిక్(జీవిత చరిత్ర)’ మొదటి ఎపిసోడ్ ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో పత్రీజీ కూతుళ్లు పరిణిత పత్రీ, పరిమళ పత్రీలు పాల్గొని అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ధ్యానుల్ని అలరింపజేశాయి.



