ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19:  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి  ఎక్స్ రోడ్డు నుండి ఆలంపల్లి ఎక్స్ రోడ్డు వరకు శనివారం 5కే రన్ నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  5కే రన్ లో యువకులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్పోర్ట్స్, వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నీ ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వర్షానికి కూడా లెక్కచేయకుండా విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలివచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు.  వచ్చే నవంబర్ డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.  18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలలన్నారు.  ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని యువకులు ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 19 వరకు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.  అలాగే ఒక పోలింగ్ స్టేషన్ నుండి వేరొక పోలింగ్ స్టేషన్ కు తమ ఓటును మార్చుకునేందుకు వీలుగా స్థానిక బిఎల్ఓ లను, తహసీల్దార్ ను లేదా eci.gov.in పోర్టల్ ద్వారా ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవచ్చని సూచించారు.  ఎన్నికల రోజు ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాన్ని ఇండ్లకే పరిపాతం కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించినందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలన్నారు. ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనదని, ఇట్టి ఓటుతో మంచి నాయకున్ని ఎన్నుకుంటే వారు మనకు మంచి సేవలు అందిస్తారని తెలియజేశారు.  ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు పని చేస్తుందని, ఈ అవకాశాన్ని వదులుకోకుండా డబ్బు మధ్యానికి, ఇతర ప్రలోభాలకు లొంగకుండా  మంచి నాయకులను ఎన్నుకొనాలన్నారు.  జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా యువతి, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 5కే రన్ లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.  వచ్చే శాసనసభ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొనాలన్నారు. గత ఎన్నికలలో రాష్ట్ర మొత్తంలో  73 శాతం ఓట్లు పోలవగా, జిల్లాలో మాత్రం76 శాంతం ఓట్లు పోలైనట్లు తెలిపారు.  ఈసారి ఎన్నికలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకొని, రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని జిల్లాలో 80 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం పెంచాలని కోరారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ గమనించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుక దేవి, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి హనుమంతరావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం,ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజెస్, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఏపీడి నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *