ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన అయోధ్య వోటర్లు

తమకు వోట్లు వేయలేదనే ఆగ్రహంతో ఫైజాబాద్‌ వోటర్ల పట్ల బీజేపీ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. వీరంతా హిందూ ద్రోహులని, హిందువుల వ్యతిరేకులనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ఈ స్థానంలో వోటమిని భరించలేకపోతన్నారు. పెద్ద అవమానంగా ఫీలవుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తిగా లేదు. ఓటమికి ప్రధాన కారణాలపై సత్యాన్వేషణ చేయాలన్న ఆత్రుత బీజేపీలో కనపడడం లేదు…  
సార్వత్రిక ఎన్నికల హంగామా ముగిసింది.  బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ  కూటమి అధికారంలోకి వొచ్చింది. ఇండియాకూటమి విజయానికి  చేరువులో ఆగిపోయింది. 2024 ఎన్నికలు భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని,మరింత బలపడుతుందని, రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ వికసిన్తుందనే సంకేతాలు ఇచ్చింది. ఇంతకంటే సంతోషకరమైన అంశమేముంటుంది?  ఈ సంకేతాలపై ఎవరికి తోచిన రీతిలో వారు ఘోషించుకోవొచ్చు. ప్రజాస్వామ్యం బతుకుతుందనే ఆశ లేదనే వారున్నారు. ఇప్పటికీ హిందుత్వం బలంగానే ఉందని భావించే వారున్నారు. హిందుత్వ సరికొత్త సవాళ్లను విసురుతుం దనేవారున్నారు. ద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరు తాయని కొంత మంది అంటారు.
పాము తన పిల్లలను తాను మింగినట్లు సరికొత్త విషపూరిత రాజకీయాలు తెరపైకి వొస్తాయనే వారున్నారు. అయోధ్య అంశం రాజకీయంగా లబ్ధిచేకూర్చదనే విషయం తేలిపోయింది. ఎన్నికల కంటే ముందు అయోధ్య రామ మందిర నిర్మాణం వల్ల రాజకీయంగా లబ్ధిచేకూరుతుందని, వోట్లవర్షం కురిపిస్తుందనుకున్నారు. కాని ప్రజలు ఆశలను వమ్ము చేశారు. హిందుత్వ శక్తులకు ఈ ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి. ఇతరవిశ్వాసాలకు సంబంధించిన వోటర్లను కూడా గౌరవించాలని, వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని,హిందుత్వ ఒక్కటే అన్ని రుగ్మతలకు విరుగుడు కాదని, వోట్లు పడవనే విషయాన్ని 2024 అంశాలు గట్టి సందేశమిచ్చాయి. తమకు అడ్డులేదని , ఏ కూటమి కూడా తమను ఓడిరచలేదని, అయోధ్య అంశంతో లాభపడవచ్చని బీజేపీ కలలుకంది. ఈ ఎన్నికల్లో గణనీయంగా విజయాలు సాధిస్తామన్న బీజేపీ ఊహలను వోటర్లు తారుమారు చేశారు.
అయోధ్య ప్రజలు మాత్రం బీజేపీ ఆశలను తలకిందులు చేశారు. ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించినందుకు వారేమీ కృతజ్ఞతగా లేరు. ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమి చెందింది. ఫైజాబాద్‌ ఎంపీ స్థానంలో అయోధ్య అసెంబ్లీ ఉంది. దీంతో నిరాశ చెందిన హిందుత్వ శక్తులు అయోధ్య వోటర్లు విశ్వాసం వ్యక్తం చేయలేదని, కృతజ్ఞతగా లేరని విమ ర్శలు చేశారు. ఇక్కడ బీజేపీ ప్రత్యర్థి పార్టీ తరపున దళిత హిందువు పోటీ చేశారు. స్థానిక హిందువులు, ఇతరవర్గాల ప్రజలు ప్రత్యర్థి పార్టీ దళిత హిందువుకే పట్టం కట్టారు. హిందుత్వం వేరు, హిందుయిజం వేరు. ఈ రెండిరటికిమధ్య ఉన్న సున్నితమైన తేడాను ఫైజాబాద్‌ పార్లమెంటు వోటర్లు చక్కగా చెప్పారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక బీజేపీ శక్తులు కకావికలమవుతున్నాయి. అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ స్థానికంగా వోట్లు అడిగింది. ప్రజాస్వామ్య నీతిని తుంగలో తొక్కారు. స్థానిక వోటర్లు ఇచ్చిన షాక్‌ నుంచి బీజేపీ ఇంకా కోలుకోలేదు. ఫలితాలు వెలువడినరోజు ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ కార్యాలయానికి వొచ్చారు. ఆ రోజు జై శ్రీరాం అనే నినాదాన్ని ఇవ్వలేదు. జైజగన్నాథ్‌ అని మోదీ నినదించారు. ఓడిశా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయం  విదితమే. ఇంతకంటే రాజకీయ పచ్చి అవకాశం వాదం మరొకటి ఉంటుందా?
తమకు వోట్లు వేయలేదనే ఆగ్రహంతో ఫైజాబాద్‌ వోటర్ల పట్ల బీజేపీ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. వీరంతా హిందూ ద్రోహులని, హిందువుల వ్యతిరేకులనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ఈ స్థానంలో వోటమిని భరించలేకపోతు న్నారు. పెద్ద అవమానంగా ఫీలవుతున్నారు.
ఆత్మవిమర్శ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఓటమి నుంచి గుణ పాఠం నేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తిగా లేదు. ఓటమికి ప్రధాన కారణాలపై సత్యాన్వేషణ చేయాలన్న ఆత్రుత బీజేపీలో కనపడడం లేదు. ప్రజలు ఎందుకు తమను తిరస్కరించారన్న అంశాలను విచారించదలుచుకోలేదు. హిందుత్వం తప్పు మరో అంశం పట్టని బీజేపీనేతలు సంబంధం లేని కారణాలను ఉటంకించి దీని వల్ల ఓటమి చెందామని చెప్పుకుని మానసికంగా సంతృప్తి చెందుతున్నారు. హిందుత్వ వికాసం, పునరుజ్జీవనం పేరుతో నగర, గ్రామీణ, మధ్యతరగతి వోట్లను కొల్లగొట్టాలన్న వారి ఆకాంక్షలను వోటర్లు తిప్పిగొట్టి నడి సముద్రంలో హిందుత్వ వాదులను ముంచేశారు. ఈ అవమానం నుంచి బీజేపీ శక్తులు ఇప్పట్లో కోలుకుంటారన్న నమ్మకం లేదు. సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలు, ప్రార్థనామందిరాలను, ఇళ్లను స్థానిక ప్రభుత్వం కూల్చేసింది. ఇది బీజేపీ ఓటమికి కారణమని స్టానికుల విశ్లేషణగా  ఉంటోంది.
పైగా ఇక్కడ స్థానికంగా హిందువులే ఎక్కువ. మెజార్టీగా ఉంటున్నారన్న విషయం చెప్పాల్సిన అవనరం లేదు.  జాతీయ, స్టానిక మీడియా, ఫైజాబాద్‌ తదితర ప్రాంతాలు, అయోధ్యలో సుందరీకరణ పేరుతో జరిగిన విధ్వంసాన్ని ఫోకస్‌చేయలేదు. దీనిని కప్పి పెట్టి ఉంచేందుకు మీడియా ప్రయత్నం చేసింది. సత్యాన్ని ఎంతోకాలం ఎవరైన దాచి ఉంచలేరు. సత్యం నిత్యం ప్రకాశిస్తుంటుంది. దానిని కనుమరుగు చేసే కొద్దీ మరింత తేజోవంతమవుతుంటుంది. ఎంతసేపు మీడియా .. రామమందిరం గురించి గొప్పుగా ప్రచారం చేసింది. కాని ప్రజల మనసుల్లో ఏముందో చెప్పలేదు. కనీసం దానిని కనుగొనే దిశగా ప్రయత్నం చేయలేదు. సుందరీకరణ పేరుతో జరిగిన కూల్చివేతలపై స్థానికులు  నిరసన వ్యక్తం చేయలేదు. కనీసం నిరసన  కోసం ర్యాలీలు కూడా నిర్వహించలేదు. గోల చేస్తే రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని ముద్రవేస్తారని స్థానిక హిందువులు భావించి మౌనంగా ఉండి  ఎన్నికల్లో వోటు ద్వారా సత్తా చాటారు. అయోధ్య రామమందిరం పేరుతో స్టానికంగా జరిగిన అభివృద్ది వల్ల వోటర్లు తీవ్ర  ఇక్కట్లకు గురయ్యారు. రాజకీయాలకు మతం జోడిస్తే ప్రజలు సహించరనే విషయాన్ని ఫైజాబాద్‌ వోటర్లు మరొకసారి ప్రపంచానికి చాటారు. ఫైజాబాద్‌ ఎంపీ స్థానంలో బీజేపీ ఓటమి చరిత్రలో నిలిచిపోతుంది. మతం పేరుతో ప్రజల స్వేచ్చను హరిస్తామంటే వోటర్లు ఊరుకోరు. అవకాశం వొచ్చినప్పుడు వోటు అనే వజ్రాయుధం ద్వారా గట్టి గుణపాఠం చెబుతారని ఫైజాబాద్‌ ఎన్నిక ఫలితం రుజువు చేసింది.
-శామ్‌ సుందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *