ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు

  • కాంగ్రెస్‌ ఎంపిల భేటీలో ఎంపీల సస్పెన్షన్‌పై సోనియాగాంధీ మండిపాటు
  • సస్పెన్షన్‌పై పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద  విపక్ష ఎంపీల నిరసన

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్‌ విషయమై ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మండిపడ్డారు. చట్టబద్ధమైన డిమాండ్‌ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న సోనియా, గతంలో ఎప్పుడూ కూడా ఇంతమంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేయలేదన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ చేసిన ప్రతిపక్ష ఎంపీలపై ఇలా వేటు వేయలేదని సోనియా పేర్కొన్నారు.

డిసెంబరు 13న జరిగిన ఘటన క్షమించరానిది.. దానిని సమర్థించలేమని సోనియా గాంధీ అన్నారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి ప్రకటన చేయాలని మాత్రమే ఎంపీలు అడిగినట్లు చెప్పారు. అయితే ఎంపీల అభ్యర్థనపై ప్రభుత్వం వ్యవహరించిన అహంకారాన్ని చెప్పటానికి పదాలు లేవని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో జరిగిన అలజడి ఘటన క్షమించరానిదన్న సోనియా గాంధీ దాన్ని ఎవరూ సమర్థించలేరని తెలిపారు. దీనిపై స్పందించడానికి ప్రధాని మోదీకి నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారన్నారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు.

ప్రధాని సభ గౌరవాన్ని, దేశ ప్రజలను పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులను ఈ సెషన్‌లో పార్లమెంట్‌ లో ఆమోదించారు.. జవహర్‌లాల్‌ నెహ్రూ లాంటి గొప్ప దేశ భక్తుల పరువు తీసే ప్రయత్నాలు జరిగుతున్నాయని ఆమె తెలిపారు. చారిత్రక వాస్తవాలను నిరంతరం వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు..ఈ ప్రయత్నాలకు స్వయంగా ప్రధాని, హోమ్‌ మంత్రి నాయకత్వం వహించినా తాము భయపడమని, తలవంచబోమని, నిజం చెప్పడానికి కట్టుబడి ఉంటామని సోనియా గాంధీ ప్రకటించారు.

దేశంలో ‘ఏకపార్టీ పాలన’ నెలకొల్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ భావిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్‌ చేశారని విమర్శించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్‌ షా నుంచి ప్రకటన కోరినందుకు 141 మంది సభ్యులను సస్పెండ్‌ చేశారన్నారు. అంతేకాకుండా నిందితులు సభలోకి చొరబడడానికి కారణమైన బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడిని ఇప్పటి వరకు ప్రశ్నించలేదని చెప్పారు. పార్లమెంట్‌కు పటిష్ఠ భద్రత ఉన్నా దుండగులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *