ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి
కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 03 : తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళ పాటు భ్రస్టు పట్టించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్ధిక పరిస్థితి గమనించి కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటి ఏర్పాటు చేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం నాడు లేఖను విడుదల చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం అంటూ ప్రకటించింది. శ్వేతపత్రంలో పదేళ్ళు తెలంగాణను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌పై విచారణ జరిపించాలని కోరలేదని లేఖలో పేర్కోన్నారు. తెలంగాణలో అన్నపు రాశులు ఒకచోట ఆకలిదప్పులు ఒకచోట కేంద్రీకృతమయ్యాయని పేర్కొన్నారు. వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకుల దొరతనాన్ని పున:నిర్మించి వ్యవసాయ కూలీల, పేదరైతుల , మధ్యతరగతి ఉద్యోగ కార్మిక వర్గాలను కకలావికలం చేసారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధికం అంటూ అంకెల గారడి చూపిన గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్ళీ భూస్వామ్యం పెత్తందాడి గడియల నిర్మాణానికి పునాదులు వేసారని లేఖలో విమర్శించారు. కాళేశ్వరం పేరిట దోపిడి , మిషన్ భగీరధ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టుల కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతట ప్రజలను వంచించారని లేఖలో తెలిపారు.
ప్రభుత్వాలు ఇచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదని శ్వేతపత్రాలు వాస్తవాలను వెల్లడిరచవని విమర్శించారు. అందువలన వాస్తవాలు ప్రజలకు తెలియపరచాలని లేఖలో పేర్కోన్నారు. కేసీఆర్‌కు అన్నీ ఆస్తులు ఎక్కడివి , హరీష్ రావు ఏ శ్రమతో వేలకోట్లు ఆశమయ్యామని ప్రశ్నించారు. కేటిఆర్ , కవిత , సంతోష్ రావుల ఆర్ధిక స్థితిగతులపై వాస్తవాలు ఏమిటని లేఖలో ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సంటేజుల వివరాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాకంటక నయూమ్‌ముఠా ఎన్‌కౌంటర్ అనంతరం జప్తు అయిన 4,5 వేల కోట్ల రూపాయలు ఎవరికి చేరిందని లేఖలో ప్రశ్నించారు. ఇవన్ని శ్వేతపత్రాల పరిధికి రావా అని ప్రశ్నించారు.
ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజా కోర్టులో పాలకులు శిక్షించగలరని లేఖ ద్వారా ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా అని ప్రశ్నించారు. అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలని లేఖలో కోరారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచారించాలని డిమాండ్ చేయాలని కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటి ఏర్పాటు చేయాలని లేఖలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని పలుసార్లు ప్రకటించారని ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలని ప్రజలందరు డిమాండ్ చేయాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.