హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వొచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 175, పంచాయతి రాజ్, గ్రామిణాభివృద్ధి శాఖకు సంబందించి 60 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, హోం శాఖకు సంబందించి 38 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 374 అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వొచ్చిన దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.




