ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26:  ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. ఈనెల 28 నుండి జనవరి  6 వరకు ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలపై ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్  కమిషనర్లతో జిల్లా కలెక్టర్ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం ప్రజాపాలన అని ప్రజలందరూ ఆనందంగా పాల్గొని ప్రభుత్వ గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం మరియు చేయూత పథకాలపై ప్రజలు దరఖాస్తులను అందజేయుటకు అవసరమైన మంచి వాతావరణాన్ని, వసతులను కల్పించాలని అన్నారు.
 ముందుగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత గాని రేపు ఉదయం సమయంలో గానీ మండల  స్థాయిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు మండల స్థాయి అధికారులతో  మరియు మునిసిపల్ స్థాయిలో మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు మరియు మున్సిపల్ అధికారులతో  ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సమన్వయ  సమావేశం నిర్వహించి ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలకు  ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు.
 ప్రతి ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలలో గ్రామ పంచాయతీల వారీగా ప్రజా పాలన కార్యక్రమం షెడ్యూల్ ను ప్రదర్శించాలని, ప్రజాపాలన కార్యక్రమం ఒకరోజు ముందే ఆయా గ్రామ పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు వినిపించాలని అన్నారు.
 ప్రతి మండలంలో రెండు టీంలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్, ఏపీవో,  ఏపీఎం, ఏఈ ఎలక్ట్రిసిటీ, ఎంఏవో తదితరులతో ఒక టీం,
 తాసిల్దార్ నేతృత్వంలో మండల పంచాయతీ అధికారి, మండల సర్వేయర్, మండల స్టాటిస్టికల్ అధికారి, ఎంఈఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులతో 1 టీం ఏర్పాటు చేసి ప్రతి టీం రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2  గ్రామపంచాయతీలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, కరోబార్ ,  ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, బిల్ కలెక్టర్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులతో కూడిన గ్రామ స్థాయి బృందాలతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించాలని అన్నారు. దరఖాస్తు తో పాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డును  జతపరచాలని  అన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున గ్రామపంచాయతీలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని అలాగే ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి కౌంటర్ కు ఒక రిజిస్టర్ మైంటైన్ చేయాలని అన్నారు. ప్రజా పాలన ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ రోజు దరఖాస్తు చేసుకోనివారు  జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీలో పంచాయతీ సెక్రెటరీకి దరఖాస్తులను అందజేయవచ్చని అన్నారు.
రోజువారి దరఖాస్తు వివరాలను జిల్లాస్థాయిలో అందించాలని అన్నారు. అలాగే ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ను నిర్మించేందుకు పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలని తాసిల్దారులకు సూచించారు.
 ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ బుధవారం మధ్యాహ్నం సంగారెడ్డిలో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని ఆర్డీవోలు, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులకు సూచించారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ నాగరాజమ్మ, పిడి డిఆర్డిఏ జయదేవ్ ఆర్య, డిపిఓ దేవకీదేవి, జడ్పీ సీఈఓ రమేష్, ఆర్డీవోలు రమేష్, బన్సీలాల్, బెన్ శాలెం  తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *