‘‘ఈ ఉపఎన్నికల వోటింగ్ నాటికి ఎన్ని చిత్రాలు ఎన్ని ఘర్షణలు తలెత్తినా అన్నింటిని చిత్తు చేస్తూ వోటర్ మహాశయులు మటన్ ముక్క, మందు, మనీ మాయలో పడకుండా ఎక్కడికక్కడ వివేకంతో గతంలోని ఈ గడ్డ పోరాటాల వారసత్వ స్పూర్తితో చైతన్యవంతులై పార్టీ(అగ్రకులా)ల కుతంత్రాలను కట్టడిచేస్తూ.. కూడబలుక్కునే తోడు దొంగల బాగోతాన్ని బద్దలు కొడుతూ ముందుకు వెళితే ఏ గోడు ఉండదు. అంబేద్కర్ అందించిన వోటు వజ్రాయుధంతో మరెక్కడ మరో ఉప ఎన్నికలు పునరావృతం కాకుండా సరైన నిర్ణయంతో పార్టీలకు నాయకులకు వణుకు పుట్టేలా చరిత్రను తిరగరాయండి.. ’’
మునుగోడు ఉప ఎన్నిక ఎందు(ఎవరి)కోసం..ఈ నియోజకవర్గంలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి అభివృద్ధిలో ఎవరిది ఎంత పాత్ర ఉంది.. ఈ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారని పరిశీలిస్తే బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులు అధికంగా నివసి స్తున్నారు.కానీ ఈ నియోజకవర్గం అగ్రకులాల ఆధిపత్య కబంధహస్తాల్లో ఇన్నాళ్లు కొనసాగుతుంది. సుమారు 90 శాతం ఉన్న బహుజనుల మధ్య అనైక్యతను రెచ్చగొడుతూ కులాల, మతాల మధ్య చిచ్చు పెడుతూ విభజించి పాలిస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల వేళ వోట్ల కోసం ధనం, మద్యం, ఉచితాలు, బహుమతులు, తాయిలాల పేరుతో మెజారిటీ వోట్ల ను కొల్లగొడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అగ్రకులాల వారు చట్టసభలో కూర్చుంటున్నారు. మెజార్టీ జనాభా(వోటర్ల) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో ఏ ఒక్క ప్రధాన పార్టీ కూడా బహుజనులకు అవకాశం ఇవ్వడం లేదు. అగ్రకులా(పార్టీ)లకు వోట్లు వేసే అనామకులుగా బహుజనులను భావిస్తున్నారు.
నేడు ఉప ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యంలోని బహుళ పార్టీల వ్యవస్థలో ప్రజాభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నామని బూటకపు మాటలతో వారి వారి వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల(పార్టీల) ప్రతిష్టగా భావించి మధ్యంతరంగా ఉప ఎన్నికలకు సిద్ధపడ్డారు. పార్టీ ఏదైనా, నాయకు(పాలకు)లు ఎవరైనా అందరూ ‘‘ఎర్ర గురిగింజ నీతి’’నే అవలంభిస్తున్నారు. ఎన్నికలు వస్తే గాని ప్రజల సమస్యలు, బాధలు గుర్తుకు రావడం లేదు. వోట్ల వేటలో వాటినే వల్లె వేస్తూ కపట ప్రేమను ప్రకటిస్తారు. ద్వితీయ శ్రేణి నేతలకు డబ్బులు వల వేస్తూ జంపింగ్ జిలానీలుగా మారుస్తున్నారు. కోట్ల ధనం కుమ్మరిస్తూ రణక్షేత్రంగా మారుస్తున్నారు. ఆప్యాయంగా కలిసి ఉండే ప్రజలు తోపులాటలు, ఘర్షణలు, కక్షలు కార్తమ్యాలతో.. వీడు ఆ పార్టీ వాడు, వాడు ఈ పార్టీ వాడని విభజన రేఖలు సృష్టించుకుని గొడవ పడుతున్నారు. మరో వైపు ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం వోట్లు కలిగిన పద్మశాలి, యాదవ, గౌడ కులాలను కుల సంఘాల పేరుతో విందులు నజరానాలతో ఆశల వల వేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ఎత్తులు, జిత్తులు వేస్తూ చిత్తు చేస్తున్నారు. బహురూపుల వేషాలు, మాటలతో మునుగోడు ప్రజలతో మైండ్ గేమ్ (మానసిక క్రీడ)మొదలెట్టారు. ఇది ప్రజల కోసమా! వారి స్వార్థ ప్రయోజనాల కోసమా! అనేది విచక్షణతో ఆలోచించాలి వోటరు మహాశయులు.
మునుగోడులో తాజా గణాంకాల ప్రకారం మొత్తం వోటర్లు 2 లక్షల 41వేల 367 కాగా, పురుషులు.. 1లక్ష 21వేల 501, స్త్రీలు.. 1లక్ష 19వేల 859గా నమోదు అయినారు. ఇందులో బోగస్ వోట్లు ఎన్ని ఉన్నాయో! ఏ పార్టీ వాటా ఎంతో వోటింగ్ తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ పార్టీలు, నాయకులు ఆడే ఓటు గేమ్ గానే విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘ఏరు దాటాక బోడ మల్లయ్య’’ అనే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఉపఎన్నిక అనేది ఏదో ప్రత్యేక అసాధారణ పరిస్థితుల్లో వస్తే ఆహ్వానించక తప్పదు. వ్యక్తుల, పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం మధ్యంతరంగా ఉప ఎన్నికలకు పాల్పడుచున్నారు. వోటర్లు ఐదేళ్ల ఆయుష్షు పోస్తే, ఆయా నియోజకవర్గాలకు ప్రజలకు అభివృద్ధి చేయమని, కంటికి రెప్పలా కాపాడుకోవాలనే దాన్ని విస్మరించి స్వార్థ అనైతిక రాజకీయ క్రీడకు వేదికగా ఉప ఎన్నికలను మార్చుచున్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాదు.. నేడు మునుగోడు ఉపఎన్నికలు ఆయా నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షించినవి కావు. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో గతంలో ఇచ్చిన ఉప ఎన్నికల హామీలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. పార్టీ(నాయకు)ల స్వార్ధ ప్రయోజనాలు తీరినాయి కానీ ప్రజలపై భారం తప్పలేదు. త్వరలోఎలాగూ శాసనసభ సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా మునుగోడు నియోజకవర్గం ప్రజల పైన ఉప ఎన్నికల పిడుగు పడింది.
కాదు కాదు పార్టీ నాయకులే వేసినారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడడం భావ్యమా! పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహణలో విఫలమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధనం, మద్యం, ఉచితాలతో అరచేతిలో స్వర్గం చూపుతూ వోటర్లను మభ్య పెడుతున్న అన్ని పార్టీల, నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి కల్పించిన సంస్థలను దుర్వినియోగం చేస్తూనే ఉంది. పేరుకే ప్రజాస్వామ్యం ఎన్నికల్లో అంతా ధనస్వామ్యమే చెలామణి అవుతుంది. దీనికి అన్ని పార్టీలు నాయకులు బాధ్యులే, బాధ్యత వహించాల్సిందే. రాబోయే మునుగోడు ఉపఎన్నిక తీర్పుతో ఓ పార్టీ అధికారం మాదే అని, మరో పార్టీవారు జాతీయ పార్టీకి బహుమానమని. సెక్యులరిస్టులకు మేమే పేటెంట్లమని, ఇంకో పార్టీ వారు మెజార్టీ ప్రజల భావజాలానికి పేటెంటు మాదే అని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇక్కడ చెప్పొచ్చే విషయమేమం•.. నియోజకవర్గ ప్రజల సమస్యలు, బాధలు వారి ఆకాంక్షలు ఈ ఉప ఎన్నికల్లో చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో నేడు ప్రధాన రాజకీయ పార్టీలు నిలబెట్టింది ఒకే ధనిక సామాజిక ఉన్నత వర్గం వారినే, మెజార్టీ ప్రజలైన బహుజనులను ఏ ఒక్క పార్టీ అభ్యర్థిగా నిలపలేదు.
ప్రజల ముందు మాత్రం గెలుపు గుర్రాలంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. వోట్ల కోసం మాత్రం అనైతికంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేసినోల్లే! మేయడానికే. వీరిలో అంతర్గతంగా ఉన్న ఐక్యతను బహుజనులు గ్రహించాలి. వీరి వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలు పార్టీల ఆధిపత్య ధోరణులకు ఆటస్థలంగా చేస్తూ ఉప ఎన్నికలను తెస్తూ ప్రజాస్వామ్యాన్ని నడమంతరాన ఖూనీచేస్తాండ్లు. ప్రజలను కులాలు, మతాల పేరుతో అజ్ఞానంలో మూఢత్వంతో తన్నకు చచ్చేలా చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు గానుగెద్దులా కండ్లకు గంతలు కట్టడం పరిపాటిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశంలో జరుపుకున్నాం కానీ ఆకలి, పేదరికం, రైతుల ఆత్మహత్యలు, మహిళా రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది. అధికారం, దేశ సంపద, కొన్ని ధనిక, అగ్రవర్ణాల, కులాల చేతుల్లోనే బంధీ కాబడింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన నియోజకవర్గాల్లో మాత్రమే వారికి ప్రాతినిధ్యం తప్ప వేరే చోట్ల అన్ని పార్టీల్లో అగ్రవర్ణాలదే పెత్తనం చలామణి అవుతుంది. ఈ ఉపఎన్నికల వోటింగ్ నాటికి ఎన్ని చిత్రాలు ఎన్ని ఘర్షణలు తలెత్తినా అన్నింటిని చిత్తు చేస్తూ వోటర్ మహాశయులు మటన్ ముక్క, మందు, మనీ మాయలో పడకుండా ఎక్కడికక్కడ వివేకంతో గతంలోని ఈ గడ్డ పోరాటాల వారసత్వ స్పూర్తితో చైతన్యవంతులై పార్టీ(అగ్రకులా)ల కుతంత్రాలను కట్టడిచేస్తూ.. కూడబలుక్కునే తోడు దొంగల బాగోతాన్ని బద్దలు కొడుతూ ముందుకు వెళితే ఏ గోడు ఉండదు. అంబేద్కర్ అందించిన వోటు వజ్రాయుధంతో మరెక్కడ మరో ఉప ఎన్నికలు పునరావృతం కాకుండా సరైన నిర్ణయంతో పార్టీలకు నాయకులకు వణుకు పుట్టేలా చరిత్రను తిరగరాయండి..
– మేదాజీ




