పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జిన్నారం మండల పరిధిలోని శివనగర్, నల్తూరు, ఖాజిపల్లి గ్రామాలతో పాటు బొల్లారం మున్సిపల్ పరిధిలో ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉప కేంద్రాలు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మాణ పనులకు పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపనలు చేశారు. కాజిపల్లి గ్రామంలో ఉపేది లక్షల రూపాయలతో నిర్మించిన ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్, పశువైద్యశాల నూతన భవనాలను ప్రారంభించారు.అనంతరం జిన్నారం గ్రామంలో బీసీ బందు లబ్ధిదారుడు అనిల్ కుమార్ ఏర్పాటుచేసిన నూతన వ్యాపార సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం సకాలంలో అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా 15 సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ప్రతి సబ్ సెంటర్ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించడంతోపాటు శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వైద్య విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. అత్యధిక వైద్యశాస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నయని తెలిపారు.కాజిపల్లి లో ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ మరియు పశువైద్యశాల భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సామాజిక ద్రుక్పథంతో ముందుకు రావాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేష్, అయ్యా గ్రామాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




