ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో

(నిన్నటి తరువాయి…)
అభివృద్ధిలో ప్రపంచంలోనే దూసుకెళుతున్నామని ప్రగల్పా లు పలుకుతున్న బిజెపి నిజస్వరూపం, డొల్లతనం కరోన కల్లోలంలో బయటపడిరది. నరేంద్ర మోడీ బి.సి చెప్పి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.సి కుల జనగణన చేస్తామని మాట్లాడిన బిజెపి అధికారంలోకి వచ్చాక జనగణన సాధ్యం కాదని బి.సి వ్యతిరేక కార్యకలాపాలకు తెగబడిరది. రాత్రికి రాత్రి మహిళా బిల్లు పెట్టి అందులో బి.సి కోటా ఇవ్వలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌ పేరుతో అగ్ర వర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి బి.సి అవకా శాలను, ఎదుగుదలను దెబ్బతీస్తుంది. దేశంలోని రైతుల్లో మెజార్టీలు బి.సి లే ఉంటారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి బి.సి లకు తీరని అన్యాయం చేసే కుట్రలు చేసింది దేశంలోని రైతులు చేసిన వీరోచిత పోరాటం వల్ల బిజెపి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. రైతు వ్యతిరేక చట్టాల ఫలితంగా డిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో బిజెపి అధికారానికి దూరమైంది. రైతు వ్యతిరేక, బి.సి వ్యతిరేక, మహిళా వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక బిజెపిని  డిల్లీ, పంజాబ్‌ ప్రజలను ఆదర్శంగా తీసుకొని ఈ ఎన్నికల్లో దేశం మొత్తం ఓడిరచాలన్సిన అవసరముంది. స్వదేశీ పాలన అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన మోడీ గత ప్రధానులకన్నా ఎక్కువ విదేశీ పర్యటనలు చేయడమే కాకుండా రష్యాతో యుద్ధ విమానాల కొనుగోలు రాఫెల్‌ కుంభకోణాల లాంటివి ఎన్నో చేసారు. కాంగ్రెస్‌ పాలనంతా అవినీతి అని మొత్తుకుంటున్నా బిజెపి అవినీతి బయటకు రాకపోవడానికి కారణం ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి వారి ద్వారా తీసుకునే అవినీతి బయటకు కనపడడం లేదు.

ప్రజలు త్యాగాలతో, నెత్తుటి చుక్కలతో, శ్రమ చుక్కలతో, కన్నీటి చుక్కలతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి వారి ద్వారా లక్షల కోట్ల సొమ్ము బిజెపి తీసుకుంటుందని చెప్పడానికి ఇటీవల బయటపడిన ఎలక్ట్రోల్‌ బాండ్ల కుంభకోణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో వారి స్థావరాల్లోనే టెర్రరిస్టులను అంతమొందిస్తున్నామని చెపుతున్న వాటికి నేటికీ ఎలాంటి రుజువులు లేకపోగా నోట్ల రద్దు, ఇ.డి దాడులతో ప్రతిపక్షాలను, ఎన్‌ ఆర్‌ సి, సిఎఎ, రైతు వ్యతిరేక చట్టాలు, కుల మతాల ఘర్షణలు సృష్టించి ప్రజలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్న బిజెపి తీవ్రవాద రాజకీయాలను గమనించి వ్యతిరేకించాలి. సుస్థిర పాలన, గుజరాత్‌ తరహా పాలనంటూ అధికారంలోకి వచ్చిన బిజెపి దేశ సంపదను మొత్తం గుజరాత్‌ సంపన్నులకు దోచిపెట్టి వారిని ప్రపంచ కుబేరులుగా మార్చింది. గుజరాత్‌ తరహాలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలపై దాడులు చేసి, బహిరంగ మానభంగాలు, హత్యలు, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ప్రజలను చంపుతుంది. గుజరాత్‌ అల్లర్లలో శిక్షపడిన దోషులను విడుదల చేయడమే కాకుండా బాధిత ప్రజలకు న్యాయం కోసం పోరాడిన ఐపిఎస్‌ అధికారిని జైలులోకి నెట్టిన దుర్మార్గ బిజెపి పాలనను దేశ ప్రజలు తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జ్ఞానవంతులైన యువత దేశం విడిచి వెళుతున్నారు. అలా వెళ్ళలేని పేదలు, విద్యావంతులు బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు. ఈ స్థితిని సుస్థిర పాలన అనాలా? గుజరాత్‌ తరహా అభివృద్ధి అనాలా? ప్రజలు తేల్చుకోవాలి. ప్రాంతీయ పార్టీలను, ప్రగతిశీల పార్టీలను దేశవ్యాప్తంగా ఆధిపత్య రాజకీయాలను, తీవ్రవాద రాజకీయాలను కొనసాగించడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు బిజెపి చేసింది. ఉత్తరప్రదేశ్‌ లో మాయావతిని లొంగదీసుకుని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని లొంగదీసుకోవడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపి బలమైన కమ్యూనిస్టులను ధ్వంసం చేసింది. తెలంగాణలో లోపాయికార ఒప్పందం, ఆంధ్రప్రదేశ్‌ లో టిడిపి తో పొత్తు పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను మొత్తంగా కనుమరుగు చేసే కుట్రలో బిజెపి మొదటి స్థానంలో వుంది.

ప్రశ్నించే శక్తులను నిర్మూలించే దిశగా బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు గత పదేండ్ల పాలన పరిశీలిస్తే అర్థమవుతుంది. దండకారణ్యంలో ఆదివాసీలపై, నకలైట్లపై దండయాత్ర చేస్తున్న బిజెపి దురాక్రమణ అంతర్యుద్ధాన్ని తలపిస్తుంది. బిజెపి చేస్తున్న మారణకాండలో విప్లవకారులతో పాటు సాధారణ ఆదేవాసీలెందరో నేలకొరుగుతున్నారు. దండకారణ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని అక్కడున్న సహజ సంపదలను కార్పొరేట్లకు అప్పగించడానికి అప్పగించడానికి జరిగే యుద్ధంగా చూడాలి. ఛత్తీస్‌ ఘడ్‌ లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని ప్రకటించిన కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా 100 రోజుల్లో 75 మందిని కాల్చి వేశారు. వామపక్ష విప్లవోద్యమం ఉన్నంతవరకు బిజెపి కోరుకుం టున్న కార్పొరేట్‌ హిందూత్వ పునాది మీద ఏర్పాటు చేయాలనుకుంటున్న ‘నూతన భారత్‌’ అవకాశం లేదనే బిజెపి ఈ మారణకాండకు తెగబడిరది. గత బిజెపి యేతర పాలనలో దేశ ప్రజలు అనుభవించిన అణచివేతకన్నా గత 10 ఏండ్లుగా జరుగుతున్న అణచివేత చాలా ప్రమా దకరమైంది. పివి నరసింహారావు ఆర్థిక విధనాలకన్నా, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కన్నా, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ కన్నా చాలా ప్రమాదకరమైందని మేధావులు చెపుతున్న విషయాలను ప్రజలు గమనించాలి.

వికసిత్‌ భారత్‌ అంటూ వినాశన భారత్‌గా మార్చారు..
ఆర్థికాభివృద్ధిలో దేశం ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళి పోతుందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకుందని, బ్రిటన్‌ ను మించిపోయిందని, రానున్న ఐదేళ్లలో జపాన్‌, జర్మనీని కూడా దాటేసి తృతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని, వికసిత భారత్‌ అంటూ అబద్ధాలు వల్లిస్తోన్న బిజెపి అసలు రంగు వాస్తవాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వృద్ధి రేటు గొప్పలే కానీ మానవాభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండడం, దేశంలోని మెజార్టీ ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం కుదేలు, కార్మికుల్లో నైపుణ్యం పెరగకపోవడం, ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసిన వారిలో ఆధునిక పరిశ్రమలకు అవసరమైన పెంచి దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయకపోవడం లాంటి ఎన్నో లోపాలతో బిజెపి పాలన కొనసాగింది.
మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో నీరాజనాలు పట్టిన ప్రపంచంలోని పలు దేశాలు నేడు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపైన వచ్చిన ఆరోపణల్లో బిజెపి ఆత్యుత్సాహంతో పాటు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, పారదర్శకంగా, నిజాయితీగా, న్యాయపూరితంగా విచారించాలని, స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఉండాల్సిన ప్రమాణాలు, కనీస ప్రజాస్వామిక సూత్రాలు పాటించాలని మాట్లాడుతున్నారు. దేశ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా మోడీ అప్రజాస్వామిక పాలనపై విరుచుకుపడుతుంది.

మోడీ గత పదేండ్ల పాలన వల్ల దేశ ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని, ఈ వ్యత్యాసాలు బ్రెజిల్‌, దక్షిణాఫ్రిక, అమెరికా కంటే మరీ ఘోరంగా ఉన్నాయని గణాంకాల ద్వారా రుజువైంది. భారతదేశంలోని ఒక్క శాతం ఐశ్వర్యవంతుల గుప్పిట్లో 40 శాతం సంపద కీంద్రీకరమైనట్లు నివేదిక తెలిపింది. ఫారిస్‌ నుండి నలుగురు ఆర్థిక వేత్తలు నిగ్గు తేల్సిన వ్యత్యాసాలను ఇండియాలో 1961 నుండి ఎన్నడూ చూడలేదని అన్నారు. భారత్‌ లో బిలియనీర్‌ రాజ్‌ ఏలుబడి సాగుతుందని ఆ ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు. కుల, మత శ్రేణుల వారిగా అసమానతలు పెరిగిపోయాయని, భారతీయ సమాజం కర్మ సిద్ధాంతం ఇరుసు మీద తిరుగుతున్నదని, పదేండ్ల ఎన్‌ డి ఎ పాలనలో పెన్షన్‌, గ్రాట్యుటీ వంటి సామాజిక బాధ్యత కలిగిన స్థిరమైన ఉద్యోగాల కల్పన లేనే లేదని సర్వేలు స్పష్టం చేశాయి. దేశంలోని 35 శాతం కుటుంబాలు రోజుకు (జాతీయ కనీస వేతనం) 375 రూపాలకన్నా తక్కువ సంపాదిస్తున్న చేదు వాస్తవాన్ని ఎత్తి చూపారు. ఉన్నత విద్యనభ్యసించిన వారు 2000 సంవత్సరంలో 35 శాతం ఉండగా అది 2022 నాటికి 65.7 శాతంగా పెరిగిందని, అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పక్కకు పెడితే ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కృషి జరగలేదు. ఇతంటి దుర్మార్మ పాలన కొనసాగిస్తూ 2047 కల్లా భారత్‌ ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ గొప్పలు పోవడాన్ని దేశ ప్రజలతో పాటు విదేశీ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ( 70 కోట్ల మించిన 30 సంవత్సరాల లోపు) కల దేశంగా ఉండి అభివృద్ధికి అవకాశమున్నప్పటికి వారికి సరైన చదువు, నైపుణ్యాలు కొరవడడం, ఉపాధి కల్పన లేకపోవడం దేశానికి ఎంతో నష్టం చేస్తుంది.

భారతదేశంలో న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని, ఎన్నికల వేళ ఆ సర్వోన్నత వ్యవస్థను అప్రతిష్టపాలు చేసే కుట సాగుతున్నదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ కు ఏకంగా 600 మంది న్యాయవాదులు మూకుమ్మడి లేఖ వ్రాయడం చూస్తే దేశంలోని బిజెపి పాలనను అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు కొన్ని హెచ్చరికలు, కాసిన్ని జాగ్రత్తలు చెప్పిన ఈ లేఖ మీద ప్రధాని నరేంద్ర మోడీ ఉలిక్కిపడడం చూస్తే దేశంలోని భయంకర పాలన అర్థమవుతుంది. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెబుతున్న మోడీ మాటల్లో నిజాయితీ లేదని, డొల్లతనం కనిపిస్తుంది. ఎన్నికల బాండ్ల కుంభ కోణంపై, ఆరు నెలలుగా ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అక్రమ జైలుపై, ఇ డి పనితీరుపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను చూస్తే బోధపడుతుంది. బిజెపి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులపై, ప్రజా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేసి తీవ్రవాద రాజకీయాలను కొనసాగిస్తున్న బిజెపి పాలనను దేశీయ, అంతర్జాతీయ మేధావులు, ఉద్యమకారుల అందరూ వ్యతిరేకిస్తున్న తరుణంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరముంది.

ప్రజాస్వామ్య రక్షణ ప్రజల చేతిలోనే…
రాచరిక పాలనలో ‘యధా రాజ తథా ప్రజా’ ఉండేది. ప్రజాస్వామ్య దేశంలో ‘యధా ప్రజా తథా రాజ’ గా మారింది. ప్రజలు తమ ఓటు ద్వారా ఎలాంటి నాయకుడిని, ఎలాంటి పార్టీని ఎన్నుకుంటే అలాంటి పాలన వస్తుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సబ్బండ కులాలు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు కలిగిన దేశ ప్రజలను కాపాడి, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే పార్టీని ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేండ్లకోసారి ఎన్నికలే కాదు, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వారి వాటా వారికి ధక్కడమే నిజమైన సామాజికన్యాయం, నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా సమాన అవకాశాలను కల్పించడం, ఆ దిశగా ప్రజలు తమ వ్యవహారాలను నిర్వహించడానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే వుంది.  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశంలోని ఆయా ప్రజా సంఘాలు, ప్రగతిశీల శక్తులు, భౌతికవాదులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, శ్రామిక శక్తులు, రైతులు మిత్ర వైరుధ్యాలను పక్కకు పెట్టి ఐక్యంగా దుష్ట ఫాసిస్టు బిజెపిని ఒడిరచాల్సిన అవసరముంది. ఈ యుద్ధంలో ముఖ్యంగా దేశంలో మెజార్టీ సమాజమైన బి.సి లు చైతన్యంతో ఆలోచన చేసి రాబోవు ప్రమాదాన్ని గుర్తించకుండా మూస ధోరణితో, హిందూ భావజాల మూడ పిచ్చిలో, అతి విశ్వాసంతో బిజెపికి మద్దతిస్తే రాబోవు కాలంలో ఎక్కువ నష్టపోయేది కూడా బి.సి సమాజమేననే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.

-సాయిని నరేందర్‌
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
9701916091                ి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *