- ఎపిలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
- అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత
కర్నూలు, అక్టోబర్ 20 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఎపిలో కొనసాగుతుంది. గురువారం 44వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బనావాసి గ్రామం నుండి ఉదయం 6 గంటలకు ఆయన యాత్ర మొదలైంది. ఉదయం సెషన్ 9 గంటలకు ముగటిలో ముగించారు. తిరిగి 4 గంటలకు హాలాహార్వి నుండి తిరిగి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు కల్లుదేవకుంటలో కార్నర్ మీటింగ్‌తో ముగిసింది. ఆయన మంత్రాలయం మండలం చెట్నెహళ్లిలో రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్ర సందర్భంగా పలువురు మిర్చి, పత్తి రైతులు రాహుల్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వొచ్చారు. ఇక సిసిఎస్‌ను రద్దుకు కృషి చేయాలంటూ పలువురుఉద్యోగులు రాహుల్‌ను కలిసి విన్నవించారు. రాహుల్ వెంట ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ ఎస్.శైలజానాథ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కె.బాపిరాజు, ఇతర నాయకులు, వేలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు.




