ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరి దీవెనలు నాకు అందించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం మాడుగుల మండలంలోని అవురు పల్లి, నల్ల వారి పల్లి, చంద్రాయన పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నా అభివృద్ధి అనుకున్నంత జరగలేదని మౌలిక వసతులు సరిగా లేవన్నారు. ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎన్ని ఇళ్ళు నిర్మించి ప్రజలకు అందజేశారు. చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బిజెపి కి మద్దతు పలుకుతున్నారని ప్రభుత్వం ఏర్పడగానే ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత బిడ్డగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మీకు సేవ చేయాలని ఆరోసారి పోటీలో ఉన్నానని మీ అందరి దీవెనలు తనపై ఉంచి అసెంబ్లీకి పంపిస్తే మీ గొంతు నవ్వుతానన్నారు. ఇదే నా చివరి విన్నపమని ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని ఆచారి తన ప్రసంగాన్ని ముగించారు. దయ్యాల బోడు తండాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆచారి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజలందరి దీవెనలు నాకు అందించి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి



