- ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడానికి ఇదే కారణం
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ప్రగతి భవన్ కేంద్రంగా దలారీలు అధిక కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రొ.కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రగతి భవన్ కేంద్రంగా నడుస్తున్న దళారీ వ్యవస్థను వెంటనే నిలువరించాలనీ, లేనిపక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ అవినీతిని ప్రోత్సహిస్తున్నదని భావించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మే 4 నుంచి వారం రోజుల పాటు కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర చేపడుతున్నామనీ, నల్గొండ జిల్లా ఉదయసముద్రం నుంచి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ నక్కలగండి వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్లు వేయడం లేదనీ, అభ్యర్థులు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్నందున వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో టీజేఎస్ ఉపాధ్యక్షులు ప్రొ.పీఎల్వీ, గంగాపురం వెంకటరెడ్డి, రాజా మల్లయ్య, ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్, బైరి రమేశ్, నిజ్జన రమేశ్, మహిళా జన సమితి అధ్యక్షురాలు రావుల లక్ష్మి, యువజన విభాగం అధ్యక్షులు సలీం పాషా, విద్యార్థి విభాగం నేతలు బాబు మహాజన్ తదితరులు పాల్గొన్నారు.




