ప్రగతి కరువైన ఓరుగల్లుకు అందరూ పెత్తందార్లే!

  • చెప్పుకోవడానికే పోరాటాల గడ్డ … సాధించింది శూన్యం
  •  హేమాహేమీల ప్రాతినిధ్యం…. అయినా ఎదుగూ బొదుగూలేని వైనం
  •  ఎన్నికల నినాదాలకే పరిమితం…కోచ్‌ఫ్యాక్టరీ, ఆజంజాహి, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ
  •  జిల్లాలో నలుగురేసి మంత్రులున్నా ఒరిగిందేమీ లేదు…కఎక్కువ కాలం మంత్రిగా కడియం శ్రీహరి         
ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌ పరిధిలో ఉన్న 34 మండలాల్లో మొత్తం 18 లక్షల 16 వేల 543 మంది వోటర్లున్నారు. వీరిలో పురుషులు 8 లక్షల 91వేల 940 కాగా, మహిళా వోటర్లు 9 లక్షల 24వేల 208 మంది. అంటే పురుష వోటర్లకన్నా మహిళా వోటర్లు దాదాపు 32 వేల 268 మంది ఎక్కువగా ఉన్నారు.గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ 6,63,756 వోట్లు పొందగా ..భారత్‌ రాష్ట్ర సమితి 5,03,298 మరియు భారతీయ జనతా పార్టీ 1,56,638 పొంది నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయింది.

వరంగల్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 23 : వరంగల్‌(ఉమ్మడి) జిల్లా మొదటి నుండీ ప్రత్యేకతను సంతరించుకుంది. స్వర్ణయుగంగా చెప్పుకునే కాకతీయుల కాలంలో రాజధానిగా వెలుగొందిన ఈ ప్రాంతం స్వాతంత్య్ర పోరాటాలు మొదలు ప్రపంచాన్ని విస్మయపరిచే అనేక పోరాటాలకు పురిటిగడ్డ. అటు రాజకీయంగా, ఇటు సాహిత్య, సాంస్కృతిక, పర్యాటకంగా నేటికీ ఈ ప్రాంతం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇదంతా పూర్వవైభవం. స్వాతంత్య్రానంతరం ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో చెప్పుకోవడానికి ఏమీలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుండి రాష్ట్ర మంత్రి వర్గంలో హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిపి ఈ జిల్లా నుండి ఏకకాలంలో నలుగురేసి మంత్రులు ప్రాతినిధ్యం వహించిన సంఘటనలు లేకపోలేదు. తెలుగుదేశం, ఆ తర్వాత బి(టి)ఆర్‌ఎస్‌ కాలంలో ఎక్కువ కాలం మంత్రివర్గంలో కడియం శ్రీహరి లాంటి వారు కొనసాగినా..ఉపాధి రంగంలో చెప్పుకోదగ్గ అభివృద్ది జరుగలేదనే చెప్పాలె.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. గతంలో హనుమకొండ కూడా ఒక పార్లమెంటు స్థానంగా కొంతకాలం కొనసాగింది. 1977, 1980లో పి.వి. నరసింహారావు హనుమకొండ పార్లమెంటు నుండి ఎంపికైనారు. ఆ తర్వాత 1984లో బిజెపి అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి చేతిలో ఓటమిని చవిచూసిన పివీ ఈ ప్రాంతంపైన అలకవహించి, తర్వాత కాలంలో ప్రధాని అయిన ప్పటికీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదన్న అపకీర్తిని మూటకట్టుకున్నారు. ఎన్నికలనగానే వరంగల్‌లో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఆజంజాహి మిల్లు గుర్తుకు వొస్తాయి. గత దశాబ్దాలుగా అవి కేవలం నినాదాలుగానే మారాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు  కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని 1982 నుండి స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. రెండు సార్లు అనుమతులిచ్చినట్లే ఇచ్చి, దాన్ని ఇతర రాష్ట్రాలకు మళ్ళించారు. అందుకు ప్రత్యమ్నాయంగా  పివోహెచ్‌ వర్క్‌షాపును ఏర్పాటు చేసినా అది పెద్దగా ఉపాధి కల్పించేదిగా లేదు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా అప్పటికే పదివేల మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ఆజంజాహి మిల్లును మాడ్రనైజ్‌ చేయకుండా నడువదన్న ముద్రవేసి 1990లో పూర్తిస్థాయిలో మూసివేశారు. దానికి ప్రత్యమ్నాయమంటున్న కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ కూడా ఆజంజాహిని మరించలేకపోతున్నది.

అలాగే  విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, మామునూరు విమానాశ్రయం విషయంలో  కేంద్ర ప్రభుత్వాలు అనేక హామీలను గుమ్మరించాయి. ఏటూరునాగారంలోని బిల్ట్‌ (రేయాన్స్‌ ఫ్యాక్టరీ) పునరుద్దరణ నేటికీ నోచుకోలేదు. ఇవన్నీ ఈ ప్రాంతం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.మే 13న వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండిరటిలో వరంగల్‌ ఎస్సీ రిజర్వుడ్‌ కాగా, మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ స్థానం. వరంగల్‌ విషయానికొస్తే దేశానికి స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వరంగల్‌ పార్లమెంటు స్థానానికి 20 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 21వసారి ఈ ప్రాంతం ఎన్నికకలకు సిద్ధమైంది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే వరంగల్‌ పార్లమెంటుకు ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుంది. ఈ పార్టీ ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఇక్కడి నుంచి తన అభ్యర్ధులను గెలిపించుకుంది.

ఆ తర్వాత అయిదుసార్లు తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ రెండవ స్థానంలో  నిలిచింది. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో నాడు అత్యంత ప్రజాదరణ పొందిన పొగ్రెసివ్‌ డెమక్రటిక్‌(పిడిఎఫ్‌) ఫ్రంట్‌ అభ్యర్థిగా పెండ్యాల రాఘవరావు గెలుపొందారు. రెండు శాసనసభ స్థానాలకు, ఒక పార్లమెంటుకు ఒకేసారి పోటీచేసిన రాఘవ రావు మూడిరటిలో గెలువడం విశేషం. అంతేకాదు, నాడు దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీ వొచ్చిందని చెబుతారు. 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నుండి ఎస్‌బి గిరి వరంగల్‌ పార్లమెంటు ఆభ్యర్థిగా గెలుపొందారు. అలాగే పద్నాలుగేళ్ళ పాటు నిర్విరామంగా జరిగిన మలివిడుత తెలంగాణ ఉద్యమ నేపద్యంలో 2004లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డి. రవీంద్రనాయక్‌ ఎన్నిక కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి నేటి ఎన్నికల వరకు బి(టి)ఆర్‌ఎస్‌ ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహిస్తూ వొస్తున్నది. అంటే సుమారు దశాబ్ధకాలంగా కడియం శ్రీహరి, ఆ తర్వాత రెండు విడుతలుగా పసునూరి దయాకర్‌ ఎంపీలుగా కొనసాగారు.

ప్రస్తుతం 21వసారి ఇక్కడ జరిగే ఎన్నికలకోసం ఈ నియోజకవర్గం సిద్ధమైంది. ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతున్నది. విచిత్రమేమంటే ఇక్కడ పోటీ పడుతున్న ముగ్గురు కూడా ఒకప్పుడు ఒక గూటి పక్షులే కావడం. నాలుగు నెలల క్రితం అధికారం కోల్పోవడంతో కొందరు ముఖ్యనేతలు బిఆర్‌ఎస్‌ను వీడిపోయారు. అలాంటి వారే ఇప్పుడు ప్రత్యర్థులుగా నిలబడ్డారు. తాజాగా పార్టీ వీడిపోయిన స్టేషన్‌ఘనపూర్‌ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి, తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్‌ నుండి వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇప్పించుకున్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మొదలు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా  చాలాకాలం కొనసాగడంవల్ల జిల్లాలో ఆయనకున్న విస్తృత పరిచయాలతో తన కూతురు కావ్య గెలుపుకోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారందరిని మచ్చిక చేసుకునే కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. వాస్తవంగా వరంగల్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో స్టేషన్‌ఘనపూర్‌ మినహా ఆరింటిని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుచుకుంది. బిఆర్‌ఎస్‌ గెలుచుకున్న స్టేషన్‌ఘనపూర్‌ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి తాజాగా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే నంటున్నారు. అలాగే ఇండియా కూటమిలో భాగమైన ఉభయ కమ్యూనిస్టుల సహకారాన్ని కూడా ఆయన అర్థిస్తున్నారు. కాగా కావ్య గెలుపుకోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 24న వరంగల్‌లోని మడికొండ జనజాతర సభలో పాల్గొనబోతున్నారు.

బిజేపీ నుంచి రంగంలో దిగిన ఆరూరి రమేష్‌, మొన్నటి వరకు బిఆర్‌ఎస్‌ వర్థన్నపేట ఎంఎల్‌ఏగా కొనసాగారు.  తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నాగరాజు చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన వరంగల్‌ పార్లమెంటు స్థానం నుండి పోటీచేసే విషయంలో  విఫలయత్నం చేశారు. అయినప్పటికీ బిఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయన్ను కాదని కావ్యను అభ్యర్థిగా ఎంపిక చేయడంతో అలిగిన రమేష్‌ కాషాయ కండువ కప్పుకున్నారు. కనీసం 12 స్థానాలనైనా గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న బిజెపి రమేష్‌ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నది. ఆయనకు టికెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు పార్టీ శ్రేణులను సమన్వయపర్చే పనిలో ముఖ్యనేతలున్నారు.  బూత్‌ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించడం, ప్రచారానికి కేంద్ర నాయకులను తీసుకొచ్చే కార్యక్రమాల్లో  ఆపార్టీ  తలమునకలవుతున్నది. ప్రధానంగా తెలంగాణలో మూడవ స్థానంలో ఉంటున్న బిజెపి అనుకోకుండా ఈ ఎన్నికల నాటికి  రెండవ స్థానానానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు 40 ఏళ్ల కింద 1984లో పివీ లాంటి దిగ్గజాన్ని ఓడిరచి దేశంలోనే రెండు స్థానాల్లో ఒకటిగా వరంగల్‌ను  గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టగా తీసుకుంటున్నది. ఆరూరి రమేష్‌ గురువారం తన నామినేషన్‌ను దాఖలు చేయనుండగా ఉత్తరా ఖండ్‌  ముఖ్యమంత్రి పుష్కరసింగ్‌ దామి హాజరుకానున్నారు.  కాగా కావ్య కూడా బిఆర్‌ఎస్‌కు చెయ్యి ఇవ్వడంతో ఇప్పుడు ఆ పార్టీ తన అభ్యర్థిగా డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను బరిలో నిలిపింది. హనుమకొండ జడ్పీ చేర్మన్‌గా కొనసాగుతున్న సుధీర్‌కుమార్‌ ఉద్యమ కాలంనుండీ బిఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ ఆయన పెద్దగా ప్రజలకు పరిచయంలేదు. అయినా ఆయన గెలుపును శాసనమండలి డిప్యూటీ చేర్మన్‌ డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంఎల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌లు భుజాన వేసుకున్నారు.  ఆయన్ను గెలిపించాల్సిందిగా బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ మంగళవారం వరంగల్‌లో పర్యటన సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఇప్పుడు వరంగల్‌ పార్లమెంటు స్థానంలో పోటీ పడుతున్న ముగ్గురు కూడా బిఆర్‌ఎస్‌ వాసనలున్నవారే కావడంతో ప్రజలు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం
ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌ పరిధిలో ఉన్న 34 మండలాల్లో మొత్తం 18 లక్షల 16 వేల 543 మంది వోటర్లున్నారు. వీరిలో పురుషులు 8 లక్షల 91వేల 940 కాగా, మహిళా వోటర్లు 9 లక్షల 24వేల 208 మంది. అంటే పురుష వోటర్లకన్నా మహిళా వోటర్లు దాదాపు 32 వేల 268 మంది ఎక్కువగా ఉన్నారు.గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ 6,63,756 వోట్లు పొందగా ..భారత్‌ రాష్ట్ర సమితి 5,03,298 మరియు భారతీయ జనతా పార్టీ 1,56,638 పొంది నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. కాగా 2014 నుంచి జరిగిన ఎన్నికలను బేరీజు వేసుకుంటే వరుసగా 2014లో కడియం శ్రీహరి  నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై 3 లక్షల 92వేల 574 వోట్ల ఆధిక్యతో గెలిచారు. కడియం రాజీనామా చేయడంతో 2015లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణపైన బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4 లక్షల 59 వేల 403 వోట్ల మెజార్టీని సాధించారు. అలాగే 2019లో అదే పసునూరి దయాకర్‌  కాంగ్రెస్‌ అభ్యర్థి దొమ్మాట సాంబయ్యపైన 3 లక్షల 50 వేల 298 వోట్ల ఆధిక్యతను సాధించారు. అయితే ఆ మూడు ఎన్నికలు కూడా బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఏ మేరకు మెజార్టీ సాధిస్తుందో చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *