ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిబ్బందితో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.గవర్నర్‌ స్వయంగా సాంప్రదాయ పొంగల్‌ వంటకాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆమె భగవంతుడిని ప్రార్థించారు. సాంప్రదాయిక పొంగల్‌ వంటకం, అంటే ‘పొంగడం’’ లేదా ‘‘మరుగుతున్నది’’ అని అర్థం. ఇది ప్రజలందరిని ఆరోగ్యంగా ఉంచినందుకు కృతజ్ఞతగా సూర్యుడికి అందించబడుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న పొంగల్‌ పండుగ సందర్భంగా మనకు లభించే సమృద్ధి, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలియజేయడం మన సంప్రదాయమని ఈ సందర్భంగా గవర్నర్‌ పేర్కొన్నారు. తమ కష్టార్జితంతో సమృద్ధిగా పంటలు పండిరచినందుకు గవర్నర్‌ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో భాగంగా గవర్నర్‌ మీడియా ప్రతినిధులకు మిఠాయిలు పంచి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారులు, రాజ్‌భవన్‌ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు గవర్నర్‌ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ అందరికీ సమృద్ధిగా సంతోషాన్ని, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని అందించాలని ఆమె ఆకాంక్షించారు. సాంస్కృతికంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగిన సంక్రాంతిని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం యొక్క ఉదాత్తమైన ఆలోచనలను ప్రేరేపిస్తుందని, ఈ సంతోషకర సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *