(సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారొత్సవాలు)
భారతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం గా మారింది. దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 22 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో… అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ అనేక మంది బాలలు పౌష్టికాహార లోపంతో భాధపడుతున్నారు. భారతదేశంలో ఆకలి, పౌష్టికాహార లోపాలపై ఇటీవల విడుదల్కెన నివేదిక అందరిని కూడా స్పందించేలా చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పౌరవేదిక పౌష్టికాహార లోపాలపై నివేదికను తయారుచేసింది.దేశంలోని అయిదేళ్లలోపు పిల్లల్లో ఇప్పటికీ 44.3 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. పౌష్టికాహార లోపాలపై ఇంతకుముందున్న సాధికారిక నివేదికలు, జాతీయ కుటుంబం ఆరోగ్య సర్వే-3, జిల్లాస్థాయిలో 2019-20 లో జరిపిన గృహ సర్వే లు తెలిపాయి. వాస్తవానికి ఈ సర్వేలతో పోలిస్తే పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ప్రస్తుతం తగ్గింది. 2019-2021 లో జిల్లా స్థాయి సర్వేలో ఇలాంటి తక్కువ బరువున్న పిల్లలు 53.1 శాతంగా వెల్లడ్కెంది. మూడో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని పిల్లల్లో 46 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. ఈ సర్వేను భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖే నిర్వహించింది. దేశంలోని మూడేళ్లలోపు పిల్లల్లో 47 శాతం తక్కువ బరువుతో ఉన్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో మూడోవంతు మనదేశంలోనే ఉన్నారు. అయితే అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్న కాలంలో కూడా 42 శాతంమంది పిల్లలు పౌష్టికాహార లోపాలతో తక్కువ బరువుతో ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ఇప్పటికీ 59 శాతం పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఈ సమస్య సగం మంది పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల పౌష్టికాహార సమస్యలపై విధానపరంగా ఎలాంటి ప్రాధాన్యముందో అర్థం చేసుకోవచ్చు. మరోవ్కెపు ఆహార సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న పౌష్టికాహార సవాళ్లను మరింత జటిలం చేశాయని నివేదికలు తెలుపుతున్నాయి. పిల్లల్లోనే కాదు, తల్లుల్లో కూడా తీవ్ర పౌష్టికాహార లోపాలున్నాయని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధిరేటుతో పోలిస్తే, భారతదేశం సాధించాల్సిన దానిలో కేవలం సగం మేరకే పౌష్టికాహార రంగంలో సాధించింధి . దేశంలోని మొత్తం మహిళల్లో మూడోవంతు తక్కువ బరువుతో ఉన్నారు. సూక్ష్మ పోషకాల లోపాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దేశంలోని పిల్లల్లో 80 శాతం, మహిళల్లో 56 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార రంగంలో కూడా తీవ్రస్థాయిలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నాయి.సామాజిక, ఆర్థిక అసమానతలు,పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యవస్థలో ఉన్న లోపాలకు, ఆరోగ్యపరమైన లోపాలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారిన వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వెనుకబడి ఉన్నారు. దేశంలో ఉన్న ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, తెగల పిల్లల్లో తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20 శాతం వరకూ అధికంగా ఉన్నారు. అదేవిధంగా పౌష్టికాహార లోపాలను తగ్గించడం కూడా ఈ వర్గాల ప్రజల్లో మందకొడిగా సాగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలే కాకుండా ముస్లిముల పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపాలు తీవ్రంగా ఉన్నాయి. తక్కువ విద్యాస్థాయి ఉన్న తల్లులున్న కుటుంబాల్లోని పిల్లల్లో పౌష్టికాహార లోపాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. బాలికల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వారి పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.
మనదేశంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా చ్కెనా, వియత్నాం, సెనగల్, థాయ్లాండ్, బ్రెజిల్, రష్యా,బ్రిటన్ లాంటి దేశాలు 2022 నాటికి పోషకాహార విషయంలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు సాధించే దిశగా ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ప్రస్తుతం సాధిస్తున్న ప్రగతితో పౌష్టికాహార రంగంలో సహస్రాబ్ది లక్ష్యాన్ని సాధించాలంటే 2040 వరకూ ఆగాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహార లోపాల వల్ల ఏర్పడే భౌతిక, ఆర్థిక, విజ్ఞానపరమైన నష్టం దేశ స్థూల దేశీయోత్పత్తిలో మూడుశాతం వరకూ ఉంటుందని అంచనా.
సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకాన్ని 1975లో ప్రారంభించారు. ఈ పథక ముఖ్య ఉద్దేశాలు: ఆరేళ్లలోపు బాలల సమగ్ర అభివృద్ధిని సాధించడం, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పౌష్టికాహారాన్ని, ఆరోగ్య విద్యను అందించడం. ఇది 33 ప్రాజెక్టులు, 4,891 అంగన్వాడీ కేంద్రాలతో మొదల్కెంది. ఇప్పటివరకూ 7,076 ప్రాజెక్టులను ఆమోదించారు. 19 లక్షల అంగన్వాడీ కేంద్రాలను తెరిచారు. ఈ పథకం కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 959.22 లక్షలు. ప్రజల పౌష్టికాహార స్థాయిని పెంచే విషయంలో వ్యవసాయ అభివృద్ధి కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్రే ప్రధానమైంది. దేశంలోని మొత్తం శ్రమశక్తిలో 52 నుంచి 58 శాతం వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. దేశంలోని మొత్తం గ్రామీణ ఆదాయంలో 55 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. గ్రామీణ మహిళా శ్రమశక్తిలో 80 శాతం వ్యవసాయ రంగంలోనే ఉంది. అందువల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచి, ఆదాయాలను సమకూర్చడం ద్వారా మహిళలు, పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచవచ్చు. కేవలం కొన్ని ఆరోగ్య, పౌష్టికాహార కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేం. వ్యవస్థాగత మార్పుల ద్వారా వ్యక్తిగత, సమాజ, కుటుంబ స్థాయిల్లో పౌష్టికాహార స్థితిగతులను మెరుగుపరచవచ్చు.
పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యక్తి, కుటుంబం, సమాజంపై ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయి, పేదరికాన్ని పెంచుతాయి. పేదరికం, పౌష్టికాహార లోపాలు అనే విష వలయాలుగా మారతాయి. శారీరక శ్రమ శక్తిని తగ్గిస్తాయి. సంపాదనా సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ఉద్పాదకత తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. రోగనిరోధకశక్తిని తగ్గించి, అంటురోగాల దుష్ప్రభావాన్ని తీవ్రతరం చేస్తాయి. విద్య, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం రోగ భారానికి పౌష్టికాహార లోపాలు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
అనేక అంశాలు పిల్లల పౌష్టికాహార స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి: తల్లుల విద్యాస్థాయి, కుటుంబ ఆర్థిక స్థితి, కుటుంబ, సమాజ స్థాయిలో పారిశుద్ధ్య సేవల అందుబాటు, పరిశుభ్రత, కుటుంబంలో మహిళల స్థితి, తల్లిపాలు పట్టటం లాంటివి. విద్యకు – ఆరోగ్యానికిబీ పారిశుద్ధ్య సేవల అందుబాటు – పరిశుభ్రతబీ తాగునీరు – పోషకస్థితికి మధ్యనున్న సంబంధాలను విధాన నిర్ణేతలు సరిగా అవగాహన చేసుకుని విధానాలను రూపొందించాలి.సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకం (ఐ.సి.డి.ఎస్.)ను మరింత బలోపేతం చేసేందుకు దాన్ని పునర్ వ్యవస్థీకరించడం, పౌష్టికాహార లోపాలు తీవ్రంగా ఉన్న 260 జిల్లాల్లో వివిధ రంగాల్లో చర్యలను ఏకీకృతం చేస్తూ కార్యక్రమాలను చేపట్టడం, పౌష్టికాహార లోపాలపై జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం, వ్యవసాయ అభివృద్ధి, పరిశోధన, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమం, ఆరోగ్యం, ఆహార భద్రత మొదల్కెన కార్యక్రమాలకు పౌష్టికాహార లక్ష్యాలను జోడించడం. పౌష్టికాహార లోపాలు కేవలం ఆరోగ్య సమస్యలనే సృష్టించవు, వినాశకర సామాజిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. ఆహార సబ్సిడీలు, ఆహార భద్రత కార్యక్రమాలపై విమర్శలు చేసేవారు దేశ పౌష్టికాహార స్థితిగతులపై వెల్లడవుతున్న ఈ గణాంకాలను చూసైనా అభివృద్ధి పట్ల సరైన దృక్పథాన్ని పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
అభివృద్ధికి మూలం చెప్పాలంటే పౌష్టికాహార సమస్యలకు పరిష్కారం చూపాలి. పౌష్టికాహార సమస్య సంక్లిష్టమైంది, బహుముఖమైంది. కేవలం ఒకే రంగంపైనే దృష్టి కేంద్రీకరించడం లేదా ఒకేరకమైన కార్యక్రమాన్ని అమలుచేయడం వల్ల ఈ సమస్యను ఎదుర్కోలేం. అనేక అంశాలు ఈ సమస్యపై ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో ముఖ్యమైనవి: కుటుంబ స్థాయిలో ఆహార భద్రత, నిరక్షరాస్యత ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత, ఆరోగ్య సేవలు చాలినంతగా, సరిగా అందుబాటులో లేకపోవడంబీ సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య సేవలు, పర్యావరణ పరిస్థితులు, కొనుగోలు శక్తి అందుబాటులో లేకపోవడం. అందువల్ల సంబంధిత రంగాలన్నింటినీ కలుపుకుని పౌష్టికాహార సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాన్ని రూపొందించాలి.ప్రస్తుతము గ్రామ స్తాయిలొ అంగన్వాడీ సెంటర్లు ద్వారా బాలింతలకు,గర్భిణి మహిళలకు బాలమృతం లాంటి పొడి మరియు పప్పులు,కోడి గుడ్లు ప్రతి రోజు అందచేస్తూ వున్నారు.అంగన్వాడీ పిల్లలకు రొజు గుడ్డు మరియు ప్రభుత్వ పాటశాల విధ్యార్థులకు వారానికి ముడు గుడ్లు, పప్పులు, ఆకుకూరలు,కూరగాయలతో తయారు చేసిన వేడి ఆహారంని పెడుతున్నారు.ప్రభుత్వ హాస్టల్లో అరటిపండు,గుడ్డు,రాగి లడ్డు,బిస్కెట్టు లాంటివి ఇస్తూ పిల్లలకు బలవర్ధక ఆహారం పెడుతూ వున్నారు.ముక్యంగ ఆధివాసి మహిళలు,ఆధివాసి ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్యం వహిస్తూ పౌష్టికాహార లోపం తో బాధపడుతున్నారు.విటమిను లోపం ప్రధానంగా వుంది.దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి గోలీలు,మాత్రలు అంధించాలి.ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేయాలి.ప్రజల్లో పౌష్టికాహారం పట్ల విస్తృత ప్రచారం చేయాలి.
– కామిడి సతీష్ రెడ్డీ,జడలపేట ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా’’, 9848445134.




