ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ సంజయ్ గాంధీ నగర్ లో పార్క్ స్థలాన్ని స్థానిక ఎమ్మేల్యే పోద్బలంతో కాబ్జా చేసిన వ్యక్తులు వారికి సహాకరించిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ గాంధీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంటి శ్రీనివాసాదవ్, ఉపాధ్యాక్షులు ఎఆర్.ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. తమ కాలనీ సొసైటికి చెందిన 487 గజాల పార్క్ స్థలం తనదే అంటూ మురళిధర్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అండతో 200 మంది పోలీసులు, ఎమ్మెర్వోతో కలిసి వచ్చి తమకు చెందిన పార్క్ స్థలం అధీనంలోకి అక్రమంగా తీసుకున్నారని తెలిపారు. దీనిపై తాము కోర్టు వెళ్లిన అధికార దర్పంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు అధికారులు కోర్టు దిక్కారణకు పాల్పడ్డారని వారు తెలిపారు. అధికారంలో ఉంటే కోర్టు ఆదేశాలను పట్టించుకోరా అని వారు ప్రశ్నించారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్, బీఎస్పీ అగ్రనేతలను కలిసి వారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు ఈ విషయంలో చొరవ తీసుకుని సొసైటీకి చెందిన స్థలాన్ని తమకు ఇప్పించాలని లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో గొంటి విక్రమ్ యాదవ్, సొసైటీ ప్రతినిధులు నాగరాజు, ఉమేశ్, శ్రీనివాస్, లక్షయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.



