పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

  • చత్తీస్‌ఘడ్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం
  • మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు
  • ధృవీకరించిన బీజాపూర్‌ ఎస్పీ జితేందర్‌ యాదవ్‌
  • కాల్పుల మోతతో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ దండకారణ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీరోజు కాల్పుల మోతతో దద్దరి ల్లుతుంది. బుధవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు పోలీస్‌ బలగాల చేతిలో హతమయ్యారు. ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్రయాదవ్‌ దృవీకరించారు. సంఘటన స్థలం నుండి భారీగా ఆయుదాలు పేలుడు పదార్ధాలు మావోయిస్టు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో డిప్యూటి కమాండర్‌ నగేష్‌ అతని భార్య సోనీ మరో మహిళ కూడ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు గుర్తించారు.

మృతి చెందిన మావోయిస్టులు నగేష్‌ , గంగీ(మహిళ), వికాస్‌,  మిలిషీయా సెకండ్‌ కమాండర్‌ ముక్కా, మిలీషియా కమాండర్‌ సుక్కా, సోని(మహిళ)గా గుర్తించినట్లు ఎస్పీ జితేందర్‌ తెలిపారు.  ఈ ఆపరేషన్‌లో 210 కోబ్రా, 5 సిఆర్‌పిఎఫ్‌, 229 డిఆర్‌జి బలగాలు పాల్గొనట్లు తెలిపారు. మృతులు మావోయిస్టుల ప్లాటూన్‌ నెంబర్‌ 10కు చెందిన వారుగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మరి కొంతమంది మావోయిస్టులు గాయపడి ఉంటారని వీరి కోసం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేందర్‌ యాదవ్‌ తెలిపారు.

ఇటీవల కాలంలో ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లుతుంది. హోలీ రోజున బాసగూడలో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు చంపిన సంగతి తెలిసింది. ఈ సంఘటనపై పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీగా పోలీస్‌ బలగాలను చత్తీస్‌ఘఢ్‌ అటవీ ప్రాంతంలో మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలుగా అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు తరచూ ఎదురు పడటంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ అటవీ ప్రాంతంలో తుపాకీ మోతలు జరగటంతో అమాయక ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *