- డిగ్రీ పూర్తి చేయలేని వారి కోసం అవకాశం
- ఓపెన్ వర్సిటీతో తెలంగాణ పోలీస్ శాఖ ఒప్పండం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ పోలీసు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దూరవిద్య విధానంలో కానిస్టేబుళ్లు డిగ్రీ చదివేందుకు వీలుగా యూనివర్సిటీ, పోలీసు అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలను డీజీపీ జితేందర్, వర్సిటీ ఉన్నతాధికారులు మార్చుకున్నారు. డిగ్రీ పూర్తి కాని కానిస్టేబుళ్లు, ఏఎస్సైలకు దూరవిద్య విధానం అమలు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ గ్రాడ్యుయేషన్ ఉండాలని నిర్ణయించామని డీజీపీ జితేందర్ తెలిపారు. అందులో భాగంగా పోలీస్, ఓపెన్ యూనివర్సిటీల మధ్య గురువారం ఇక్కడ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ పొలీస్ డిపోర్ట్‌మెంట్‌లో టెన్త్, ఇంటర్ చదివిన కొందరు గతంలో పోలీస్ శాఖలో చేరారని గుర్తు చేశారు. అయితే వారికి గ్రాడ్యుయేషన్ కల్పించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. అందుకు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ దాదాపు 30 వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. వచ్చే ఐదేళ్లలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వారిగా ఉండాలని తమ సంకల్పమని డీజీపీ స్పష్టం చేశారు. యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకంటే మనం అన్ని రకాలుగా ఉత్తమ స్థానంలో ఉన్నామన్నారు. డీజీపీ జితేంద్రకు వచ్చిన అలోచనే ఇప్పుడు కార్యరూపం దాల్చిందన్నారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం వివిధ విభాగాల్లో, పలు పోస్టుల్లో పనిచేస్తున్న వారిలో కొందరికి డిగ్రీ అర్హత లేదని తెలిపారు. పలు కారణాలతో డిగ్రీ చేయకపోవడం లేదా డిగ్రీ మధ్యలోనే ఆపేసిన వాళ్లు సైతం ఉన్నారని వివరించారు. అలాంటి వారికి మా యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంతేకాక వీళ్లకు అదనంగా పోలీసింగ్‌కి కావాల్సిన శిక్షణ సైతం అందిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ట్రైనింగ్ సెంటర్లను తాము ఈ అభ్యర్థుల కోసం వినియోగించుకోనున్నామని వీసీ ఘంటా చెప్పారు.
పోలీసులకు డిగ్రీ కనీస విద్యార్హత



