సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 27;దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దొడ్డి కొమురయ్య చిత్ర దర్శకుడు సేనాపతి అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జనం కోసం బ్రతికి జనం కోసం అంకితమైన గొప్ప పోరాట యోధుడి జీవిత చరిత్రను సినిమా రూపంలో తీసుకొచ్చి అందరికీ తెలిసేలా సినిమాను రూపొందిస్తున్నామని ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుల మతాలకు అతీతంగా అందరిని కలిపి కమిటీలు వేస్తున్నామని తెలిపారు.అలాగే సినిమా నిర్మాణంలో కూడా ప్రతి జిల్లాకు ఒక 30 మందికి సహ నిర్మాతలుగా కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.జిల్లాలోని నియోజకవర్గ కమిటీల విస్తరణకు గానీ సినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరించడానికి ఉత్సాహం,అంకిత భావం కలిగిన వారు దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను సంప్రదించాలని కోరారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దొడ్డి కొమరయ్య కమిటీ జిల్లా చైర్మన్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు మాట్లాడుతూ… ఎంతోమంది మహనీయులు,త్యాగధనుల పోరాట ఫలితమే మన ఈ స్వేచ్ఛా జీవితమని ఈ తరుణంలో మనకోసం తమ తమ జీవితాలను సర్వస్వాన్ని త్యాగం చేసిన పోరాట యోధులు,మహనీయుల చరిత్రను తెలుసుకోవడం తప్పనిసరని ఈ సినిమా ద్వారా ఒక వీరుడి చరిత్రను తెలుసుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు బోయ రాములు,కొత్త కృష్ణమూర్తి,శ్రవణ్,చెల్లాపురం అనిల్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి




