పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసాం

  • ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌ది
  • 1127 మందికి  పోడు పట్టాలు పంపిణీ
  • రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌ ‌రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 10 : పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం జహీరాబాద్‌-‌పస్తాపూర్‌ ‌వద్ద గల ఎస్‌వి కన్వెన్షన్‌ ‌హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆందోలు, జహీరాబాద్‌ ‌నియోజకవర్గాలకు చెందిన 1127 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 1808.07 ఎక రాలకు సంబంధించి పోడు పట్టాలను మంత్రి హరీష్‌ ‌రావు అందజేశారు. ఝరాసంగం మండలంలో 7 గురికి 19 ఎకరాలు, జహీరా బాద్‌ ‌మండలంలో 213 మందికి 123.57 ఎకరాలు, కోహీర్‌ ‌మండలంలో 168 మందికి 218.57 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 593 మందికి 1392.52 ఎకరాలు, వట్‌పల్లి మండలంలోని 145 మందికి 53.16 ఎకరాలు, చౌటకూర్‌ ‌మండలంలోని ఒక లబ్ధిదారునికి 1.25 ఎకరాలకు సంబంధించిన పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి దన్నారు. పోడు భూముల ద్వారా పట్టాలు ఇవ్వడమే కాకుండా పది రకాల ప్రయోజనాలు గిరిజనులకు దక్కుతున్నవని మంత్రి తెలిపారు. భూమి పట్టాతో పాటు యాజమాన్య హక్కు, రైతుబంధు, రైతు బీమా, వారసత్వం హక్కు, ఉచిత విద్యుత్‌, ‌సబ్సిడీలపై పనిముట్లు, పంట నష్టం, గిరిజనులపై పెట్టిన  కేసుల రద్దు, పంట రుణాలు, సొసైటీల్లో అధికారాలు పోడు రైతులకు అంద నున్నట్లు మంత్రి వివరించారు.
గత ప్రభుత్వాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏనాడు ఆలోచించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలో 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని అన్నారు. మా తండాలో మా రాజ్యం అన్న గిరిజనుల కలను నిజం చేశారన్నారు. 95 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేశామని, సేవాలాల్‌ ‌జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గిరిజనుల కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు.
ప్రజల బాధలను తీర్చిన ఘనత కెసిఆర్‌దని, కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలకు ఆత్మబంధం, పేగుబంధం ఉంటుందన్నారు. ప్రముఖ సినీ నటుడు రజినికి తెలంగాణలో జరిగిన అభివృద్ధి అర్థమయింది కానీ, రాష్ట్రంలో ఉన్న కొంతమంది గజనీలకు అర్థం అవడం లేదని, కనిపిస్తలేదని ఎద్దేవా చేసారు. ఎంపీ బీబీ పాటిల్‌ ‌మాట్లాడుతూ…ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ, కష్టపడ్డ పోడు భూముల లబ్ధిదారులకు పోడుపట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రజల బాధలను తీర్చుతున్న ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని కోరారు. అందోల్‌ ‌శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్‌ ‌మాట్లాడుతూ.. భూములు సాగు చేస్తున్నా హక్కులు లేక బాధపడ్డ పోడు లబ్ధిదారులకు భూమి మీద హక్కు కల్పించిన ఘనత సీఎందని, ఎవరు చేయని పని సీఎం చేశారని అన్నారు. జహీరాబాద్‌ ‌శాసనసభ్యులు మాణిక్‌ ‌రావు మాట్లాడుతూ..గిరిజనుల ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ ప్రభుత్వంతో తీరిందన్నారు. పోడు భూములు పొందిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌ ‌మాట్లాడుతూ…గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించి ధైర్యంగా వ్యవసాయం చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. తరతరాలుగా భూమి సేద్యం చేసుకుంటున్న వారికి అటవీ హక్కుల చట్టం కింద జిల్లాలో 1127 మందికి పోడు భూముల పట్టాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, సేవాలాల్‌ ‌మహారాజ్‌ అమ్మవారి చిత్రపటాలకు పుష్పాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. గిరిజన లబ్ధిదారులు అనంతరం సీఎం కేసీఆర్‌ ‌చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా ఎస్పీ రమణ కుమార్‌, అదనపు కలెక్టర్‌ ‌వీరారెడ్డి, హ్యాండ్లూమ్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌చింతా ప్రభాకర్‌, ‌డీసీ ఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌, ‌రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు వి.భూపాల్‌ ‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌తన్వీర్‌, ‌డిసిసిబి వైస్‌ ‌చైర్మన్‌ ‌మాణిక్యం, జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *