ప్రతీఏటా సెప్టెంబర్ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్ తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం వహించారని నిలదీసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ దశాబ్ధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును అధికారిక వేడుకగా జరుపకపోవడం పట్ల పాలకులు తీవ్ర నిరసనను ఎదుర్కుంటున్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను ఏ పేరుతో పిలువాలన్న విషయంలో దశాబ్దాలుగా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. దాన్ని విద్రోహ దినమనాలా, విలీన దినోత్సవంగా జరుపుకోవాలా అన్న విషయంపైన ఇంకా నేటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతాపార్టీ అంటోంది. కాదు దాన్ని విలీన దినోత్సవంగా నిర్వహించాలని కాంగ్రెస్ అంటోంది. ఎంఐఎం పార్టీ ఆ రోజును విద్రోహ దినంగా పిలుస్తున్నది. తెలంగాణ చరిత్రలో ఈరోజు ఒక ప్రధాన ఘట్టానికి సంకేతం. అందుకే ఏ పేరుతో పిలిచినా ఆ రోజు ప్రత్యేకతను భావితరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాని నాటి ఉమ్మడి రాష్ట్రంలో గాని, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోగాని ఆరోజున అధికారిక కార్యక్రమాలేవీ జరుగడంలేదు. అయితే విపక్షాలకు మాత్రం ఇది ఒక ఆయుధంగా మారింది. ప్రతీ ఏడు లాగానే ఈసారి కూడా ఆయా పార్టీలు తమ సొంత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో దాన్ని ప్రచార అస్త్రంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సెప్టెంబర్ 17ను తమ ప్రచారానికి అనువుగా వాడుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా అదే రోజున బ్రహ్మాండమైన కార్యక్రమాలను రూపొందించుకున్నాయి. ఇప్పటికే రెండుమూడు సార్లు తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మరోసారి తెలంగాణకు సెప్టెంబర్ 17ననే తీసుకు రావాలని బిజెపి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సికింద్రాబాద్ పోలీస్ పర్యడ్ గ్రౌండ్లో సుమారు లక్ష మందితో బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించాలన్న కార్యక్రమాన్ని రూపొందించుకుంది. రానున్న ఎన్నికలకు గాను అభ్యర్ధులను ప్రకటించనున్న తరుణంలో బిజెపి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా అమిత్ షా తోపాటు ఈ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాబోతున్నాడన్న వార్త బిజెపి వర్గాల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది.
వాస్తవానికి ఇటీవల కాలంలో రాష్ట్రంలో బిజెపి దూకుడు కాస్తా తగ్గిందనే చెప్పాలె. కర్ణాటక ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా రావటం, ఇక్కడ దూకుడుగా ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని తొలగించడంతో పార్టీ కాస్త చప్పబడినట్లైంది. దానికి తగినట్లుగా ఎంతో మంది పార్టీలో చేరుతారనుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, యెన్నం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుండి నిష్క్రమించడం పార్టీ వర్గాలను కొంత నిరాశకు గురిచేసింది. దాన్ని అధిగమించి, కార్యకర్తల్లో పూర్వపు జోష్‌ను నింపేందుకు సెప్టెంబర్ 17ను ఆయుధంగా మార్చుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. విమోచన దినాన్ని అధికార పార్టీ అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ఎత్తి చూపడంతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు దాన్ని ఒక శుభ ముహూర్తంగా బిజెపి ఎన్నుకుంది. అంతే దూకుడును ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ కూడా తన కార్యక్రమాన్ని ఆదే రోజున ఎంచుకుంది. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటి సమావేశాలను ఈ నెల 16 నుండి 18 వరకు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా 17న భారీ ర్యాలీతోపాటు, బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టి, అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా ప్రారంభించింది. అయితే విచిత్రమేమంటే ఈ రెండు పార్టీలుకూడా తమ బహిరంగ సభకు సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్‌నే ఎంచుకున్నాయి.
కాని బిజెపి దాన్ని దక్కించుకోవడంతో చేసేదేమీలేక కాంగ్రెస్ తుక్కుగూడ కేంద్రంగా కార్యక్రమాలను సాగించే సన్నాహాలు చేసుకుంటోంది. సెప్టెంబర్ 17న సుమారు లక్ష మందితో ఏర్పాటు చేసే సభకు సోనియాగాంధీ వొస్తుండడంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు అయిదు ప్రధాన పథకాలను ప్రకటించబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే వాటిని అమలు చేసే హామీ ఆమె ఇవ్వనున్నారు. ఇకపోతే గత సంవత్సరం తీవ్రమైన రాజకీయ ఒత్తిడుల కారణంగా నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా మూడు రోజుల పాటు నిర్వహించింది. ఈసారి ఇప్పటివరకు దీనికి సంబందించి ఎలాంటి ప్రకటన చేయలేదుకాని, అదే రోజున దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడానికి ముహూర్తాన్ని నిర్ణయించింది. దీనివల్ల పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ నీటి సమస్యలు తీరనున్నాయి. కాగా అమృత మహోత్సవం ముగింపు కూడా అదేరోజు కావడం మరో విశేషం. మొత్తం మీద రాజకీయ పార్టీల పోటాపోటీలు ఎలా ఉన్నా సెప్టెంబర్ 17 మాత్రం తన ప్రాధాన్యాన్ని నిలుపుకుంటోంది.




