- తెలంగాణ ప్రజల చావులకు కారణమైంది
- ఫేక్ సర్వేలు, గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్‌కు అలవాటే
- మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటుంది…
- కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌రావు
- 15న హుస్నాబాద్‌లో జరిగే సిఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
సిద్ధిపేట / హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : 2004 ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్న నాటి టిఆర్‌ఎస్, ప్రస్తుత బిఆర్‌ఎస్ పార్టీని పొట్టన పెట్టుకుందామనీ చూసింది కాంగ్రెస్ పార్టీ కాదా? పొత్తులో ఉన్న టి(బి)ఆర్‌ఎస్ పార్టీని మోసం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. ఈ నెల 15న సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించే ఎన్నికల సభకు ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానుండటంతో మంగళవారం హుస్నాబాద్‌లో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ బోయినిపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..కామన్ మినిమమ్ పోగ్రామ్‌లో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని పెట్టి ఎంతో మంది తెలంగాణ ప్రజల చావుకి కారణం అయింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా? రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బిజెపి కావాలా? మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా? ప్రజలే ఆలోచన చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం గురించి వేరే చెప్పనక్కర్లేదన్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడే మొదటి సభ నిర్వహించారనీ, అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష నియోజకవర్గం అని, మంచి జరగుతుందని ఇక్కడ నిర్వహిస్తున్నారన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభను నిర్ణయించామన్నారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని, కనీసం టికెట్లు ఇచ్చుకొనే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరుగా మారిందన్నారు. ముఠా రాజకీయాలతో దిల్లీలో టికెట్ల పంచాయితీ నడుస్తుందనీ, బిఆర్‌ఎస్ టికెట్ ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో హుస్నాబాద్‌లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనీ, 8టిఎంసిలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామనీ, నీళ్లు వస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటే… ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నాయన్నారు. హుష్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం మీ అందరి అదృష్టం అని, ఈ నెల 15న బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొట్టమొదటి సభ హుస్నాబాద్‌లో జరుగుతుందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్ అవడం ఖాయమనీ, 2014, 18లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏవయితే చెప్తారో దానిని పక్కా చేసి సిఎం కేసీఆర్ చూపిస్తారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎందుకు బిఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి చెందింది..కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, ఒకటి కాదు అనేక పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రమే బిఆర్‌ఎస్ పార్టీ ప•థకాలు కాపీ కొట్టింది అంటే మనం ఆదర్శం కాదా?అని అన్నారు. మూడోసారి కేసీఆర్ విజయం పక్కా అని… ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ విజయవంతం చేయాలనీ, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. పండుగ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసి కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలకాలనీ, కేసీఆర్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఈ సభకు వస్తారనీ, అందరినీ ఆహ్వానించాలన్నారు. ప్రణాళికతో జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సభాస్థలానికి చేరుకునే విధంగా స్థానిక నాయకులు చూడాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.





