- ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 127 శాతం పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు
- పాలమూరు పచ్చబడింది….వలస వెళ్లిన వారు వాపస్ వొస్తున్నారు
- అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతా
- రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
- మెడికల్ హబ్‌గా మహబూబ్‌నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మహబూబ్ నగర్‌లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు భూమి పూజ
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ఒకప్పుడు వలసలకు, ఆకలికి, పేదరికానికి మారుపేరుగా నిలిచిన పాలమూరు ఇప్పుడు పచ్చబడిందని, గతంలో వలస వెళ్లిన ప్రజలు తిరిగి జిల్లాకు వాపస్ రావటమే కాకుండా, ఆంధప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుండి పని కోసం ఇక్కడికి వలస వొచ్చే పరిస్థితిలను తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్ నగర్‌కే ఇచ్చామని, ఓకే జిల్లాలో 3 వైద్య కళాశాలలు ఉన్న ఘనత దేశంలో ఏ జిల్లాకు లేదని, అది ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కిందని అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక ఈ విద్యా సంవత్సరం నుండే పారామెడికల్ (బిఎల్‌టి)లో 6 కోర్సులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాలీగా ఉన్న 969 వైద్య పోస్టులను ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్నామని, అదే విధంగా 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, రెండు నెలల్లో వాటి భర్తీ పక్రియను పూర్తి చేస్తామని, అప్పుడు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలోని మెడికల్ కళాశాలలో ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. దేశంలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న 3 వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, వివిధ పథకాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని మంత్రి తెలిపారు.
ఎంబిబిఎస్ సీట్ల విషయంలో దేశవ్యాప్తంగా గడచిన ఎనిమిదేళ్లలో 71 శాతం పెరిగితే, తెలంగాణలో 127శాతం ఎం బిబి ఎస్ సీట్లు పెరిగాయని, అదేవిధంగా మెడికల్ పిజి సెట్లలో దేశవ్యాప్తంగా 68 శాతం పెరిగితే తెలంగాణలో 112 శాతం పెరిగాయని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలతో పాటు, పారామెడికల్ కోర్సులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా మంజూరు చేస్తామని, రాష్ట్రంలో వైద్యులు బాగా పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు,అధికారులు అందరూ కలిసి పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే పాలమూరు ఇంకా పచ్చబడుతుందని, కృష్ణ నదీ జలాల్లో వాటాలను కేంద్ర ప్రభుత్వం తేల్చాలని ,తద్వారా నికర జలాలు వినియోగించుకునేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో క్యాథ్ ల్యాబ్, క్యాన్సర్ వైద్యానికి కూడా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం మూడాంటే మూడు వైద్య కళాశాలలు ఉండగా, గడచిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 12 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వొచ్చిన తర్వాతనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ఏ పేదవాడు వైద్య మందక చనిపోకూడదన్నదే తమ అభిమతమని, అందుకే జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలను కల్పిస్తున్నామని, జిల్లాను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ అధ్యయమని అన్నారు.
మహబూబ్ నగర్ కి వైద్యం కోసం వొస్తే కచ్చితంగా బతుకుతాం అనే భరోసాను కల్పిస్తామని, ప్రతి నెల జిల్లాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంతో ముందుకెళుతున్నామని, గతంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చ కష్టాలు ఎదుర్కొన్న జిల్లా అందరి సహకారంతో ఒక స్థాయికి తీసుకొచ్చామని, దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కు, శిల్పారామం, బైపాస్ రోడ్, ట్యాంక్ బండ్, ఐటి టవర్, ఫుడ్ పార్క్, చించోలి- భూత్పూర్ రహదారి, ఇలా ఎన్నింటినో తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్నిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 13 కోట్లతో ఎంఆర్‌ఐ, క్యాథ్ ల్యాబ్ మంజూరు చేసిందని ,కరోనా సమయంలో హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వచ్చి వైద్యం చికిత్స పొందిన విషయాన్ని మర్చిపోవద్దని, భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, అన్ని సౌకర్యాలను కల్పించడమే కాకుండా ఇబ్బందికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఒకేసారి 8 జిల్లాలలో వైద్య కళాశాలలు ప్రారంభించిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి లేదని తెలంగాణకు మాత్రమే అది దక్కిందని అన్నారు .రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో అందరూ గమనించాలని ఆయన కోరారు జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, డిసిసిబి అధ్యక్షులు నిజాం పాషా, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ,గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి ,కూచకుల్ల దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, స్పోర్టస్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మెడికల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ శశికాంత్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రామ్ కిషన్, జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మర్లు లో 70 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించనున్న సి సి రోడ్ పనులకు భూమి పూజ చేశారు.




