ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మంత్రి హరీష్ రావు తో కలిసి రెండో విడత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణి
పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక
రూపాయి అప్పు లేకుండా సొంతింటి కల సాకారం
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: నిరుపేదల బతుకు చిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఏర్పాటుచేసిన రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పటాన్ చెరు, భారతీ నగర్, రామచంద్రాపురం డివిజన్ల నుండి రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం బ్లాకులను కేటాయించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క రూపాయి లంచం లేకుండా, పైసా అప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన నిరుపేదలందరికీ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.నిరుపేదలకి సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల పాత్ర లేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు.పేదల సంక్షేమానికి పాతుపడుతామంటూ అమలు కానీ హామీలను ఇస్తున్న ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గుండెల నిండా ప్రేమతో నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



