మైనర్ రేప్ కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం
తక్షణం చర్యలకు కాంగ్రెస్ మహిళా బృందం డిమాండ్
డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్8: జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై డీజీపీకి మహిళా కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ బృందంలో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్, కొండా సురేఖ, తదితరులు ఉన్నారు.దర్యాప్తు కూడా సరిగ్గా జరగడం లేదన్న మహిళా బృందం.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోలీసులు కఠినంగా వ్యవరించాలన్న వారు.. హైదరాబాద్ లో చాలా పబ్స్ అక్రమంగా నడుస్తున్నాయని, ప్రశ్నించిన వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగితే రాష్ట్ర మహిళా మంత్రులు ఎక్కడికి పోయారు ? జాగృతి మహిళా అధ్యక్షురాలు కవిత.. బాలిక రేప్ కేసుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? బాలిక రేప్ పై మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు డ్మ అయ్యారని, పేదవాళ్లు నేరాలకు పాల్పడితే ఎన్ కౌంటర్ చేస్తారు… ధనవంతుల పిల్లలు నేరాలు చేస్తే వదిలేస్తున్నారని విమర్శించారు.
బడాబబులను రక్షించేయత్నాలు
జూబ్లీహిల్స్ అత్యాచార కేసును నీరుగారుస్తున్న పోలీసులు: దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసును పోలీసులు ఏడు రోజుల పాటు సాగదీసి నీరుగారుస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ విమర్శించారు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా రేప్ కేసులు జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ సక్ష ఎందుకు చేయడం లేదన్నారు. ట్విట్టర్‌లో ప్రతీ దానికి స్పందించే కేటీఆర్.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరి స్తున్నారని దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ సీపీ సీవీ ఆనంద్ మాటలు చూస్తుంటే నిందితులను
కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుందన్నారు. బాధితురాలు.. నిందితులను గుర్తు పట్టడం లేదని చెప్పడం దేనికి సంకేతమన్నారు. స్పష్టంగా వీడియో, ఫోటోలు బయటకు వచ్చాక ఆధారాలు ఇంకా ఏం కావాలన్నారు. దిగజారిన పోలీసు వ్యవస్థకు ఇది నిదర్శనమన్నారు. నిందితులను గుర్తించడానికి ఏడు రోజులు పట్టిందని, దిశ కేసులో రాత్రికి రాత్రి పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారని, పేదోడికి ఒక న్యాయం.. బడాబాబులకు ఒక న్యాయమా..? అంటూ ప్రశ్నించారు. కారులో ఎమ్మెల్యే కొడుకు లేడని చెప్పారని, వీడియోలు బయటకు వచ్చాక.. మధ్యలో ఎమ్మెల్యే కొడుకు వెళ్లిపోయాడని చెబుతున్నారని, ఎమ్మెల్యే పేరు చెప్పడానికి సీపీ ఆనంద్ భయపడుతున్నారని విమర్శించారు. నిందితులు మద్యం సేవించలేదని ఎలా సర్టిఫికెట్ ఇస్తారు..? ఏమైనా టెస్టులు చేశారా? అని ప్రశ్నించారు.



