పేదల చెంతకే ఆధునిక  వైద్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం, అనంతారం, దోమడుగు,  గుమ్మడిదలలో నూతనంగా నిర్మించనున్న ఐదు ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో పీహెచ్సీ లతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. నిరుపేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి లక్షల రూపాయలు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  ప్రతి సబ్ సెంటర్లో ఒక వైద్యుడు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో  టి డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, 55 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 90 శాతానికి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు.వీటితోపాటు నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.అనంతరం ప్రకృతి నివాస్ కాలనీ గేటు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. విగ్రహాన్ని సొంత నిధులతో అందించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్, సర్పంచులు రాజశేఖర్, మురళి, నరసింహారెడ్డి, దీపా నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, శంకర్, ఎంపీటీసీలు పద్మ కొండల్ రెడ్డి, బాలకిషన్, ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్,  రాజు, శేఖర్, మంగయ్య, అంజిరెడ్డి, నరహరి, ఆంజనేయులు, దేవేందర్ రెడ్డి మొగులయ్య, రాము, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *