‘‘కేంద్రం నుండి రాష్ట్రాలదాకా అన్ని ప్రభుత్వాలు అధికారం కోసం, వోట్ల కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అనవసర వరాలు ప్రకటిస్తూ వారిని సోమరులుగా చేయడం ఇప్పుడు కనిపిస్తున్న పెడధోరణులతో ప్రముఖమైనది సంక్షేమాలు అవసరమే. కాని సమాజ భవిష్యత్తును నాశనంచేసే అనవసర సంక్షేమాలు అవసరం లేదు. కాని ఆ విషయాన్ని, అధికారాన్ని కోరుకునే ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోవడంలేదు. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి దిగజారితే, అప్పులు పెరిగితే దానివల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలు ప్రభుత్వాలకు, పార్టీలకు తెలియకపోవు. ఐనా వారికి అవసరంలేదు. వాటి కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం, వాటికి వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయడం ప్రభుత్వాలకు నిత్యకృత్యంగా మారిపోయింది.’’
సమాజం ఒక దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చాలాసార్లు అంటుంటారు. కాని అది పబ్బంగడుపుకోవడానికే వారు అంటున్న మాటలని తేలిపోయింది. చేతలలోను, ఆచరణలోను అది జరగడం లేదన్నది రుజువయింది. నిజం చెప్పాలంటే సమాజమే అన్నిటికీ మూలం. సర్వ శాస్త్రాలు సమాజంలోంచే పుట్టాయి. ప్రజల బాగోగుల కోసమే రాయబడ్డాయి.
ప్రజలు దేవుళ్లంటే… దానర్ధం వారిని పూజిం చమని కాదు. గౌరవించమని భావం. వారిని మనుషులుగా చూడమని అర్ధం. వారి స్వేచ్ఛను కాపాడమని, వారి హక్కుల్ని రక్షించమని సారాంశం – ఇది జరగాలంటే అచ్చమైన, స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అమలులో ఉండాలి. దాన్ని మన స్ఫూర్తిగా పాటించే మనుషులుండాలి.
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రజానాయకుల్లో కొన్ని నిర్ధిష్టమైన నియమాలుండేవి. వారు తప్పులు చేయడానికి భయపడేవారు. రామ్మనోహర్ లోహియా, తరిమిళ నాగిరెడ్డి, రాజాజి, ప్రకాశం పంతులు, జయప్రకాష్ నారాయణ్ వంటి మహానాయకులు భారతదేశ చరిత్రలోనే అత్యంత విలువైన, విలువలు గల నాయకులుగా కీర్తించబడ్డారు. వారు అధికార పక్షంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా, వర్గ బేధాలున్నా, వర్ణబేధాలున్నా, సిద్ధాంత బేధాలున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకరినొకరు గౌరవించుకునే వారు. తాము ప్రజా సేవకులమని భావించే వారు. వారిని చూచి వారి అనుచరులు కూడా ఆ పద్ధతిలోనే నడిచేవారు.
ప్రజాస్వామ్యంలో ప్రజాలే ముఖ్యం. వారు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలే ముఖ్యం. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాలే దేశ భవితను నిర్ణయించగలవనే నమ్మక ముంది. ఆ నమ్మకం మన రాజ్యాంగం మనకు కలిపించింది. పౌరుల హక్కులు నాయకుల బాధ్యతలు, అసమానతలు – నాటి నిర్మూలను, బలహీనవర్గాలు వారి బాగోగులు, రిజర్వేషన్లు, అభివృద్ధి, సంక్షేమం మొదలైన ఎన్నో విషయాలు రాజ్యాంగంలో చెప్పబడ్డాయి. అందువల్ల మన దేశానికి సంబంధించినంత వరకు రాజ్యాంగమే మూలస్తంభం. రాజ్యాంగమే ఊపిరి.. కనుక అన్ని రంగాలు, అన్నివర్గాలు రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన అవసం ఉంది. ఈ దేశానికి సంబంధించినంత వరకు అలా ఉండడమే న్యాయం, ధర్మం. అలా ఉండని ప్రతిపని పెడధోరణి కిందే లెక్క పెడధోరణి అంటే పద్దతిని కాదని, నీతి నియమాలను తోసివేసి, అధికారం కోసం, డబ్బుకోసం, స్వార్ధం కోసం నిర్లజ్జగా, నిర్భయంగా పక్కదారి పట్టడం. ఇప్పుడు ఈ పెడధోరణులు అన్ని రంగాల్లోను విపరీతంగా పెరిగిపోతు న్నాయి. వాటిని అరికట్టాలంటే చట్టాలు, శాసనాలు కావాలి. వాటిని చిత్తశుద్ధితో అమలు చేసే యంత్రాంగమూ కావాలి. అంటే పెడధోరణులను అరికట్టగలిగే రాజకీయ వ్యవస్థా కావాలి. మరి ఆ రాజకీయమే గతి తప్పితే? పెడధోరణులకు పాలుపడితే? దేశభవిష్యత్తును నాశనం చేస్తే? ఇప్పుడు ఇవి ప్రజల ముందున్న ప్రధాన ప్రశ్నలు.
మన రాజ్యాంగం ప్రకారం ‘రాజ్యం’ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలి. ఎన్నుకో బడ్డ ఆ ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల కనుగు ణంగా నడుచుకోవాలి. తత్ భిన్నంగా నడువకూడదు. అలానడిస్తే అధికారిన్న దుర్వినియోగం చేసినట్టే లెక్క పెడధోరణిలో పనయిస్తున్నట్టే లెక్క ఐదు సంవత్సరాలు మాత్రమే పాలనలో ఉండే ప్రభుత్వాలను తమ ఇష్టమొచ్చినట్టుగా నడిచే హక్కుందా? ఆ హక్కు వాళ్లకు ఎక్కడి నుండి సంక్రమిం చింది? అనేవి కూడా ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలే.
ప్రశ్నించడమనేది రాజ్యాంగం నిర్దేశించిన ఒక ప్రాథమిక హక్కు ప్రశ్నతో ఎన్నో సవరణలు జరుగుతాయి. తప్పులు ఆగిపోతాయి. ప్రశ్న ప్రజల మాన ప్రాణాలకు, ఆత్మాభిమానానికి రక్షణగా నిలుస్తుంది. సహేతుకమైన ప్రశ్న ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది. అలాంటి ప్రశ్నను, ప్రశ్నించే విధానాన్ని గౌరవవించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాల మీదుంది. మరి అంతటి విలువైన ప్రశ్నను ఆదరించే బాధ్యతలను ప్రభుత్వాలు పాటిస్తున్నాయా? అలా పాటించకపోతే నియంతృత్వం కాదా? నియంతృత్వం కూడా ఒక రకమైన పెడధోరణే కదా?
ఇక ఎన్నికల తతంగంలోకి తొంగిచూచిన కొందరు ప్రజలు ఈ పెడధోరణులు శృతిమించాయనే భావిస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల్లో సిద్ధాంతాలు, నీతివం తమైన అభ్యర్థులు ప్రజలను ప్రభావితం చేసేవారు. ఇప్పుడు వాటికి బదులుగా డబ్బు ప్రభావితం చేస్తోంది. ఈనాడు ఎన్నికలంటే కోట్ల రూపాయల వ్యవహారం. అది సామా న్యునికి అందివచ్చేది కాదు. అలాంటప్పుడు సామాన్యుని వాణి చట్టసభల్లో వినిపించడం సాధ్యపడదు. అందువల్ల ఎన్నికల మీద డబ్బు ప్రభావం ఉన్నంతవరకు ఎన్నికల తతంగం ‘ఒక ఫార్స్’ అనే భావన ప్రజల్లో ప్రబలిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు వేల రూపాయల్ని వోటరు చేతుల్లో పెట్టి వారిని లంచగొం డులుగా మారుస్తున్నారు. అమాయకులైన వోటర్లు తమ అవసరాల కోసం ఆ డబ్బు తీసుకుంటున్నారు. దీనివల్ల ‘మీరు లంచం తీసుకుంటున్నప్పుడు, మేము తీసుకుంటే తప్పేంటో’ అనే సంకేతాన్ని అబ్యర్థులు చెప్పకనే చెపుతు న్నారు. ఈ తప్పుడు సంకేతాన్ని అందరు కాకపోయినా కొందరైనా గమనిస్తున్నారనేది వాస్తవం.
గెలిచిన అభ్యర్థి ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఏ స్థాయికి ఎదుగుతున్నాడో మనం గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికల కార్యక్రమం నీతివంతంగా మారినప్పుడు మాత్రమే చట్టసభలకు గౌరవం పెరుగుతందనేది ప్రభుత్వాలు, పార్టీలు గమనించాల్సిన విషయం..మరొక విషయం ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక నిర్దిష్టమైన పార్టీ ప్రణాళికతో గెలుస్తారు. అంతేకాదు ఐదు సంవత్సరాల దాకా ప్రజాభీష్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని కూడా ప్రతిజ్ఞ చేస్తారు. కాని ఆ ప్రతిజ్ఞను మరిచిపోయి స్వలాభం కోసం కొద్దిరోజుల్లోనే వేరే పార్టీలోకి మారిపోతు న్నారు. ఫిరాయింపుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గెలిచిన పార్టీలోనే ఐదు సంవత్సరాలు ఉండి ప్రజాసేవ చేయడమనేది ప్రజాప్రతినిధుల నైతిక బాధ్యత. ఆ నైతిక విలువల్ని మరిచిపోయి స్వలాభం కోసం చట్టాన్ని సాకుగా చూపి మూకుమ్మడిగా పార్టీలు మారడం ఒక దుర్మార్గమైన చర్య. కొన్ని దేశాల్లో పార్టీ మారాలంటే గెలిచిన పార్టీకి మరియు పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలవాలనే నియమముంది. అది మన దేశంలో లేకపోవడం ఈ పెడధోరణికి అవకాశం కలిపిస్తోంది.
కేంద్రం నుండి రాష్ట్రాలదాకా అన్ని ప్రభుత్వాలు అధికారం కోసం, వోట్ల కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అనవసర వరాలు ప్రకటిస్తూ వారిని సోమరులుగా చేయడం ఇప్పుడు కనిపిస్తున్న పెడధోరణులతో ప్రముఖమైనది సంక్షేమాలు అవసరమే. కాని సమాజ భవిష్యత్తును నాశనంచేసే అనవసర సంక్షేమాలు అవసరం లేదు. కాని ఆ విషయాన్ని, అధికారాన్ని కోరుకునే ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోవడంలేదు. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి దిగజారితే, అప్పులు పెరిగితే దానివల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలు ప్రభుత్వాలకు, పార్టీలకు తెలియకపోవు. ఐనా వారికి అవసరంలేదు. వాటి కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం, వాటికి వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయడం ప్రభుత్వాలకు నిత్యకృత్యంగా మారిపోయింది. ఋణ పరిమితులున్నా వాటిని లెక్క చేయడంలేదు. ఋణాలు పెరిగి పెరిగి, ఆర్థికంగా చితికిపోయి పూర్తిగా దివాలా తీసిన ‘శ్రీలంక’ లాంటి దేశాలు మన కళ్లముందు కనిపిస్తున్నా పాలకులు కళ్లు తెరవకపోవడం నిజంగా శోచనీయమే.
ఈ పరిస్థితుల్లో మనముందు ఒక ప్రశ్న నిలుస్తోంది. అది ఏమిటంటే ఐదు సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉన్న ప్రభుత్వాలకు సమాజ ఆర్థిక స్థితిగతుల్ని క్షీణింపజేసే అధికారం ఉంటుందా? అని ‘ఉండదు’ అనే సమాధానం ప్రశ్నలోనే ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు హద్దులు దాటుతున్నాయి? ఎందుకు మితిమీరిన అప్పులు చేస్తున్నాయి? ఆ అప్పులు ఎవరు కట్టాలి? ఎలా కట్టాలి? అనే సవాలక్ష ప్రశ్నలు ఎదురవు తున్నాయి. ఈ విషయాలను పాలకులు పట్టించుకోవ డంలేదు. ఈ పెడధోరణి పట్ల కనీసం ఆత్మ విమర్శ కూడా చేసుకోవడంలేదు.ఏ ప్రభత్వం ఎన్నిక కాబడ్డా బలహీనవర్గాలకు ప్రధాన్యత ఇవ్వాలి. అది రాజ్యాంగంలోనే నిర్దేశించబడింది. ప్రాధాన్యతనివ్వడం అంటే విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో వారికి అభివృద్ధి అవకాశాలు కల్పించడం.
రాజ్యాంగ మౌళిక సూత్రాల ప్రకారంగా బలహీనవర్గాలతో కలిపి అన్ని వర్గాలకు కూడా విద్య, వైద్య రంగాలు అత్యంత ప్రధానమైనది. విద్య, విజ్ఞానాన్ని పెంచితే వైద్యం, ఆరోగ్యాన్ని పెంచుతుంది. విజ్ఞానం, ఆరోగ్యం సమతుల్యంగా పెరిగిన సమాజాలు ఉన్నత సమాజాలుగా పరిగణించబడుతాయి. ఈ సత్యం తెలిసికూడా ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడం, వాటికి మౌళిక వసతులు కల్పించకపోవడం, ప్రైవేట్ రంగాలకు ప్రధాన్యతనివ్వడం మనం గమనిస్తున్న విషయమే. ప్రైవేటుకు ప్రాధాన్యత నివ్వడమంటే ప్రభుత్వ రంగ సంస్థల వెన్ను విరిచినట్టే దీనివల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. బీదలు మరింత బీదలవుతున్నారు. ఇది ఒక రకంగా పెడధోరణికి పరాకాష్ట. దీని కారణంగా బలహీన వర్గాలు చదువుకు దూరమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ వైద్యాలయాలు కుదేలైన విషయం అందరం గమనిస్తున్నదే.
రాజకీయాల్లో అభ్యంతరకరమైన మరొక పెడధోరణి కనిపిస్తోంది. అది రాజకీయ వారసత్వం, ఇప్పటి రాజకీయాల్లో అభ్యర్థి మరణిస్తేనో, ముసలి వాడైతేనో, మరో ఇతర కారణంతోనో వారి స్థానంలో వారివారి వారసులు వచ్చి తిష్టవేస్తున్నారు. వారు ప్రజలకు నచ్చకపోయినా, చదువులేకపోయినా, రాజకీయ అజ్ఞానులైనా అధికార పదవులను కైవసం చేసుకుంటున్నారు. ప్రత్యక్ష అధికార పదవులు కాకపోతే పరోక్ష అధికార పదవులను స్వంతం చేసుకుంటున్నారు. ఇంతకుముందు నాయకుల వెంట ఉన్న వారి అనుచరులకుగాని, పార్టీ విధేయులకుగాని వారసత్వం లభిచేంది. ఇప్పుడది కుటుంబ సభ్యులకు మారింది. ఈ రకంగా ప్రజాస్వామ్య ముసుగులో సాగుతున్న అవలక్షణం మన వ్యవస్థకు మంచిదికాదు. దీనివల్ల అర్హులకు అవకాశాలు దక్కడంలేదు. నిజమైన ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసేవకులు బిక్క ముఖాలు వేసుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు.
ఇది ఒకరకంగా పూర్వపు రాజరిక వ్యవస్థకు ప్రతిరూపమే. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. రాజకీయ పదవి ఉంటేనే తమ అక్రమ ఆస్తులను అక్రమ దందాలను, కాపాడుకోవచ్చన్న భావన కలుగడమే ఈ రాజకీయ వారసత్వానికి మూలమైన విషయంగా భావించాల్సి వస్తోంది. ఇది చాలా విచారించదగ్గ విషయం.ఇది పెడధోరణులకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏ రంగాన్ని పరిశీలించినా ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. కాని ఇది అభిలషనీయం కాదు. అందువల్ల అన్ని వర్గాల ప్రజలు ఈ విపరీత పరిణామాల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం నాది, ఈ సమాజం నాది అని అందరు పౌరులు కృతనిశ్చయం కలిగి ఉండాలి. ప్రలోభావాలకు లొంగకుండా తమ విచక్షణా జ్ఞానాన్ని నిరూపించుకోవాలి. పెడధోరణుల పట్ల నిరసన తెలియజేయాలి.
ఈ పెడధోరణుల పట్ల ప్రజలేకాదు, అన్ని రంగాలు కూడా తమ బాధ్యతను మరువకూడదు. ముఖ్యంగా రాజకీయ రంగం క్రమశిక్షణ కలిగి ఉండాలి. నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. మానవీయ విలువలకు ప్రాధాన్యమివ్వాలి. పరిమితులు దాటి విచ్చల తనానికి పాల్పడకూడదు.వోటరు బిచ్చగాడు కాదు, అతడే ప్రధానుడు అన్న భావన కలిగి ఉండాలి. తాము ప్రజా నాయకులం కాదు, ప్రజా సేవకులం అని భావించాలి. సుపరిపాలన వైపు బాటలు వేయాలి.ఇలా అందరూ మనసుపెట్టి ఆలోచిస్తే ఈ పెడధోరణులను అరికట్టడం పెద్ద పనేమీకాదు. దేనికైనా సంకల్పం ముఖ్యం కదా!!
పులి సారంగపాణి
అధ్యక్షులు, విశ్రాంత అధ్యాపకుల సంఘం(RCTAT), వరంగల్,9849267320.





