‘‘ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు అందించే నెలసరి పెన్షన్ ఎవరి దయ, భిక్ష, బహుమానం లేదా ఎక్స్‌గ్రేషియా కాదని’’ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై వి చంద్రచూడ్ 17 డిసెంబర్ 1983న డి యస్ సతారా కేసు విచారణ సందర్భంగా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. ఉద్యోగిగా వ్యక్తి అందించిన అమూల్య సేవలను గుర్తించి ఇచ్చే గౌరవప్రదమైన ఆర్థిక వెసులుబాటు మాత్రమే నెలసరి పెన్షన్ అని తీర్పులో స్పష్టం చేయబడిరది. పెన్షనర్లకు మైలురాయిగా నిలిచిన ఈ తీర్పును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏట 17 డిసెంబర్‌న దేశవ్యాప్తంగా ‘జాతీయ పెన్షనర్ల దినం’ ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది.
ఉద్యోగి తన జీవితంలో అతి ముఖ్యమైన వయసు, శక్తియుక్తులు, సమయాన్ని తను పని చేసే సంస్థ ప్రగతికి దారపోసి, సమాజోన్నతికి అనుక్షణం తపించిన నిస్వార్థ సేవకులుగా పెన్షనర్లు వెలకట్టలేని సేవలను అర్పిస్తారు. ఇలాంటి ఆదర్శ మూర్తులకు జీవిత చరమాంకంలో గౌరవం, సంక్షేమం, ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక వనరులు కల్పించడం మన కనీస కర్తవ్యమని తెలుసుకుంటూ, వారికి వృద్ధాప్యంలో ఊత కర్రగా నిలబడుతూ సమాజం తన బాధ్యతలను స్వీకరించాలి.
పెన్షనర్ల వృత్తి నైపుణ్యాలు అపారం
దేశవ్యాప్తంగా 58 మిలియన్లకు పైగా సీనియర్ సిటిజన్లు వివిధ రకాలైన పెన్షన్లను పొందుతున్నారు. ఉద్యోగి వేతనంలో దాదాపు సగం వరకు పెన్షన్‌గా జీవితకాలం ఇవ్వబడుతున్నది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పెన్షన్లను భారంగా భావించరాదని, అది వారి బాధ్యతని మరువరాదు. పింఛన్లు పొందుతున్న సీనియర్ సిటిజన్ల అపార కార్యాలయ అనుభవం, వృత్తి నైపుణ్యం, కార్యదక్షతలను దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు వినియోగించుకోవాలి. పెన్షనర్లు స్వచ్ఛంధ సేవకులుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పెన్షనర్లను జాతి విలువైన మేధో సంపదగా పరిగణించి, సమాజాభివృద్ధిలో భాగం చేయాలి. వయోవృద్ధ పెన్షనర్ల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తమ పౌరులకు వృద్ధాప్య, వికలాంగుల, వితంతు, పలు వ్యాధిగ్రస్థులకు ఆసరా పింఛన్లు లాంటి పలు రకాల నెలసరి ఆర్థిక చేయూతలను అందిస్తున్నారు.
పెన్షన్లు పలు రకాలు
భారతదేశంలో పెన్షన్లు 3 రకాలుగా అమలు అవుతున్నాయి. ఉద్యోగులకు అందించే సాధారణ పెన్షన్, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధారిత పెన్షన్, అసంఘటిత రంగంలో నేషనల్ సోషియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఆధారిత పెన్షన్లు అందించబడుతున్నాయి. 01 జనవరి 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వేతర రంగ ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపియస్) అమలులోకి వచ్చింది. భారత కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్’ పేరుతో ఫిబ్రవరి 2019 నుంచి అసంఘటిత శ్రామికవర్గాలకు నెలసరి రూ: 3,000/-ల పెన్షన్ ఇస్తున్నారు.
ఆరోగ్యం, ప్రయాణాలు, పన్ను రాయితీలు, సంరక్షణ కేంద్రాలు, వినోద విహార ఏర్పాట్లు లాంటి చేయూతలను పెన్షనర్లకు అందించాలి. నిన్నటి ప్రగతి రథానికి ఇంధనంగా పని చేసిన ఉద్యోగులను నేటి ప్రగతి రథచక్రాల కందెనలుగా పెన్షనర్ల సేవలను వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడు తన శక్తియుక్తుల ఆధారంగా దేశాభివృద్ధిలో భాగం కావడం వల్ల జాతి ఉన్నతి సులభతరం అవుతుందని మరువరాదు. పెన్షనర్లు పనికిరాని వారు కాదని, అపార పనిమంతులని గుర్తించిన సమాజం సరైన దిశలో ప్రయాణిస్తుందని నమ్మాలి.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037




