పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు

  • అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇస్తూనే ఉంటాం
  • బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌సంజీవ్‌ ‌చద్దా కీలక వ్యాఖ్యలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సంజీవ్‌ ‌చద్దా అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. అదానీ గ్రూప్‌ ‌షేర్లలో ఒడుదొడుకులను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం ఇచ్చిందీ మాత్రం వెల్లడించలేదు. ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌ ‌దక్కించుకున్న సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌ ‌దక్కించుకుంది.

ఈ ప్రాజెక్ట్ ‌కోసం అదానీ గ్రూప్‌నకు బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని చద్దా తెలిపారు. కొన్ని పరిమితులకు లోబడే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. హిండెన్‌ ‌బర్గ్ ‌షాక్‌తో ఇప్పటికే 500 మిలియన్‌ ‌డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ ‌చేయడానికి అదానీ గ్రూప్‌ ‌సిద్ధమైన వేళ చద్దా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ కుబేరుల్లో టాప్‌-3‌కి వేగంగా ఎదిగిన గౌతమ్‌ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఓ నెల క్రితం 120 బిలియన్‌ ‌డాలర్లతో మూడో స్థానంలో ఉన్న అదానీ సంపద విలువ ఇప్పుడు 50 బిలియన్‌ ‌డాలర్ల దిగువకు (49.1 బిలియన్‌ ‌డాలర్లు) చేరింది. దీంతో ఈ సూచీలో 25వ స్థానానికి చేరారు. రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అం‌బానీ 83.6 బిలియన్‌ ‌డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *