పుస్తకాలే మంచి నేస్తాలు

‘‘అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర సాంకేతిక, గణిత, ఆర్థిక, రాజకీయ, మనోవికాస తదితర రంగాల్లో మనిషిని అత్యున్నతంగా  తీర్చిదిద్దేవి పుస్తకాలే.’’

ఆది మానవ దశ నుంచి ఆధునిక మానవుని విజ్ఞానానికి, నాగరికత పురోభివృద్ధికి, సంస్కృతి శిఖరం వరకు పుస్తకాలే నిలువెత్తు సాక్ష్యం. పుస్తకం చదవడంలో మునిగి (నిమగ్నమై)న మనిషి పుట్టలో మునిగిన ముని లాంటి వాడని విశ్వసిస్తారు. పూర్వం తాళపత్ర గ్రంథాలను పవిత్రంగా భావించిన తరాలు ఉండే వారని చదివినాము. నాడు పుస్తకం హస్త భూషణం.. నేడు ఆ హస్తంలోకి సెల్‌ ‌చేరింది, మన ఇంట్లోని పుస్తకాల గదిలోకి టీవీ చేరింది. అవి మనిషిని, మనసు ఆలోచనలను కట్టి పడేశాయి. కానీ అది ఆరోగ్య కరం, విజ్ఞానవంతం కానే కాదు. నేటి తరం పుస్తకాలు చదవడం తగ్గిపోయి అలా చదివే వాళ్ళను పుస్తకాలు చదివే పురుగు అనే హేళన స్థాయికి దిగజారడాన్ని వీడి పుస్తకాలు చదువుదాం, విజ్ఞానం పెంచుకుందాం అనే స్పృహతో కదులుదాం…అయినా ప్రపంచ దేశాల కంటే మనదేశంలోనే పుస్తకాల చదువర్లు ఎక్కువ అని తెలుస్తుంది. అంతేకాదు ఆధునిక టెక్నాలజీ వచ్చి నూతన పరికరాల వినియోగం అతిగా వాడకంలో ఉన్న అమెరికా, స్వీడన్‌ ‌బాలల మేధో పరిజ్ఞాన రంగంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది.

పుస్తక పఠనం మీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల బాలలు ప్రజ్ఞా పాటవాల్లో చాలా ముందంజలో ఉన్నారని, ప్రొఫెసర్‌ ‌హెనికా రోజేన్‌ ‌తెలిపారు. అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర సాంకేతిక, గణిత, ఆర్థిక, రాజకీయ, మనోవికాస తదితర రంగాల్లో మనిషిని అత్యున్నతంగా  తీర్చిదిద్దేవి పుస్తకాలే. తరాలు మారినా.. కాలానుగుణంగా ఎన్నెన్నో మార్పులు సంభవించినా.. ఆన్లైన్‌ ‌చదువులైనా.. ఆధునిక పరికరాలైన టీవీలు, సెల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు ఎన్ని వచ్చినా మనిషి తన స్వతఃసిద్ధ ఆలోచన శక్తిని తగ్గిస్తాయి. కానీ చరిత్ర, వర్తమాన, భవిష్యత్తు నిర్ణయాలకు, నిర్మాణాలకు, మనిషి వికాసానికి, ప్రగతికి, పరిణతికి, ఈ జగత్తులోని అన్ని శక్తులకు కేంద్ర బిందువు పుస్తకమే, అదే తార్కాణ మని మరవరాదు.

ఆధునిక డిజిటల్‌ ‌టెక్నాలజీలో కూడా పుస్తకాలు ఈ- బుక్స్ ‌రూపంలో దర్శనమిచ్చి రూపాంతరం చెందినా దేనికైనా పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు రాదు రాబోదు, పుస్తకమేనిత్యం సత్యం. ఈ జగతిని నవ్య పథాన నడిపించుతుంది. అలా ప్రపంచంలో, దేశంలో అంతర్జాతీయ, జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనలు ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నాయి. భయంకరమైన కరోనాకాలంలో కొంత స్తబ్దత ఏర్పడినా ఆ తర్వాత కాలంలో పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయి. అలా మన రాష్ట్రంలోని భాగ్యనగరం (హైదరాబాదు)లో తరతరాలుగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. అలా ‘‘35 వ, జాతీయ పుస్తక ప్రదర్శన బుక్‌ ‌ఫెయిర్‌ ‘‘ఎన్టీఆర్‌ ‌స్టేడియంలో 22 డిసెంబర్‌ 2022 ‌నుండి 1 జనవరి 2023 వరకు నిర్వహించబడుతుంది. ఈసారి ఈ పుస్తక ప్రదర్శనలో 300 వరకు పుస్తక స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.అందులో రచయితల,ముఖ్యమంత్రి పేరుతో స్టాల్‌  ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రచార, ప్రసార మాధ్యమాలు ఈ పుస్తక ప్రదర్శనకు తగినంత ప్రచారం కలిగిస్తున్నాయి.

మరోవైపు ఈ పుస్తక ప్రదర్శనలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కోల్‌ ‌కతా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రచురణ విభాగాలు పబ్లిషర్లు వారి వారి స్టాల్స్ ‌ను ఏర్పాటు చేశారు. ఈ 35వ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాద్‌, ఎన్టీఆర్‌ ‌స్టేడియంలోని ప్రాంగణానికి ‘‘ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు’’ పేరును పెట్టినారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల గ్రంథాలయాలకు పుస్తకాలు అందించేందుకు ప్రత్యేక పుస్తక దాతల డొనేషన్‌ ‌బాక్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేయడం అభినందనీయం, అంతేకాకుండా ఈ పుస్తక ప్రదర్శనలో ప్రతి రోజు సాహితీ సభలు, చర్చలు, పుస్తక ఆవిష్కరణలు జరగడం కోసం ఏర్పాటు చేసిన వేదికకు ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ ‌పేరు పెట్టడం తెలంగాణ ప్రత్యేకతను చాటుతుంది. ఇక్కడి స్టాల్స్ ‌లో వివిధ సాహితీ ప్రక్రియలోని సాహిత్యము, నవలలు, రాజకీయాలు, ఆధ్యాత్మికత, బాలసాహిత్యము, శాస్త్ర విజ్ఞానం, న్యాయ, వైద్య  మరియు ఆధ్యాత్మిక, జ్యోతిష్యం ఇలా సమాజంలో ఉండే విభిన్న రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగింది.

అలనాటి ఆది కవులు రాసిన కాలపు పుస్తకాల నుండి నేటి ఆధునిక కవులు, రచయితల రచనలు ఈ పుస్తక ప్రదర్శనలో అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు నిన్న మొన్న కన్ను తెరిచిన నవ కవులు, రచయితలకు పుస్తకాలతో పండుగ వైభవం కొనసాగుతుంది. ఈ పుస్తక వైభవానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని నిలుపుదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయం. అదే విధంగా రచయితలను ప్రభుత్వాలు ప్రోత్సహించి పుస్తక ముద్రణకు సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది అని గమనించండి. ఇందులో రచయితల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నూతన రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ జాతీయ పుస్తక ప్రదర్శన దేశంలోనే రెండో స్థానాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ మన హైదరాబాదులో ఇంత పెద్ద పుస్తక ప్రదర్శన జరగడం మన ఖ్యాతిని రెట్టింపు చేస్తుంది, ఇది ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. మస్తక ఉత్తేజానికి పుస్తకమే పరమ ఔషధము. మానవుడు సృష్టించిన వాటిలో అన్నింటికంటే అత్యంత అద్భుతమైనది పుస్తకమే.

అందుకే అంటారు లోకాలలో ఏది నశించినా విద్య నశించదు, అక్షరం క్షయం లేనిది ముమ్మాటికి ఇది కాదన లేని నిజం. అంతేకాదు ‘‘ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే అసలు సిసలైన అస్త్రాలు’’ అలాంటి పుస్తకాలను చదవడం వచ్చిన వాడు చదువుకోకపోతే, చదువు రాని వారిలో చైతన్యం ఎలా పెంచగలరు.ఈ సమాజ వికాసంలో మానవ ప్రగతిలో నిక్కముగన్‌ ‌పుస్తకాలే ప్రాధాన్యతను సంతరించుకున్నాయనేది అనేది నిర్వివాదాంశం. ఆ  బాధ్యత ప్రభుత్వాలు, చదువుకున్నవారి పై ఎక్కువగా ఉందని భావించండి. ఇటు ప్రభుత్వాలు, చదువుకున్న వారు తమ బాధ్యతను నిర్విఘ్నంగా కొనసాగించాలి. ‘‘నువ్వు చదువుకోకపోతే, జీవిత ధ్వనులను వినకపోతే.. నిన్ను నువ్వు అభిమానించుకోకపోతే నీవు మెల్లగా మరణించడం మొదలైనట్లే’’ అని హెచ్చరించాడు-పాటోనేరడా. ఇది అక్షర సత్యం మనసును నిత్య నూతనంగా యవ్వనంలో ఉంచాలంటే పుస్తకాలను మించిన పరమ ఔషధాలు, ప్రేరకాలు ఈ లోకంలో లేనే లేవు. నిజమే.. పుస్తకాలను మించిన ఆకర్షణ ఏముంది? పుస్తకంలోని సత్తా అంతా ఇంతా కాదు. మనిషిని కదుపుతుంది, పట్టి కుదుపుతుంది, మనసును తడిపే పుస్తకాలు మనిషిని నడిపిస్తాయి. దీప స్తంభాలై విజ్ఞానాన్ని ప్రసరింపజేస్తాయి. అందుకే ‘‘పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అన్నది విషయం( అంశం )కాదు.

పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటికి తీస్తున్నాయి అన్నదే ముఖ్యం. నేటి మిత్రులు రేపు శత్రువులు కావచ్చు, తన బిడ్డలే తనను కాదనవచ్చు, నమ్మినవారు మోసగించవచ్చు కానీ లౌకిక ప్రపంచంలో మంచి నమ్మదగిన నేస్తాలు ముమ్మాటికీ పుస్తకాలు మాత్రమే. మన కాళోజీ నారాయణ రావు చెప్పినట్లుగా ‘‘చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’’.. అన్న స్పూర్తితో  నేటి సమాజం వారి అందమైన ఆకాశహార్మ్యాల్లో కానీ పేదింటి గుడిసెలో కానీ విలువైన పుస్తకాల కోసం గది(చోటు)నో ఏర్పరచుకొని పుస్తకాలకు పునర్‌ ‌వైభవం తెద్దాం. ఏమంటారు..?
– మేకిరి దామోదర్‌, ‌సోషల్‌ ఎనలిస్ట్, ‌వరంగల్‌, 9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *