- ప్రజలకు సంతృప్తినిచ్చే పథకాలను ప్రవేశపెట్టబోతున్నాం
- ముఖ్యమంత్రి కెసిఆర్ అదే పని మీద ఉన్నడు
- నేడో, రేపో ప్రజల మధ్యకు వొస్తడు
- కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే మళ్లీ కరెంటు కష్టాలే
- రైతుబంధుకు రామ్ రామ్..దళిత బందుకు జై భీమ్..
- బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
చిట్యాల(భూపాలపల్లి/ పరకాల), ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో మళ్లీ ఎన్నికలకు వొస్తున్నదని తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ పేరెత్తితేనే పారిపోయే బిజెపి పార్టీ నేటికీ తెలంగాణపై విషయం కక్కుతూనే ఉన్నదని ఆరోపించారు. ఆ నాయకుల నక్క విన్యాసాలను ప్రజల్లో బహిర్గతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పులిలా బయటికి రాబోతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇంకా ఏం చేయాలనే దానిపై వ్యుహరచన చేస్తూ వినూత్నమైన సంక్షేమ పథకాలతో బయలుదేరాడని వివరించాడు. నేడో రేపో ప్రజాక్షేత్రంలో అడుగుపెడతాడని నక్కజిత్తుల నాయకులంతా పరారు కావాల్సిందేనని ఎద్దేవా చేశాడు. జయశంకర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవన సముదాయం, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలను సోమవారం కేటీఆర్ ప్రారంభించారు.
70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సాధించిందేమీ లేదని, వారి హయాంలో ప్రగతి శూన్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజల చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించడంలో తప్పేమిటని ప్రశ్నించాడు. ప్రజలు గందరగోళం కాకుండా గుండెల మీద చేయి వేసుకుని, ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు బానిసలని విమర్శించాడు. కాంగ్రెస్ కర్ణాటక, బిజెపి గుజరాత్ అధిష్టానం కింద పని చేయాల్సిందేనని ఆ పార్టీలకు స్వతంత్ర నిర్ణయాలు ఉండవని అన్నాడు. బిఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే స్వతంత్రులని, దిశా నిర్దేశం కూడా వారికి అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశాడు. బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు నాలుగు అంశాలు ప్రధానమైనవని వివరించాడు. కాంగ్రెస్ హయాంలో వచ్చి పోయే కరెంటుతో రైతులు ఎంత గోసపడ్డారో గుర్తు చేసుకోవాలన్నారు.
గడిచిన 60 ఏళ్లలో మహిళలు మంచినీటి కోసం బారులు తీరి, బోరింగుల వద్ద క్యూ కట్టిన రోజులను మరిచిపోవద్దన్నారు. సాగునీరు లేక బావుల కాడ నిద్రాహారాలు మాని, రైతన్నలు పస్తులతో నీరుపారించింది గుర్తు చేశాడు. ప్రధానంగా రైతులకు కరెంటు, సాగునీరు, పల్లెల్లో తాగునీరు, సంక్షేమ పథకాలను తొమ్మిదిన్నర ఏళ్ళల్లోనే సాధించిన ఘనత కేసిఆర్ ది కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఇంతకన్నా అభివృద్ధి చేయగల నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా? అని ప్రశ్నించాడు. బిఆర్‌ఎస్ పార్టీకి ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పాడు. కాంగ్రెస్, బిజెపిలకు ముఖ్యమంత్రి ఎవరో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించాడు. టిక్కెట్లు రావడమే ఆ పార్టీ నాయకులకు కష్టమని ఇక ముఖ్యమంత్రి మాట దేవుడు ఎరుగునని చెప్పాడు. వారికి టిక్కెట్లు ఇచ్చేది, పథకాలను అమలు చేసేది ఢిల్లీలో, గుజరాత్ లో మాత్రమే ఉంటుందని ఇప్పుడు సీను కర్ణాటకకు మారిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కు కర్ణాటక, బిజెపికి గుజరాత్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయని కేటీఆర్ వెల్లడించాడు.
అయితే అట్టి డబ్బులు మన ప్రజలవేనని బెంగ పెట్టుకోకుండా ఇబ్బంది పడకుండా వారు పంచే డబ్బులను తీసుకోవాల్సిందేనని పిలుపునిచ్చాడు. కాంగ్రెస్ బిజెపిల డబ్బు తీసుకుని, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలనేది మర్చిపోకూడదని మరోసారి స్పష్టం చేశాడు. కారు గుర్తుకు ఓటేస్తే నీళ్లు, కాంగ్రెస్ కు వేస్తే కన్నీళ్లు వస్తాయన్నారు. ఆ పార్టీలు అధికారంలోకొస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ బుట్ట దాకలవుతాయని చెప్పాడు, రూ. 200 రూపాయల పింఛన్ ను రూ. 2000 చేసిన ఘనత కేసిఆర్ ది కాదా అని అన్నాడు. రాష్ట్రంలో 24 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని, పరకాలలో చల్లా ధర్మారెడ్డిని భారీ విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని వికలాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





